మారు దంతం మహా దృఢం!

ఎవరి ముఖాన్ని చూసినా ముందు ఆకట్టుకునేది మెరిసే దంతాలే. ఇవి లేకపోతే నోరు బోసిపోతుంది. ముఖం కళ తప్పుతుంది. మనం ఆకర్షణీయంగా కనిపించటానికే కాదు.. ఆహారాన్ని నమలటానికి, తిన్నది జీర్ణం కావటానికి, స్పష్టంగా మాట్లాడటానికి కూడా దంతాలు అత్యవసరం.

Updated : 23 Jan 2024 06:47 IST

ఎవరి ముఖాన్ని చూసినా ముందు ఆకట్టుకునేది మెరిసే దంతాలే. ఇవి లేకపోతే నోరు బోసిపోతుంది. ముఖం కళ తప్పుతుంది. మనం ఆకర్షణీయంగా కనిపించటానికే కాదు.. ఆహారాన్ని నమలటానికి, తిన్నది జీర్ణం కావటానికి, స్పష్టంగా మాట్లాడటానికి కూడా దంతాలు అత్యవసరం. ఇంతటి కీలకమైన పళ్లకు పుచ్చిపోవటం, చిగుళ్ల వాపు, ప్రమాదాలు శాపంగా మారుతున్నాయి. వీటి మూలంగా ఎంతోమంది శాశ్వతంగా దంతాలను కోల్పోతున్నారు. వీటిని బ్రిడ్జి పద్ధతితోనో, కట్టుడుపళ్లతోనో పూరించొచ్చు గానీ అంత బలంగా ఉండవు. వీటితో కొన్ని చిక్కులూ ఎదురవుతుంటాయి. కాబట్టే డెంటల్‌ ఇంప్లాంట్స్‌కు రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది. వీటి మీద స్థిరపడే కృత్రిమ దంతాలు సహజ దంతాల మాదిరిగా కనిపించటమే కాకుండా అంతే బలంగా పనిచెయ్యటం విశేషం.

 పళ్లు ఊడిపోవటం పెద్ద సమస్య. మనదేశంలో 65-74 ఏళ్ల వృద్ధుల్లో సుమారు 19% మంది పళ్లూడినవారేనని అంచనా. దీనికి తోడు ప్రమాదాల్లో గాయపడటం వల్ల చిన్న వయసులోనూ దంతాలను కోల్పోతున్నవారు ఎందరో. ఇంత పెద్ద సమస్య అయినా మనదగ్గర చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుండటం ఆందోళనకరం. ఒకట్రెండు పళ్లూడితే ఏమవుతుందిలే? అని భావిస్తుంటారు. నిజానికి దీంతో చాలా అనర్థాలే ఉన్నాయి. ఒకటి- పోషణ కొరవడటం. పళ్లు ఊడిపోతే ఆహారం నమలటం కష్టమవుతుంది. ఇష్టమైన పదార్థాలు తినలేక ఇబ్బంది పడతారు. దీంతో పోషకాలు లభించక మొత్తంగా శరీరమే చతికిల పడుతుంది. రెండోది- దవడ ఎముక క్షీణించటం. పన్ను ఊడిన చోట ఏర్పడిన రంధ్రం పూడే క్రమంలో దవడ ఎముక కుంచించుకుపోతుంది. సాధారణంగా నములుతున్నప్పుడు దవడ ఎముక మీద బలం పడుతుంది. దీంతో అది బలంగా తయార వుతుంది. పన్ను ఊడినప్పుడు ఎముక మీద ఎలాంటి బలం పడకపోవటం వల్ల అది జీవితాంతం క్షీణిస్తూనే ఉంటుంది. ఫలితంగా ముఖాకృతి దెబ్బతింటుంది. దవడలు లోపలికి పీక్కుపోయినట్టు కనిపిస్తారు. మరో సమస్య- పక్క పళ్లకు ఇబ్బంది కలగలటం. ఒక పన్ను ఊడిపోతే దాని పక్కన ఉండేవి అటువైపునకు వాలటం మొదలవుతుంది. అవి ఖాళీ భాగంలోకి చొచ్చుకురావటం వల్ల కదలటం మొదలెడతాయి. కొన్నాళ్లకు వాటినీ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంప్లాంట్స్‌తో ఇలాంటి ఇబ్బందులను  తప్పించుకోవచ్చు. పళ్లు ఊడినప్పుడు మొదటి 3, 4 నెలల్లోనే ఇంప్లాంట్స్‌ అమర్చితే దవడ ఎముక కుంచించకుండా చూసుకోవచ్చు. ఫలితంగా ముఖం ఆకృతి మునుపటిలాగానే ఉంటుంది. సహజ దంతాలతో నమిలినట్టుగా ఆహారాన్ని ఆస్వాదించొచ్చు.

 ఇంప్లాంట్‌ అంటే?

ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో కృత్రిమ దంత మూలం. టైటానియం లోహంతో తయారైన దీన్ని శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు. ఇందులో మూడు భాగాలుంటాయి. స్క్రూ మాదిరిగా ఉండే కింది భాగం దవడ ఎముకలో కుదురుకుంటుంది. దీని మీద దన్నుగా ఉండే భాగాన్ని, ఆ పైన కృత్రిమ దంతాన్ని బిగిస్తారు. శస్త్రచికిత్సలో ముందుగా దెబ్బతిన్న దంతాన్ని తొలగిస్తారు. దవడ ఎముకను శస్త్రచికిత్సకు అనుగుణంగా సిద్ధం చేసి, ఇంప్లాంట్‌ను అమరుస్తారు. దీని చుట్టూ ఎముక వృద్ధి చెంది, బలంగా కుదురుకున్నాక కృత్రిమ దంతాన్ని పట్టుకొని ఉండే భాగాన్ని బిగిస్తారు. అనంతరం దీని మీద కృత్రిమ దంతాన్ని (క్రౌన్‌) అమరుస్తారు. ఇంప్లాంట్‌ తయారీకి వాడిన టైటానియం లోహం ఎముకకు ఎలాంటి హాని కలిగించదు. దీని ఎలక్ట్రాన్‌ అయాన్‌ ఎముకతో సరిపోలుతుంది. కాబట్టి ఎముక కణాలు ఇంప్లాంట్‌కు అతుక్కుంటాయి. అక్కడ ఎముక వృద్ధి చెంది, బిగుతుగా స్థిరపడుతుంది. సహజ దంత మూలంలా మారుతుంది. అందుకే ఏ కారణంతో పళ్లు ఊడినా ఇప్పుడు ఇంప్లాంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకట్రెండు పళ్లు ఊడినా, మొత్తం పళ్లు ఊడినా ఇంప్లాంట్స్‌తో సరిచేయొచ్చు.

ఎవరికి చేస్తారు?

ఇంప్లాంట్‌ అమర్చటానికి చిగుళ్లు ఆరోగ్యంగా, దవడ ఎముక తగినంత ఉండటం ముఖ్యం. కొందరికి ఎముక పలుచగా ఉండొచ్చు. ఇలాంటివారికి శరీరంలోని ఇతర భాగం నుంచి ఎముకను తెచ్చి అతికిస్తారు (గ్రాఫ్టింగ్‌). పై దవడ ఎముక తగినంత ఎత్తు లేనివారికి, ముక్కు పక్క గాలిగదులు దవడకు మరీ దగ్గరగా ఉన్నవారికి సైనస్‌ లిఫ్ట్‌ సర్జరీ అవసరమవుతుంది. ఇందులో పై దవడకు అదనంగా ఎముకను జోడిస్తారు. ఆ తర్వాత ఇంప్లాంట్‌ అమరుస్తారు.

  • పిల్లల్లో పళ్లు విరిగిపోతే శరీర ఎదుగుదల పూర్తయ్యాకే ఇంప్లాంట్స్‌ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా అబ్బాయిలైతే 18-19 సంవత్సరాలు.. అమ్మాయిలైతే 15-16 ఏళ్ల వరకు వేచి చూస్తారు. వీరికి అప్పటివరకు పళ్లకు అతుక్కునే బ్రిడ్జి లేదా తాత్కాలిక పళ్లు ఉపయోగపడతాయి.

సంప్రదాయ పద్ధతుల కన్నా మేలు

పళ్లన్నీ ఊడినవారు కట్టుడుపళ్లు వాడుకోవటం చూస్తూనే ఉంటాం. వీటితో చిక్కేంటంటే- లోతుగా ఉండటం, అందరికీ సరిపడకపోవటం. సాధారణంగా కట్టుడుపళ్లు చిగుళ్ల కణజాలం, దవడ ఎముక మీద కూర్చుంటాయి. దవడ ఎముక బాగా అరిగిపోతే కట్టుడుపళ్లకు తగినంత దన్ను దొరకదు. నాణ్యమైన పదార్థంతో తయారుచేసినా, బిగుతుగా ఉండేలా రూపొందించినా కూడా నిరంతరం కదులుతూ ఉండొచ్చు. తరచూ బయటికి ఊడిరావొచ్చు. దీంతో కొందరు విసిగిపోయి వాటిని పూర్తిగా పక్కకు పెట్టేస్తుంటారు. వీలైనంత వరకు చిగుళ్లతోనే నములుతూ, రోజులు వెళ్లదీస్తుంటారు. వీరికి ఇంప్లాంట్‌ మంచి అవకాశం. ఒకట్రెండు పళ్లు ఊడినవారికి బ్రిడ్జి సాయంతో కృత్రిమ పళ్లను అమర్చే విధానమూ ఉంది. ఇందులో ఊడిన, విరిగిన వాటికి రెండు పక్కలా ఉండే పళ్లను కాస్త చెక్కి, బ్రిడ్జిని అమర్చుతారు. ఇంప్లాంట్స్‌ అమర్చితే ఆరోగ్యంగా, బలంగా ఉన్న పక్క పళ్లను చెక్కాల్సిన అవసరముండదు.


కొద్దివాటితోనే అన్ని పళ్లూ..

పళ్లన్నీ ఊడిపోయినవారికి బ్రిడ్జి అమర్చటం సాధ్యం కాదు. వీరికి ఇంప్లాంట్స్‌ ఒక్కటే మార్గం. అలాగని ప్రతి పన్నుకు విడివిడిగా ఇంప్లాంట్‌ అమర్చాల్సిన అవసరం లేదు. దవడలకు 6-8 చోట్ల ఇంప్లాంట్స్‌ స్థిరపరచి, వీటి సాయంతో బ్రిడ్జి పద్ధతిలో పళ్లను అమరుస్తారు. ఇలా 10 నుంచి 12 పళ్లను పెట్టొచ్చు. ఒకవేళ ఖర్చు ఎక్కువ అవుతోందనుకున్నా, దవడ ఎముక బాగా అరిగిపోయినా 4 ఇంప్లాంట్స్‌తోనే మంచి ఫలితం సాధించే పద్ధతి (ఆల్‌ ఆన్‌ ఫోర్‌) కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇందులో పై దవడకు, కింది దవడకు నాలుగేసి ఇంప్లాంట్స్‌ అమర్చి.. వాటికి బ్రిడ్జిని బిగించి దంతాలను అమరుస్తారు. వీటితో మంచి ఫలితం కనిపిస్తున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. త్వరగా నమలటమూ సాధ్యమవుతోంది.


కొత్త పరిజ్ఞానాల సాయం

సాధారణంగా డెంటల్‌ ఇంప్లాంట్‌ ఎముకలో కుదురుకోవటానికి 3-4 నెలలు పడుతుంది. ఆ తర్వాతే కృత్రిమ దంతాన్ని అమరుస్తుంటారు. అయితే ఇంప్లాంట్‌ డిజైన్‌, దాని ఉపరితలాలను మార్చటం వంటి కొత్త పరిజ్ఞానాల మూలంగా ఇప్పుడు బాగా సమయం తగ్గిపోయింది. రెండు నుంచి నాలుగు వారాల్లోనే దంతాన్ని బిగించటానికి వీలవుతోంది. అవసరమైతే అదే రోజున అమర్చే సదుపాయమూ (ఇమిడియట్‌ లోడింగ్‌ ఇంప్లాంట్‌) అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇంప్లాంట్‌ అమర్చిన ఒకట్రెండు రోజుల్లోనే దంతాన్ని బిగిస్తారు.

  • ప్రస్తుతం సీబీసీటీ, క్యాడ్‌/క్యామ్‌ టెక్నాలజీ, గైడెడ్‌ సర్జరీలూ త్వరగా ఇంప్లాంట్‌ అమర్చటానికి తోడ్పడుతున్నాయి. సీబీసీటీతో చిగురుకు కోత పెట్టకుండానే లోపల ఎముక ఎలా ఉందో తెలుసుకోవచ్చు. క్యాడ్‌/క్యామ్‌ సాయంతో ముందే వర్చువల్‌గా ఇంప్లాంట్‌ను, దీని మీద బిగించే దంతాన్ని డిజైన్‌ చేయొచ్చు. చిన్న కోతతోనే ఇంప్లాంట్‌ అమర్చటానికి గైడెడ్‌ సర్జరీ ఉపయోగపడుతుంది. దీంతో శస్త్రచికిత్స త్వరగా పూర్తవుతుంది. రక్తస్రావమూ అంతగా ఉండదు. అవసరమైనవారికి అదే రోజు పన్ను బిగించే అవకాశమూ ఉంది.

జాగ్రత్తలు అవసరం

సహజ దంతాలతో పోలిస్తే ఇంప్లాంట్స్‌ 80% వరకు దృఢంగా ఉంటాయి. మామూలుగా ఆహారం తినటానికివి సరిపోతాయి. అయితే ఇవి దెబ్బతినకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు పాటించాలి.

  •  చాలా గట్టిగా ఉండేవి.. అంటే ఎముకల వంటివి కొరకరాదు.
  • తరచూ డాక్టర్‌ను సంప్రదించి, పరీక్ష చేయించుకోవాలి.
  • కృత్రిమ దంతాలే కదా, శుభ్రం చేసుకోకపోతే ఏమీ కాదనుకోవద్దు. పళ్ల మధ్యన ఆహార పదార్థాలు చిక్కుకుపోతే చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. కాబట్టి రోజూ రెండు సార్లు బ్రష్‌ చేసుకోవాలి.
  •  పొగ తాగే అలవాటు దంతాలను దెబ్బతీస్తుంది. ఇది ఇంప్లాంట్స్‌కూ వర్తిస్తుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.

    మధుమేహం గలవారికీ

ఒకప్పుడు మధుమేహులకు ఇంప్లాంట్‌ వద్దని చెప్పేవారు. ఇప్పుడు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకునేవారికీ అమరుస్తున్నారు. కాకపోతే గ్లూకోజు అదుపులో ఉండటం ముఖ్యం. గ్లూకోజు అదుపులో ఉన్నంతరవకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రోజూ బ్రష్‌ చేసుకుంటూ.. గ్లూకోజును అదుపులో ఉంచుకుంటే 15, 20 ఏళ్లయినా ఇంప్లాంట్స్‌ చక్కగా పనిచేస్తాయి.


క్లిష్ట పరిస్థితుల్లోనూ..

  • ముందు భాగంలో దవడ ఎముక క్షీణించటం, తగినంత ఎముక లేనివారికి ఇంప్లాంట్‌ అమర్చటం కష్టమైన పని. వీరికి ప్రత్యామ్నాయ ఇంప్లాంట్స్‌ అందుబాటులో ఉన్నాయి.
  • జైగోమాటిక్‌ ఇంప్లాంట్‌: ఇది దవడ ఎముకకు బదులు బుగ్గ ఎముకలో అమర్చే ఇంప్లాంట్‌.
  •  టెరీగాయిడ్‌ ఇంప్లాంట్‌: పుర్రె అడుగున ఎముకకు అతుక్కొని ఉండటం దీని ప్రత్యేకత.
  • పొట్టి ఇంప్లాంట్‌: ఎముక తగినంత పొడవు లేనివారికి ఉపయోగపడే వీటికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా వీటిని జైగోమాటిక్‌ లేదా టెరీగాయిడ్‌ ఇంప్లాంట్స్‌తో కలిపి చేస్తుంటారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని