స్టాటిన్స్‌ ఆపేస్తున్నారా?

చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువగా ఉన్నవారికి.. గతంలో గుండెపోటు, పక్షవాతం వచ్చినవారికి.. గుండె రక్తనాళంలో స్టెంట్స్‌ అమర్చినవారికి.. బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్నవారికి డాక్టర్లు స్టాటిన్లు వేసుకోవాలని సూచిస్తుంటారు

Published : 30 Jan 2024 01:30 IST

చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువగా ఉన్నవారికి.. గతంలో గుండెపోటు, పక్షవాతం వచ్చినవారికి.. గుండె రక్తనాళంలో స్టెంట్స్‌ అమర్చినవారికి.. బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్నవారికి డాక్టర్లు స్టాటిన్లు వేసుకోవాలని సూచిస్తుంటారు. ఇవి కొలెస్ట్రాల్‌ మోతాదులు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే మందులు మరీ ఎక్కువగా వేసుకుంటున్నామనో, దుష్ప్రభావాలు తలెత్తుతాయనో చాలామంది తమకు తామే వీటిని ఆపేస్తుంటారు. డాక్టర్లకు దీని గురించి చెప్పకుండా దాచేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.

కొలెస్ట్రాల్‌ అదుపులో ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. చెడ్డ కొలెస్ట్రాల్‌ మోతాదులు మితిమీరితే రక్తనాళాల గోడలకు అతుక్కొని, పూడికలుగా ఏర్పడుతుంది. ఇవి గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తాయి. చాలామంది సరైన ఆహారం తీసుకోకపోవటం వల్లనే కొలెస్ట్రాల్‌ మోతాదు పెరుగుతుందని అనుకుంటుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. శరీరానికి కొలెస్ట్రాల్‌ అత్యవసరం. అందువల్ల తనకు అవసరమైన దాంట్లో 75% కొలెస్ట్రాల్‌ను మన శరీరమే తయారుచేసుకుంటుంది. మిగతా 25% మనం తినే ఆహారం నుంచి లభిస్తుంది. కొలెస్ట్రాల్‌ మితిమీరినవారికి ఇక్కడే స్టాటిన్లు ఉపయోగపడుతున్నాయి. ఇవి ఎంజైమ్‌లను అడ్డుకోవటం ద్వారా శరీరం కొలెస్ట్రాల్‌ను తయారు చేసుకోనీయకుండా చూస్తాయి. డాక్టర్ల సలహా లేకుండా స్టాటిన్లను వేసుకోవటం ఆపేస్తే శరీరం తిరిగి కొలెస్ట్రాల్‌ తయారీని మొదలెడుతుంది. దీంతో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరిగిపోయి తిరిగి గుండెపోటు, పక్షవాతం, స్వల్ప పక్షవాతం, గుండె రక్తనాళం ఉబ్బటం, గుండె వైఫల్యం వంటి సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కొందరు కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకొని, నార్మల్‌గా ఉన్నట్టు తేలగానే సమస్య కుదురుకుందని భావిస్తుంటారు. స్టాటిన్స్‌ ఆపేస్తుంటారు. ఇది తప్పు. మాత్రలు వేసుకోవటం మూలంగానే కొలెస్ట్రాల్‌ నార్మల్‌కు చేరుకుందని తెలుసుకోవాలి. వీటిని మానేస్తే తిరిగి కొలెస్ట్రాల్‌ పెరగటం ఖాయం. కాబట్టి తమకు తామే మానెయ్యటం సరికాదు.

 ఆరోగ్యకరమైన ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సిగరెట్లు మానెయ్యటం వంటి జీవనశైలి మార్పులతో కొందరిలో ఎల్‌డీఎల్‌ తగ్గుముఖం పట్టొచ్చు. కానీ జన్యువులు కూడా కీలకమే. వీటి మూలంగా కొందరిలో ఎక్కువ కొలెస్ట్రాల్‌ తయారవ్వచ్చు. అందువల్ల అందరికీ జీవనశైలి మార్పులతో గుణం కనిపిస్తుందని చెప్పలేం. వీటితో ఫలితం కనిపించనివారు విధిగా స్టాటిన్స్‌ వేసుకోవాల్సిందే. ఈ మాత్రలను వాడుతున్నప్పటికీ రోజూ వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయల వంటివి ఎక్కువగా తినాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని