స్పృహ కోల్పోతే..

అదో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌. కొడుకు, కోడలు ఆఫీసులకు.. పిల్లలు స్కూలుకు వెళ్లారు. ఇంట్లో పెద్దవాళ్లిద్దరే ఉన్నారు. అంతలో కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి కూలబడిపోయారు.

Updated : 05 Mar 2024 07:09 IST

అదో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌. కొడుకు, కోడలు ఆఫీసులకు.. పిల్లలు స్కూలుకు వెళ్లారు. ఇంట్లో పెద్దవాళ్లిద్దరే ఉన్నారు. అంతలో కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి కూలబడిపోయారు. ఆమె కంగారు పడి, ఏడుస్తూనే సహాయం కోసం ఎదురింటికి వెళ్లారు. తలుపు తాళం వేసి ఉంది. ఆపక్క ఫ్లాట్‌లోనూ ఇదే పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఆదుర్దా పడుతూ ఇంటికి తిరిగొచ్చేసరికి ఆయన కళ్లు తెరచి చూస్తున్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ జరిగిన ఘటన ఆమె మనసులో మెదులుతూనే ఉంది. మనిషి మామూలు స్థితికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, అనుకోనిది ఏదైనా జరిగితే? భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా గాబరా తప్పదు. ఇంతకీ ఇదేం సమస్య? దీన్నే తాత్కాలికంగా స్పృహ తప్పటం (సింకోపీ) అంటారు. ఇది ఏ వయసు వారికైనా రావొచ్చు గానీ పెద్ద వయసులో ఎక్కువగా చూస్తుంటాం. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. అందువల్ల సింకోపీకి కారణాలేంటి? ఎలా ఎదుర్కోవాలి? అనేవి తెలుసుకొని ఉండటం మంచిది.

తాత్కాలికంగా స్పృహ తప్పటానికి ముఖ్యమైన కారణం మెదడుకి తగినంత రక్తం సరఫరా అవకపోవటం. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాడుల గురించే. మన శరీరంలో స్వయం ప్రపత్తి (అటనమస్‌) నాడులుంటాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. మన ఆధీనంలో ఉండవు. మన ప్రమేయం లేకుండా సాగే గుండె వేగం, రక్తపోటు, శ్వాస, ఆహారం జీర్ణం కావటం వంటి స్వయంచాలిత పనులకు ఇవే ఆధారం. ఈ నాడుల్లో సింపథెటిక్‌, పారాసింపెథెటిక్‌ అని రెండు రకాలు. సింపథెటిక్‌ నాడుల చివర్ల నుంచి అడ్రినలిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది మనల్ని అత్యవసర పరిస్థితులకు సన్నద్ధం చేస్తుంది. దీని మూలంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస వేగం పెరుగుతుంది. దీంతో శరీరానికి కావలసిన ఆక్సిజన్‌ లభించి, తక్షణ శక్తి అందుతుంది. ఇలా ప్రమాదాల వంటివి ఎదురైతే అక్కడి నుంచి పారిపోవటానికో లేదా వాటిని ఎదుర్కోటానికో తోడ్పడుతుంది. పారాసింపథెటిక్‌ నాడులు వీటికి పూర్తిగా భిన్నం. ఈ నాడుల చివర్ల నుంచి అసిటీల్‌కోలీన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. దీని వల్ల గుండె వేగం తగ్గుతుంది. ఊపిరి తీసుకోవటం నెమ్మదిస్తుంది. అంతేకాదు.. ఆహార ప్రక్రియలోనూ పారాసింపథెటిక్‌ నాడులు కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కావటానికి అవసరమయ్యే ఎంజైములతో కూడిన జీవరసాలను జీర్ణాశయం, చిన్న పేగుల నుంచి విడుదలయ్యేలా చేసేవి ఇవే. అందుకే సింపథెటిక్‌ నాడీ వ్యవస్థను ఫైట్‌ అండ్‌ ఫ్లైట్‌ హార్మోన్‌ సిస్టమ్‌ అనీ.. పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థను రెస్ట్‌ అండ్‌ డైజెస్ట్‌ సిస్టమ్‌ అనీ పిలుచుకుంటారు.

నాడుల సమతుల్యత ముఖ్యం

రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు సింపథెటిక్‌ నాడుల పనితీరు మందగిస్తుంది. అదే సమయంలో పారాసింపథెటిక్‌ నాడులు చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం, ఊపిరి తీసుకునే వేగం తగ్గుతాయి. నిద్రిస్తున్నప్పుడు శరీరం శ్రమ చేయదు కాబట్టి ఆక్సిజన్‌ అవసరం అంత ఎక్కువగా అవసరముండదు. కేవలం జీవక్రియలు మాత్రమే సాగుతుంటాయి. సింపథెటిక్‌ నాడులతో జరిగే మరో ముఖ్యమైన ప్రక్రియ రక్తనాళాలు కుంచించుకుపోవటం. దీంతో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడుతుంది. పారాసింపథెటిక్‌ నాడులైతే రక్తనాళాలు వ్యాకోచించేలా చేస్తాయి. శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే ఈ రెండు ప్రక్రియలు సమతులంగా ఉండాలి. లేకపోతే స్పృహ తప్పటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొందరు ఉదయం లేవగానే తూలిపోవటానికి కారణమిదే. రాత్రి పడుకొని, ఉదయం లేచినప్పుడు శరీరంలోని రక్తం చాలావరకు కాళ్లు, పొట్టలోని రక్తనాళాల్లోకి వెళ్లిపోతుంది. దీంతో మెదడుకు రక్తసరఫరా తగ్గిపోయి కళ్లు తిరగటం, తూలిపోవటం, కొన్నిసార్లు స్పృహ తప్పటమూ జరుగుతుంది. సింకోపీకీ ఇదే కారణం.

ప్రధానంగా మూడు కారణాలు

తాత్కాలికంగా స్పృహ కోల్పోవటానికి ప్రధానంగా మూడు రకాల కారణాలను చెప్పుకోవచ్చు.

1. రక్తనాళ సంకోచ, వ్యాకోచాలు అస్తవ్యస్తం కావటం

 • కొందరు రక్తం చూసినా, బాగా అలసిపోయినా, భయంకరమైన సంఘటనలు చూసినా స్పృహ కోల్పోవచ్చు. దీన్నే వాసోవేగల్‌ అటాక్స్‌ అంటారు. ఇందులో రక్తనాళాలు వ్యాకోచించటం వల్ల గుండె వేగం, రక్తపోటు హఠాత్తుగా పడిపోతాయి. దీంతో మెదడుకు తగినంత రక్తం సరఫరా అవక కాసేపు స్పృహ తప్పుతుంటుంది. ఇది చాలా సర్వ సాధారణమైంది. ప్రమాదకరమైందేమీ కాదు. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే దాదాపు అందరికీ తగ్గిపోతుంది. చాలావరకూ నిమిషంలోపే స్పృహలోకి వస్తారు. కాకపోతే కింద పడ్డప్పుడు తలకు దెబ్బతగిలే ప్రమాదముంది.
 • కొందరు కూర్చొని, లేచిన తర్వాత స్పృహ తప్పుతుంటారు (పోశ్చరల్‌ హైపోటెన్షన్‌). దీనికి మూలం స్వయం ప్రపత్తి నాడులు సరిగా పని చేయకపోవటం. సాధారణంగా మనం కూర్చొని, లేచినప్పుడు కాళ్లలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. దీంతో మెదడుకు తగినంత రక్తం అందుతుంది. ఒకవేళ కాలిలోని రక్తనాళాలు సరిగా కుంచించుకోకపోతే అక్కడ రక్తం చేరిపోతుంది. ఫలితంగా మెదడుకు సరిగా రక్తం సరఫరా అవక స్పృహ తప్పే అవకాశముంది.
 • మెడ నుంచి వెళ్లే ధమని (కెరొటిడ్‌ ఆర్టరీ) విడిపోయే చోట ఒత్తిడి పడటమూ కారణం కావొచ్చు. దీంతో నాడీ వేగం, రక్తపోటు పడిపోయి స్పృహ తప్పొచ్చు (కెరొటిడ్‌ సైనస్‌ సింకోపీ). చొక్కా కాలర్‌ బిగుతుగా ఉండటం, టై గట్టిగా కట్టుకోవటం దీనికి దారితీయొచ్చు. పెద్దవయసులో తల ఒకవైపునకు తిప్పినప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తొచ్చు.

2. గుండె జబ్బులు

గుండె చాలా వేగంగా కొట్టుకోవటం, మరీ నిదానంగా కొట్టుకోవటం వంటి గుండెజబ్బులూ స్పృహ తప్పేలా చేయొచ్చు. ఒక్కొక్కసారి గుండెలోని కవాట సమస్యలతోనూ ఇది సంభవించొచ్చు. చిన్న పిల్లల్లో ఫాలోట్స్‌ టెట్రాలజీ అనే గుండె జబ్బుతోనూ స్పృహ తప్పుతుంటారు.

- ఇవేకాకుండా పెద్దవారిలో కొందరు మూత్రం పోశాక, బాగా దగ్గిన తర్వాత స్పృహ తప్పుతుంటారు. పిల్లల్లో అతిగా గుక్క పట్టి ఏడ్చిన తర్వాతా దీన్ని చూస్తుంటాం. మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజు బాగా పడిపోవటం (హైపోగ్లైసీమియా) మూలంగా స్పృహ తప్పే ప్రమాదముంది. వీరిలో చెమట్లు పట్టటం, రక్తపోటు బాగా పడిపోవటం, కళ్లు బైర్లు కమ్మటం, ఏదేదో మాట్లాడటమూ కనిపిస్తాయి. వీరికి గ్లూకోజు ఇస్తే తిరిగి కోలుకుంటారు.

 • అధిక రక్తపోటు గలవారు వేసుకునే కొన్ని మందులతోనూ బీపీ బాగా తగ్గిపోయి స్పృహ తప్పొచ్చు.
 • ఈ రోజులలో మరో ముఖ్య కారణం మద్యం, మాదక ద్రవ్యాలు. ముఖ్యంగా యువతలో ఈ రెండు కారణాలు చాలా ఎక్కువయ్యాయి.
 • మరో రకమైన స్పృహ తప్పటం హిస్టీరియా. ఇది ఆడవారిలో.. ముఖ్యంగా యుక్తవయసులో వస్తుంది. వీళ్లు స్పృహ కోల్పోయినట్టు నటిస్తారు. పడిపోయేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని, దెబ్బలు తగలకుండా పడిపోతారు. వీరు శ్వాస చాలా వేగంగా తీసుకుంటుంటారు. పెద్దగా మూలుగుతుంటారు.

3. మెదడుకు రక్తప్రసరణ ఆగటం

మెదడులో ఉన్నట్టుండి రక్త ప్రసరణ ఆగిపోయినా స్పృహ తప్పుతుంటుంది. ఉదాహరణకు- మెదడులో రక్తస్రావమై రక్తం గడ్డకట్టటం వల్ల తలెత్తే పక్షవాతంలో స్పృహ కోల్పోతుంటారు.


చేయవలసిన ప్రథమ చికిత్స

ఉన్నట్టుండి ఎవరైనా స్పృహ తప్పితే పక్కన ఉన్నవారికి కాలూచేయీ ఆడదు. అలాగని గాబరా పడితే లాభం లేదు. తక్షణం కొన్ని సపర్యలు చేయటం మంచిది.

 • స్పృహ తప్పినవారిని వెల్లకిలా పడుకోబెట్టాలి. మెడ ఒక పక్కకి తిప్పాలి.
 • దుస్తులను వదులు చేయాలి.
 • నాడి ఎలా ఉందో చూడాలి. బాగా నిదానంగా గానీ చాలా వేగంగా గానీ కొట్టుకుంటుంటే గుండెకు సంబంధించిన సమస్య కారణం కావొచ్చని అనుమానించాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరికి లేదా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
 • స్పృహలోంచి తేరుకున్నాక మాట నంగిగా వస్తున్నా, నోరు సొట్టపోయినా, చేయి, కాలు చచ్చుబడినట్టు అనిపించినా ఆలస్యం చేయొద్దు. తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
 • రక్తంలో గ్లూకోజు పడిపోవటం వల్ల స్పృహ తప్పినవారికి ముందుగా నోరు తెరచి రెండు చెంచాల గ్లూకోజు లేదా పంచదార వేయాలి. దీంతో గ్లూకోజు మోతాదులు పెరిగి, కోలుకుంటారు. అయితే గ్లూకోజు నీళ్లు, పంచదార నీళ్లు, కూల్‌డ్రింకుల వంటివి నోట్లో పోయొద్దు. ఇవి మింగుడు పడకపోయినా, పొలమారినా ఊపిరితిత్తుల్లోకి పోయే ప్రమాదముంది.

పరీక్షలు ప్రధానం

స్పృహ నుంచి పూర్తిగా కోలుకున్నా, లేకపోయినా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. స్పృహ తప్పినవారి ఆరోగ్యం తీరుతెన్నులు, ఇంతకుముందు వచ్చిన జబ్బులు, వాడుతున్న మందుల వివరాలను డాక్టర్‌కు తెలియజేయాలి. మద్యం, నిద్ర మాత్రల అలవాట్లుంటే వివరించాలి. యువతలో గంజాయి అలవాటు ఉన్నా నిస్సంకోచంగా చెప్పాలి. ఆయా విషయాలను బట్టి డాక్టర్లు కొన్ని పరీక్షలు చేయిస్తారు.
ఈసీజీ, ఎకో: గుండె కొట్టుకునే లయను తెలిపే ఈసీజీ పరీక్ష చాలా ముఖ్యం. అలాగే ఎకోకార్డియోగ్రామ్‌ కూడా అవసరమే. ఇందులో గుండె నిర్మాణం, గోడలు, కవాటాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఏవైనా సమస్యలుంటే బయటపడతాయి.
రక్తంలో గ్లూకోజు: మధుమేహం ఉన్నదీ లేనిదీ దీంతో తెలుస్తుంది. మధుమేహం ఉన్నవారిలోనూ గ్లూకోజు నియంత్రణలో ఉందో లేదో తెలుసుకోవటానికీ ఇది అవసరమే.
టిల్ట్‌ టేబుల్‌ పరీక్ష: ఇది ప్రత్యేకమైన పరీక్ష. సింకోపీ లక్షణాలు తెలుసుకోవటానికిది తోడ్పడుతుంది. ఇందులో సురక్షితమైన బెల్టులు, ఫుట్‌రెస్ట్‌తో కూడిన ప్రత్యేకమైన బల్ల మీద పడుకోబెట్టి.. తర్వాత బల్లను నిలువుగా లేపి ఈసీజీ, రక్తపోటును పరీక్షిస్తారు. దీంతో పడుకున్నప్పుడు, నిలువుగా ఉన్నప్పుడు రక్తపోటు ఎలా ఉందో తెలుస్తుంది. పోశ్చరల్‌ హైపోటెన్షన్‌ ఉంటే ఇందులో బయటపడుతుంది. తగు చికిత్సను నిర్ణయించుకోవటానికి తోడ్పడుతుంది.
వాల్సల్వా పరీక్ష: గాఢంగా శ్వాస తీసుకొని.. నోరు, ముక్కు మూసుకొని గట్టిగా గాలిని కాసేపు అలాగే పట్టి ఉంచటమన్నమాట. అంటే మల విసర్జన చేస్తున్నప్పుడు ముక్కినట్టు ప్రవర్తించటమన్నమాట. దీంతో గుండె వేగం, రక్తపోటు మార్పుల వంటివి తెలుస్తాయి. స్పృహ తప్పే అవకాశముంటే బయటపడుతుంది.

- ఎవరైనా తరచూ స్పృహ తప్పుతుంటే తప్పకుండా డాక్టర్‌తో పరీక్ష చేయించాలి. స్పృహ తప్పి చాలాసేపు అలాగే ఉండిపోయినా నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా పెద్దవయసులో స్పృహ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవటానికి తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
నిద్రపరంగా: ఒక్కసారిగా మంచం మీది నుంచి లేవొద్దు. పడకగదిలో తప్పనిసరిగా బెడ్‌లైట్‌ వేసి ఉంచాలి. మంచం మీది నుంచి లేచినప్పుడు అవసరమైతే చేతికర్ర సహాయం తీసుకోవాలి.
స్నానం చేసేటప్పుడు: స్నానాల గది తలుపు బోల్టు వేయొద్దు. తలుపు మీద తువాలు వేస్తే లోపల ఎవరో ఉన్నట్టు బయటివారికి తెలుస్తుంది. చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే రక్తనాళాలు వ్యాకోచించి స్పృహ కోల్పోయే ప్రమాదముందని తెలుసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు కళ్లు మూసుకొని ముఖానికి సబ్బు రుద్దుకుంటాం కదా. ఇలాంటప్పుడు తూలిపోయి, స్పృహ కోల్పోవచ్చు.
రక్తప్రసరణ విషయంలో: పెద్ద వయసులో మోకాలి కింది వరకు సాక్సు ధరించొచ్చు. ఎలాస్టిక్‌ బ్యాండేజీని మరీ బిగుతుగా కాకుండా కట్టుకోవచ్చు. అంగుళం వెడల్పు గల పొడవాటి వస్త్రాన్నయినా చుట్టుకోవచ్చు.
బయటకు వెళ్లేటప్పుడు: బాగా ఎండ కాస్తున్నప్పుడు బయటకు వెళ్లొద్దు. వేడికి చర్మంలో ఉన్న రక్తనాళాలు వ్యాకోచించి మెదడుకు రక్త సరఫరా తగ్గి, స్పృహ కోల్పోవచ్చు. గొడుగు వేసుకుంటే మంచిది.
మందులు వేసుకుంటుంటే: మతిమరుపు మూలంగా పొరపాటున ఎక్కువసార్లు మందులేసుకునే అవకాశముంది. ముఖ్యంగా గ్లూకోజు, రక్తపోటు తగ్గించే మాత్రల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.


ముఖ్యమైన విషయం

ఇంట్లో పెద్దవయసు వారికి స్పృహ తప్పితే, కుర్చీలో కూర్చొని ఉన్నట్టయితే.. కాళ్లను మోకాళ్ల దగ్గరికి మడిచి, రెండు మోకాళ్ల మధ్యలో తలను ఉంచాలి. అలాగే వీలుంటే వెల్లకిలా పడుకోబెట్టాలి. నోటిలో పంచదార లేదా గ్లూకోజు వేయాలి. నీరు తాగించే ప్రయత్నం చేయొద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని