కుంగుబాటుతో అధిక బరువు

శరీర బరువు, మానసిక ఆరోగ్యం.. రెండూ ఒక దాని మీద మరోటి ప్రభావం చూపుతాయి. వీటి మధ్య సంబంధం సంక్లిష్టమైంది. దీని గురించి ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. ముఖ్యంగా మానసిక మార్పులు బరువు మీద ఎలా ప్రభావం చూపుతాయన్నది అంతగా తెలియదు.

Published : 23 Jan 2024 01:13 IST

శరీర బరువు, మానసిక ఆరోగ్యం.. రెండూ ఒక దాని మీద మరోటి ప్రభావం చూపుతాయి. వీటి మధ్య సంబంధం సంక్లిష్టమైంది. దీని గురించి ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. ముఖ్యంగా మానసిక మార్పులు బరువు మీద ఎలా ప్రభావం చూపుతాయన్నది అంతగా తెలియదు. దీన్ని ఛేదించటానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. కొవిడ్‌-19 విజృంభించిన సమయంలో ప్రతినెలా కొందరి మానసిక ఆరోగ్యాన్ని, బరువును పరిశీలించారు. కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తీవ్రతను బట్టి స్కోర్‌ కేటాయించి.. మానసిక ఆరోగ్యాన్ని లెక్కించారు. కుంగుబాటు లక్షణాలు పెరుగుతున్నకొద్దీ ప్రతి నెలా 45 గ్రాముల బరువు ఎక్కువవుతున్నట్టు గుర్తించారు. బరువు విషయంలో ఇది తక్కువే అయినా కుంగుబాటు లక్షణాలు ఒక మాదిరి నుంచి మధ్యస్థ స్థాయికి చేరుకున్నట్టు తేలటం గమనార్హం. ఈ ధోరణి అధిక బరువు, ఊబకాయుల్లో మాత్రమే కనిపించటం గమనార్హం. అంటే వీళ్లు మరింత ఎక్కువగా బరువు పెరగటమే కాకుండా, కుంగుబాటు లక్షణాలతోనూ మరింత ఎక్కువగా సతమతం అవుతున్నారన్నమాట. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి (బీఎంఐ) ఎక్కువగా గలవారికి మామూలుగానే మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంటుంది. దీనికి కుంగుబాటు కూడా తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. కాబట్టి ఊబకాయులు కుంగుబాటు లక్షణాలను నియంత్రణలో ఉంచుకుంటే మరింత బరువు పెరగకుండా చూసుకోవచ్చని.. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండింటికీ మేలు చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని