నెలసరి చిక్కులు చలికాలంలో ఎక్కువా?

కీళ్లనొప్పులు, దిగులు, నిరాశ వంటి కొన్ని సమస్యలు చలికాలంలో తీవ్రమవుతుంటాయి. ఆశ్చర్యంగా అనిపించినా కొందరు మహిళల్లో నెలసరి చిక్కులూ ఎక్కువవుతుంటాయి.

Published : 30 Jan 2024 01:42 IST

కీళ్లనొప్పులు, దిగులు, నిరాశ వంటి కొన్ని సమస్యలు చలికాలంలో తీవ్రమవుతుంటాయి. ఆశ్చర్యంగా అనిపించినా కొందరు మహిళల్లో నెలసరి చిక్కులూ ఎక్కువవుతుంటాయి. దీనికి కారణమేంటి?

 నెలసరి సమయంలో కొందరికి చిరాకు, ఏకాగ్రత కుదరకపోవటం, అలసట, దిగులు, కోపం, ఆందోళన వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. కొందరిలో ఇవి చలికాలంలో ఎక్కువవుతుంటాయి కూడా. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు గానీ ఐరన్‌ లోపం దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. మామూలుగానే ఐరన్‌ లోపంతో నిస్సత్తువ, చిరాకు, ఏకాగ్రత కుదరకపోవటం, రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావటం వంటివి తలెత్తుతాయి. శరీరం సక్రమంగా పనిచెయ్యటానికి ఐరన్‌ అవసరం. ఇది అన్ని భాగాలకూ ఆక్సిజన్‌ను మోసుకుపోయే ఎర్ర రక్తకణాల తయారీకి తోడ్పడుతుంది. ఇంతటి కీలకమైంది అయినప్పటికీ చాలామంది ఆహారం ద్వారా తగినంత ఐరన్‌ తీసుకోవటం లేదన్నది కాదనలేని సత్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కనిపించే పోషణలోపమూ ఇదే. దీని మూలంగా రక్తహీనత తలెత్తుతుంది. ఇందులోనూ నిస్సత్తువ, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళల్లో ఐరన్‌ లోపం, రక్తహీనతకు చాలావరకూ నెలసరే కారణం. మరీ ఎక్కువగా, ఎక్కువ రోజులు నెలసరి అయ్యేవారికి వీటి ముప్పు ఎక్కువ. నెలనెలా ఎక్కువ రక్తం కోల్పోయేవారిలో 90% మందికి ఐరన్‌ లోపం, 60% మందికి రక్తహీనత ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే- నిస్సత్తువ, చికాకు వంటి సమస్యలకు నెలసరి మరీ ఎక్కువ కావటమేననే సంగతి తెలియకపోవటం. చాలామంది రుతుక్రమం ఎక్కువగా కావటం మామూలేననీ భావించటం వల్ల గుర్తించలేకపోతున్నారు. జాగ్రత్త పడకపోతే ఇదొక విష వలయంగా మారుతుంది. ఐరన్‌ లోపం, రక్తహీనత లక్షణాలు ఇతర జబ్బులనూ తలపిస్తుండటమూ పొరపడటానికి దారితీస్తోంది. ఉదాహరణకు- చలికాలంలో వచ్చే కుంగుబాటులోనూ నిస్సత్తువ, మూడ్‌ మారిపోవటం కనిపిస్తుంటాయి. ఏదేమైనా చలికాలంలో రక్తహీనత లక్షణాలు కనిపిస్తే తక్షణం జాగ్రత్త పడటం మంచిది. వ్యాయామం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, రాత్రిపూట కంటి నిండా నిద్రపోవటం, సమతులాహారం తీసుకోవటం వంటివి మేలు చేస్తాయి. ఒకవేళ ఏడాది మొత్తం చిరాకు, నిస్సత్తువ వంటివి వేధిస్తుంటే.. నెలసరి కూడా ఎక్కువగా అవుతున్నట్టయితే ఐరన్‌ లోపం కారణం కావొచ్చని గుర్తించాలి. దీని లక్షణాలు చలికాలంలో మరింత తీవ్రం అవుతుంటాయి కూడా. ఐరన్‌ లోపాన్ని భర్తీ చేస్తే నిస్సత్తువ, అలసట వంటి ఇబ్బందులూ గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి నెలసరి చిక్కుల విషయంలో నిర్లక్ష్యం తగదు. రక్తహీనత మితిమీరితే గుండెదడ, ఆయాసం, స్పృహ తప్పటం వంటి తీవ్ర సమస్యలూ చుట్టుముడతాయి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని