Menstrual Disorders: నెల వెతలు!

మహిళ శరీరంలో అదేదో అలారం మోగినట్టు నెల నెలా రుతుస్రావ పలకరింపు. సంతానోత్పత్తిలో భాగంగా గర్భాశయంలోని పొర మందం కావటం.. గర్భధారణ జరగకపోతే అది విచ్ఛిన్నమై రుతుస్రావం రూపంలో బయటకు రావటం.. అంతా క్రమ పద్ధతిలో సాగే ప్రక్రియ.

Updated : 09 Jan 2024 07:04 IST

మహిళ శరీరంలో అదేదో అలారం మోగినట్టు నెల నెలా రుతుస్రావ పలకరింపు. సంతానోత్పత్తిలో భాగంగా గర్భాశయంలోని పొర మందం కావటం.. గర్భధారణ జరగకపోతే అది విచ్ఛిన్నమై రుతుస్రావం రూపంలో బయటకు రావటం.. అంతా క్రమ పద్ధతిలో సాగే ప్రక్రియ. ఇది సహజమే అయినా దీని చుట్టూ రకరకాల సమస్యలు ముడిపడి ఉండటం గమనార్హం. రజస్వల త్వరగానో, ఆలస్యంగానో అవటం దగ్గరి నుంచి సమయానికి నెలసరి రాకపోవటం.. అయినా ఎక్కువో, తక్కువో కావటం.. ఆ సమయంలో నొప్పి.. ముందు నుంచే చిరాకు, ఆందోళన వంటివెన్నో మహిళలను ఇబ్బంది పెడుతుంటాయి. అయోమయానికీ గురిచేస్తుంటాయి. ఇలాంటి నెల వెతలపై (Menstrual Disorders) సమగ్ర కథనం మీకోసం.

నెలసరి మామూలు విషయమే గానీ ఇదో సంక్లిష్ట చర్యల సమాహారం. ముందుగా మెదడు సంకేతాలు పిట్యుటరీ గ్రంథిని ప్రేరేపించి.. ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌ హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తాయి. ఇవి అండాశయాలను ప్రేరేపితం చేసినప్పుడు అండాలు విడుదలవుతాయి.మరోవైపు అండం ఫలదీకరణ చెందితే పిండం కుదురుకునేందుకు గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర మందంగా తయారవుతూ వస్తుంది. ఒకవేళ గర్భధారణ జరగకపోతే   ఇది విడిపోయి, రుతుస్రావం రూపంలో అండంతో పాటు బయటకు వచ్చేస్తుంది. దీన్నే నెలసరిగా పిలుచుకుంటాం. అనంతరం తిరిగి గర్భాశయంలో పొర ఏర్పడటం మొదల వుతుంది. నెల నెలా రుతుస్రావం అవుతున్న కొద్దీ అండాల సంఖ్యా తగ్గుతూ వస్తుంది. ఇవి వెయ్యి కన్నా తగ్గితే   నెలసరి నిలిచే దశ మొదలవుతుంది. ఈ చట్రంలో మహిళలకు ఆది నుంచీ   కొన్ని సమస్యలు ఎదురవుతుండటం చూస్తుంటాం.  

రజస్వల త్వరగా..

అమ్మాయిలు రజస్వల కావటానికి రెండేళ్ల ముందు నుంచే రొమ్ము కణజాలం వృద్ధి చెందటం మొదలవుతుంది (ప్రిమెనార్కీ). ఈ సమయంలో అక్కడ కాస్త నొప్పిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఏడాదికి జననాంగ భాగంలో వెంట్రుకలు మొలవటం (ప్యూబార్కీ) ఆరంభమవుతుంది. మరో ఏడాదికి రజస్వల (మెనార్కీ) అవుతారు. సగటున 10 నుంచి 16 ఏళ్ల మధ్య వయసులో అమ్మాయిలు రజస్వల అవుతుంటారు. అయితే ఇప్పుడు ఎంతోమంది పదేళ్లకు ముందే.. కొందరు 8 ఏళ్లలోనే రజస్వల కావటం చూస్తున్నాం. దీన్నే ప్రికాషియస్‌ ప్యూబర్టీ అంటారు. దీంతో సమస్య ఏంటంటే- ఆడ  పిల్లలు పొట్టిగా అవటం. అమ్మాయిలు రజస్వల అయ్యి, నెలసరి ఆరంభమయ్యాక ఆరు నెలల వరకే పొడవు పెరుగుతారు. వీరిలో హార్మోన్ల ప్రభావంతో శరీరంలోని పొడవాటి ఎముకలు ఎదగటం ఆగిపోతుంది. దీంతో పొట్టిగా ఉంటారు. మరో సమస్య- మానసికంగా చిన్నగా ఉన్నప్పటికీ శారీరకంగా పెద్దగా కనిపించటం. దీంతో నలుగురిలోకి వెళ్లటానికి ఇబ్బంది పడతారు. చదువుల్లో వెనకపడొచ్చు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లొచ్చు. లైంగిక వేధింపులకూ గురికావొచ్చు. కాబట్టి మరీ చిన్న వయసులోనే రజస్వల  ముందరి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది.

చికిత్స: చిన్న వయసులో రజస్వల లక్షణాలు కనిపిస్తే కారణమేంటన్నది పరిశీలించాల్సి ఉంటుంది. కొందరు వంశ పారంపర్యంగా త్వరగా రజస్వల అవుతుండొచ్చు. దీనికి భయపడాల్సిన పనిలేదు. కానీ కొందరికి మెదడులో కణితులు, మానసిక ఒత్తిడి, తలకు గాయాలు తగలటం వంటివీ కారణం కావొచ్చు. కాబట్టి కటిభాగం అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఎముక ఎక్స్‌రే, మెదడు ఎంఆర్‌ఐ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటితో గర్భసంచి, అండాశయాల తీరు.. ఎముకల ఎదుగుదల, మెదడులో కణితుల వంటివి తెలుస్తాయి. కణితులుంటే తొలగించాల్సి ఉంటుంది. ఒత్తిడితో బాధపడుతుంటే మానసిక చికిత్స అవసరమవుతుంది. ఇక త్వరగా రజస్వల కావొద్దనుకుంటే మెదడు నుంచి అండాశయాలకు సంకేతాలు అందకుండా చేసే హార్మోన్‌ ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. అలాగే శారీరకంగా ఎదగటానికి క్యాల్షియం, విటమిన్‌ మాత్రలూ అవసరమవుతాయి. ఇలా తొమ్మిది, పదేళ్లు వచ్చేవరకు రజస్వలను ఆపొచ్చు. తర్వాత యథావిధిగా నెలసరి మొదలవుతుంది.

రజస్వల ఆలస్యంగా..

కొందరు 13, 14 ఏళ్లు దాటినా రజస్వల కాకపోవచ్చు. దీంతో తల్లిదండ్రులు గాబరా పడుతుంటారు. రజస్వల ముందరి లక్షణాలు మొదలైనవారిలోనైతే 16 ఏళ్ల వరకూ వేచి చూడొచ్చు. అదే 14 ఏళ్ల వరకూ రొమ్ములు పెరగటం వంటి లక్షణాలు కనిపించకపోయినా, ఇలాంటి లక్షణాలున్నా 15 ఏళ్ల వరకూ రజస్వల కాకపోయినా, 16 ఏళ్లు వచ్చినా శారీరకంగా ఆడపిల్లలా ఎదగలేకపోయినా అప్రమత్తం కావాలి. బహిష్టులు రాకపోవటాన్ని అమెనోరియా అంటారు. ఇందులో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. వయసు వచ్చినా రజస్వల కాకపోవటాన్ని ప్రైమరీ అమెనోరియా అనీ.. ఒకసారి బహిష్టులు మొదలై, మధ్యలో ఆగిపోయి మళ్లీ రాకపోవటాన్ని సెకండరీ అమెనోరియా అనీ అంటారు.

ప్రైమరీ అమెనోరియా

దీనికి జన్యుపరమైన లోపాలు, హార్మోన్‌ లోపాలు కారణం కావొచ్చు. కాబట్టి వీరికి మెదడు నుంచి హార్మోన్‌ సంకేతాలు సరిగా అందుతున్నాయా, లేదా? సంకేతాలు అందినా అండాశయాలు స్పందించటం లేదా? టర్నర్స్‌ సిండ్రోమ్‌ వంటి జన్యు సమస్యలేవైనా ఉన్నాయా? అనేవి పరిశీలించాల్సి ఉంటుంది. టర్నర్స్‌ సిండ్రోమ్‌ గలవారిలో గర్భసంచి ఉన్నా అండాశయాల్లో అండాలుండవు. కొందరికి పుట్టుకతోనే అండాశయాలు, గర్భసంచి వంటి అవయవాలు ఉండకపోవచ్చు. కాబట్టి కటిభాగం అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తే గర్భసంచి, అండాశయాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. అలాగే యోని మార్గం సరిగా ఉందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. కన్నెపొర (హైమెన్‌) తెరచుకోనివారిలో నెలసరి వస్తూనే ఉన్నా బయటకు వచ్చే మార్గం లేక రుతుస్రావం లోపలే ఉండిపోవచ్చు. కొన్నిసార్లు థైరాయిడ్‌ సమస్య ఉన్నా, చిన్నప్పుడే అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓఎస్‌) ఏర్పడినా రజస్వల కాకపోవచ్చు.  

చికిత్స: కారణాలను బట్టి చికిత్స అవసరమవుతుంది. పుట్టుకతోనే అండాశయాలు పనిచేయనివారికి మందులతోనే రజస్వల వచ్చేలా చేయొచ్చు. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటుంటే నెలసరి సరిగా అవుతుంది. వీరిలో గర్భసంచి పెద్దగా అవుతోందో లేదో పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు కొత్తగా మూలకణ చికిత్సతో అండాశయాలను పునరుత్తేజితం చేసే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. హార్మోన్ల లోపాలు గలవారికి హార్మోన్‌ ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. కన్నెపొర తెరచుకోనివారికి చిన్నపాటి సర్జరీతో సరిచేస్తే నెలసరి మామూలుగా అవుతుంది. పుట్టుకతో యోని మార్గం ఏర్పడనివారికి శస్త్రచికిత్సతో కొత్తది సృష్టించొచ్చు. వీరికి నెలసరి, గర్భధారణ సాధ్యం కావు గానీ శృంగార జీవితాన్ని ఆస్వాదించొచ్చు. పుట్టుకతో గర్భసంచి లేనివారికి గర్భసంచి మార్పిడి చేయొచ్చు. కాకపోతే వీరికి చాలాకాలం హార్మోన్‌ ఇంజెక్షన్లు అవసరం. మనదగ్గర ప్రస్తుతానికిది సాధ్యమైన విషయం కాదనే చెప్పుకోవచ్చు.

సెకండరీ అమెనోరియా

కొందరు రజస్వల అయినా ఆ తర్వాత నెలసరి రాకపోవచ్చు. ఇలా 3 నెలల వరకు నెలసరి రాకపోయినా, క్రమంగా వచ్చేవారికి 6 నెలల వరకు రుతుక్రమం ఆగిపోయినా సెకండరీ అమెనోరియాగా భావిస్తారు. ఇది 15 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి చాలావరకు థైరాయిడ్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్ల మోతాదులు ఎక్కువగా ఉండటమే కారణం. అండాశయాల్లో నీటితిత్తులూ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. కొందరికి బాల్యంలో జననాంగ భాగాల్లో క్షయ మూలంగా గర్భాశయం లోపలి పొరలు అతుక్కుపోవచ్చు. ఒకోసారి అబార్షన్‌ చేసినప్పుడు ఎండోమెట్రియం పొర దెబ్బతిన్నా హార్మోన్లకు స్పందించే వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి ఆయా కారణాలను గుర్తించి, సరిచేస్తే నెలసరి కూడా సక్రమంగా అవుతుంది. అయితే నెలసరి ఎప్పుడు నిలిచినా గర్భం ధరించారేమోనని చూడటం ముఖ్యం. గర్భం ధరించకపోతే ఇతరత్రా కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది.

అస్తవ్యస్తం కావటం

కొందరు ఒకరోజు ఆలస్యమైనా, ఒకరోజు ముందయినా నెలసరి అస్తవ్యస్తమైందని భయపడుతుంటారు. నిజానికి అందరిలోనూ సరిగ్గా 28 రోజులకే రావాలనేమీ లేదు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. 21-45 రోజుల మధ్యలో ఎప్పుడు నెలసరి వచ్చినా మామూలుగానే పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా 1-7 రోజుల వరకు రుతుస్రావం అవుతుంది. కాబట్టి ఒకరోజు రుతుస్రావమైనా, ఎనిమిది రోజులు రుతుస్రావమైనా మామూలుగానే భావించాల్సి ఉంటుంది. రజస్వల అయ్యాక అండం విడుదల కావటానికి రెండు, మూడేళ్లు పడుతుంది. ఈ సమయంలో నెలసరి సమయానికి రాదు. రెండు, మూడు నెలలకోసారి రావొచ్చు. వస్తే ఆగకుండా అదేపనిగానూ రావొచ్చు.

  • కొందరికి రెండు నెలలకో, మూడు నెలలకో నెలసరి వస్తుంటుంది. అదీ తక్కువగా రుతుస్రావమవుతుంది. దీనికి ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువ కావటం కారణం కావొచ్చు. వీరికి రొమ్ము నుంచి పాలు కూడా వస్తుంటాయి. వీరికి హార్మోన్‌ చికిత్స ఉపయోగపడుతుంది.

చిరాకు, ఆందోళన

కొందరికి నెలసరికి ముందు రోజుల్లో రొమ్ము నొప్పి, మూడ్‌ మారటం, నీరసం, చిరాకు, కుంగుబాటు వంటివి వేధిస్తుంటాయి. కొందరిలో బరువు, ఆకలి పెరగొచ్చు. గుండె వేగంగా కొట్టుకోవచ్చు. ఆస్థమా గలవారికి సమస్య ఉద్ధృతం కావొచ్చు. కొందరికి ఫిట్స్‌ కూడా రావొచ్చు. వీరికి లక్షణాలను బట్టి చికిత్స అవసరం. సాధారణంగా బి6 వంటి విటమిన్లు, ఖనిజ లవణాల లోపంతో ఇవి తలెత్తుతుంటాయి. మాత్రలతో లోపాన్ని సరిచేస్తే చాలావరకు కుదురుకుంటారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చిరాకు, ఆందోళన తగ్గటానికి ధ్యానం, యోగా ఉపయోగపడతాయి. బరువు మరీ పెరుగుతుంటే మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మాత్రలు మేలు చేస్తాయి. ఇవేవీ పనిచేయకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిందేమో పరీక్షిస్తారు. హార్మోన్ల భర్తీ చికిత్సతో మంచి ఫలితం కనిపిస్తుంది. కుంగుబాటు మరీ ఎక్కువగా ఉంటే యాంటీడిప్రెసెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది.

అమ్మో.. నొప్పి

నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి పెద్ద సమస్య. చాలామందిలో దీన్ని చూస్తుంటాం. నెలసరి నొప్పి మూడు రకాలుగా కనిపిస్తుంటుంది. 1. పాస్మోడిక్‌ డిస్‌మెనోరియా. రుతుస్రావాన్ని బయటకు నెట్టటానికి గర్భాశయం సంకోచిస్తుంటుంది. కానీ కొందరికి గర్భాశయ ముఖద్వారం బిగుతుగా ఉండటం వల్ల గర్భాశయంలో ఒత్తిడి పెరగొచ్చు. వీరిలో గర్భాశయ ముఖద్వారాన్ని నెట్టుకొని రుతుస్రావం బయటకు వచ్చేంతవరకు.. అంటే నెలసరి తొలిరోజున నొప్పి వస్తుంది.  దీనికి కంగారు పడాల్సిన పనిలేదు. ఇది చాలామందిలో పెళ్లయ్యాక తగ్గిపోతుంది. ఎందుకంటే వీర్యానికి గర్భాశయ ముఖద్వారాన్ని మృదువుగా చేసే తత్వముంటుంది. కొందరికి సంతానం కలిగిన తర్వాత తగ్గొచ్చు. ఒకవేళ నొప్పి భరించలేనంత ఎక్కువగా ఉన్నట్టయితే ఒకట్రెండు రోజులు కండరాలను వదులుగా చేసే మాత్రలు మేలు చేస్తాయి. ఇవీ పనిచేయకపోతే గర్భాశయ ముఖద్వారాన్ని వెడల్పు చేయాల్సి ఉంటుంది. 2. కంజెస్టివ్‌ డిస్‌మెనోరియా. ఏదైనా కారణంతో రక్తం మొత్తం అక్కడే గూడు కడితే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఎడినోమయోసిస్‌, ఎండోమెట్రియం పొర వాపు, గర్భాశయంలో గడ్డలు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ జబ్బులు, అడిషన్స్‌, బుడిపెల వంటి వాటితో ఈ నొప్పి రావొచ్చు. వీరికి నెలసరికి నాలుగైదు రోజుల నుంచే నొప్పి మొదలవుతుంది. నెలసరి సమయంలోనూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వీరికి కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు. 3. మెంబ్రేనస్‌ డిస్‌మెనోరియా. ఇది చాలా తీవ్ర సమస్య. పొర మొత్తం బయటకు వచ్చేంతవరకూ నొప్పి కలుగుతుంది. దీనికి నొప్పి మందులు ఉపయోగపడతాయి.

ఎక్కువ కావటం

మామూలుగా నెలసరి సమయంలో సగటున 30 మి.లీ. నుంచి 80 మి.లీ. వరకు రుతుస్రావమవుతుంది. అంతకన్నా ఎక్కువగా పోతుంటే అధిక రుతుస్రావంగా పరిగణించాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యం గడ్డలు గడ్డలుగా రక్తం పడటం. గడ్డలతో కూడి రుతు స్రావమవుతుంటే అధికంగా అవుతున్నట్టే. దీనికి హార్మోన్ల సమతుల్యత అస్తవ్యస్తం కావటం దగ్గరి నుంచి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. కాబట్టి నిశితంగా పరిశీలించి చికిత్స చేయాల్సి ఉంటుంది.

  • గర్భాశయం లోపలి గోడల్లో బుడిపెలతో రుతుస్రావం ఎక్కువ కావొచ్చు. ఇవి మందులతో పోవు. హిస్ట్రోస్కోపీ పద్ధతితో తొలగించాల్సి ఉంటుంది. అనంతరం మళ్లీ రాకుండా హార్మోన్‌ చికిత్స చేస్తారు. గర్భసంచి లోపల టి ఆకారంలో ఉండే మిరీనా పరికరాన్ని అమర్చినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ను విడుదల చేస్తూ రుతుస్రావం ఎక్కువ కాకుండా ఆపుతుంది.  
  • కొందరికి లోపలి పొర గర్భాశయం కండరం లోపలికి చొచ్చుకురావటమూ సమస్యను తెచ్చిపెడుతుంది. ఇందులో రుతుస్రావం ఎక్కువ కావటమే కాకుండా విపరీతమైన నొప్పి కలుగుతుంది. వీరికి వయసును బట్టి చికిత్స చేస్తారు. చిన్నవయసులోనైతే అప్పటికే పిల్లలను కంటే మిరీనా పరికరాన్ని గర్భసంచి లోపల ప్రవేశపెడతారు. కొందరికి మాత్రలు, ఇంజెక్షన్లూ ఉపయోగపడొచ్చు. అరుదుగా ఎంఆర్‌ఎఫ్‌యూఎస్‌ చికిత్స అవసరముతుంది. అదే 40 ఏళ్లు దాటి, సంతానం కనటం పూర్తయితే శాశ్వత పరిష్కారంగా గర్భసంచిని తొలగించొచ్చు.
  • కొందరికి ఎండోమెట్రియం పొర అండాశయాల మీదా ఉండొచ్చు (ఎండోమెట్రియోమా). దీన్ని ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో తొలగించి, మళ్లీ రాకుండా మందులిస్తారు.
  • క్యాన్సర్‌ రహిత గడ్డలు (లియోమయోమా) మరో కారణం. దాదాపు 40-50% మందిలో ఇవి కనిపిస్తుంటాయి. గర్భాశయ ముఖద్వారం, గర్భసంచి, ఫలోపియన్‌ ట్యూబులు, ఎండోమెట్రియం పొరలో ఎక్కడైనా గడ్డలు ఉండొచ్చు. నిజానికివి చాలామందికి ఇబ్బంది కలిగించవు. కానీ కొందరికి నొప్పి, అధిక రుతుస్రావం, సంతానం కలగకపోవటం, తరచూ గర్భస్రావం అవుతుండటం, గర్భాశయంలో బిడ్డకు బదులు గడ్డ పెరగటం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. గడ్డల సైజు, ఇబ్బందులను బట్టి చికిత్స చేస్తారు. చిన్న వయసులోనైతే ల్యాప్రోస్కోపీ లేదా హిస్ట్రోస్కోపీ ద్వారా గడ్డలను తొలగిస్తే సరిపోతుంది. ఇటీవల అబ్లేషన్‌ పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. అదే 40 ఏళ్లు దాటినా, గడ్డలు మరీ ఎక్కువ సంఖ్యలో గానీ పెద్దగా గానీ ఉంటే గర్భసంచి తొలగించాల్సి ఉంటుంది. గడ్డలు తిరిగి రాకుండా మిరీనా పరికరం వాడుకోవాల్సి ఉంటుంది. కొందరికి క్యాన్సర్‌ కణితులు, క్యాన్సర్‌ ముందస్తు మార్పులూ అధిక రుతుస్రావమవయ్యేలా చేయొచ్చు. వీటికి క్యాన్సర్‌ మాదిరిగానే చికిత్స అవసరం.
  • రక్తం సరిగా గడ్డకట్టని సమస్యలున్నవారికి, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నవారికి కొద్దిగా రుతుస్రావమైనా ఎక్కువగా పోవచ్చు. వీరికి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ చికిత్స ఉపయోపడుతుంది.
  • అధిక రుతుస్రావానికి హార్మోన్ల అసమతుల్యత ముఖ్య కారణం. పీసీఓఎస్‌, థైరాయిడ్‌ సమస్యలూ కారణం కావొచ్చు. వీరికి మందులతో చికిత్స చేస్తారు. నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు మందులతో ఫలితం కనిపించకపోతే మిరీనా పరికరాన్ని అమరుస్తారు. ఇది పనిచేయకపోతే పీసీఆర్‌ఈ చికిత్స చేస్తారు. ఇందులో హిస్ట్రోస్కోపీ ద్వారా లోపలున్న పొర మొత్తాన్ని కాల్చేస్తారు.
  • కొన్నిసార్లు సర్జరీ చేసేటప్పుడు ఒక రక్తనాళం మరో నాళంలోకి చొచ్చుకొని రావొచ్చు. కొందరికి అబార్షన్‌ చేసినప్పుడు కొన్ని ముక్కలు లోపల ఉండిపోవచ్చు. ఇవీ రుతుస్రావం ఎక్కువయ్యేలా చేయొచ్చు. వీరికి కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
  • ఎండోమెట్రియం పొరకు ఇన్‌ఫెక్షన్‌ సోకటమూ కారణం కావొచ్చు. దీనికి యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రొజెస్టిరాన్‌ చికిత్స ఆరంభిస్తారు.
  • కొందరికి కచ్చితమైన కారణమేదీ లేకుండానూ రుతుస్రావం ఎక్కువగా కావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని