నోటి ఆరోగ్యానికి కృత్రిమ నాలుక!

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు రెండో అతి పెద్ద కారణం ఇవే. నిర్ధరణలో పొరపడటం, చికిత్స ఆలస్యం కావటమూ మరణాలు పెరిగేలా చేస్తున్నాయి.

Published : 05 Mar 2024 00:04 IST

మన నోటి ఆరోగ్యంలో బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. దుర్వాసన, చిగుళ్లవాపు దగ్గరి నుంచి పిప్పి పళ్ల వరకూ రకరకాల ఇబ్బందులకు కారణమవుతుంది. వీటిని నిర్ధరించి, చికిత్స చేయటం తప్పనిసరి. కానీ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే బ్యాక్టీరియాను గుర్తించటం అంత తేలిక కాదు. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి శాస్త్రవేత్తలు తాజాగా ‘కృత్రిమ నాలుక’ను సృష్టించారు! ఇది దంత సమస్యలకు కారణమవుతున్న బ్యాక్టీరియాను గుర్తించటమే కాకుండా నిర్వీర్యం చేసేస్తుంది కూడా.

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు రెండో అతి పెద్ద కారణం ఇవే. నిర్ధరణలో పొరపడటం, చికిత్స ఆలస్యం కావటమూ మరణాలు పెరిగేలా చేస్తున్నాయి. పిప్పి పళ్లు, చిగుళ్ల వాపు వంటి దంత సమస్యల విషయానికి వస్తే- ఇవి రోజువారీ జీవితం మీద విపరీత ప్రభావం చూపుతాయి. శరీరంలో ఇతర జబ్బులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు దంత ఇన్‌ఫెక్షన్ల వంటివి మెదడుకూ చేరుకోవచ్చు. మెదడు పొరల వాపు, చీము పట్టటానికి కారణం కావొచ్చు. అందువల్ల దంత సమస్యలకు కారణమవుతున్న బ్యాక్టీరియా రకాలను గుర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కృత్రిమ నాలుక ఆసక్తి రేపుతోంది. పేరుకు నాలుక అని పిలుచుకున్నప్పటికీ నిజానికిదో రసాయన గ్రాహకాల అమరిక.

ఎలా పనిచేస్తుంది?

కృత్రిమ నాలుకలో ప్రధానమైనవి నానో పార్టికల్స్‌. ఒకరకంగా వీటిని సహజ ఎంజైమ్‌లను పోలిన నానోఎంజైమ్‌లు అనుకోవచ్చు. ఐరన్‌ డయాక్సైడ్‌తో తయారు చేసిన వీటికి డీఎన్‌ఏ పోచల పూత పూస్తారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, రంగులేని ఇండికేటర్‌తో కూడిన ప్రత్యేక ద్రావణం మరో ముఖ్యమైన అంశం. నానో ఎంజైమ్‌ల సమక్షంలో ఈ  ద్రావణం నీలం రంగులోకి మారుతుంది. అయితే డీఎన్‌ఏకు బ్యాక్టీరియా అంటుకొని ఉంటే అది నానోఎంజైమ్‌ల పత్రిచర్యను తగ్గిస్తుంది. దీంతో ద్రావణం అంత నీలంగా మారదు. నానోఎంజైమ్‌లకు వేర్వేరు డీఎన్‌ఏ రకాల పూత పూయటం వల్ల ఆయా బ్యాక్టీరియా రకాలను బట్టి వివిధ రంగులు ఏర్పడతాయి కూడా. ఇలా అతి త్వరగా బ్యాక్టీరియాను పట్టుకోవటమే కాకుండా ఒకే సమయంలో వివిధ రకాలనూ గుర్తిస్తుంది.

సంప్రదాయానికి భిన్నం

ప్రస్తుతం బ్యాక్టీరియాను గుర్తించటానికి వాటి నమూనాలను తీసుకొని, ల్యాబులో వృద్ధి చేసే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దీని ఫలితాలు రావటానికి రెండు, మూడు రోజులు పడుతుంది. కొత్త కృత్రిమ నాలుక అయితే చిటికెలోనే గుర్తిస్తుంది. అదీ చవకగా.

పరీక్షలో మేటి

కృత్రిమ నాలుకను పరిశోధకులు నోట్లో కనిపించే 11 రకాల బ్యాక్టీరియా నమూనాల మీద పరీక్షించగా మంచి ఫలితం కనిపించింది. ఇది లాలాజలం నమూనాల్లోని బ్యాక్టీరియానూ గుర్తించింది. దంతాల మీద పట్టే గార నమూనాను పరీక్షించి అది దంత సమస్యలు గలవారిదా? ఆరోగ్యవంతులదా? అనే విషయాన్నీ నిర్ణయించింది.

నిర్వీర్యమూ చేస్తుంది

తరచూ కనిపించే మూడు రకాల బ్యాక్టీరియాతో కూడిన ద్రావణంలో నానోఎంజైమ్‌లను వేయగా.. ఇవి బ్యాక్టీరియాను నిర్వీరం చేయటం విశేషం. మైక్రోస్కోప్‌తో పరిశీలించినప్పుడు బ్యాక్టీరియా పైపొర ఛిద్రమైనట్టూ తేలింది. అంటే మున్ముందు బ్యాక్టీరియా మూలంగా తలెత్తే దంత సమస్యల చికిత్సకూ దీన్ని వాడుకోవచ్చన్నమాట. కృత్రిమ నాలుకను నోట్లో ఎలా అమరుస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు గానీ హానికర బ్యాక్టీరియాను గుర్తించటం, వాటిని నిర్వీర్యం చేయటం ద్వారా ఇది నోటి ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు తేగలదని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని