కిడ్నీలు పదిలం!

కిడ్నీలు మహా గట్టి పిండాలు. ఉండేది పిడికెడే అయినా చేసే పనులు చాలా గొప్పవి. జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే వ్యర్థాలను రక్తంలోంచి వడగట్టి, వాటిని మూత్రం రూపంలో బయటకు వెళ్లగొడతాయి.

Updated : 12 Mar 2024 06:42 IST

ఎల్లుండి వరల్డ్‌ కిడ్నీ డే

కిడ్నీలు మహా గట్టి పిండాలు. ఉండేది పిడికెడే అయినా చేసే పనులు చాలా గొప్పవి. జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే వ్యర్థాలను రక్తంలోంచి వడగట్టి, వాటిని మూత్రం రూపంలో బయటకు వెళ్లగొడతాయి. శరీరంలో ద్రవాల మోతాదులను నియంత్రిస్తాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలను సమతులంగా ఉంచుతాయి. రెనిన్‌ వంటి హార్మోన్ల ఉత్పత్తితో రక్తపోటును అదుపు చేస్తాయి. హిమోగ్లోబిన్‌ సంశ్లేషణకు తోడ్పడే ఎరిత్రోపాయిటిన్‌ హార్మోన్‌ను విడుదల చేయటం.. విటమిన్‌ డిని చురుకైన రూపంలోకి మార్చటమూ వీటి ఘనతే. ఇలా శరీరం పరిశుభ్రంగా ఉండేలా.. సక్రమంగా, సజావుగా పనిచేసేలా చూస్తాయి. మనకోసం నిరంతరం ఇంతగా శ్రమించే కిడ్నీలను కాపాడుకోవటం మన విధి. ఈ సంవత్సరం   వరల్డ్‌ కిడ్నీ డే సూచిస్తోందీ ఇదే. ‘కిడ్నీ ఆరోగ్యం అందరికీ’ అని నినదిస్తూ.. చికిత్స, సంరక్షణ విధానాలు అందరికీ సమానంగా అందాలని చెబుతోంది. మనదేశంలో సుమారు 10% మంది ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధ పడుతున్నారనే అంచనాల నేపథ్యంలో ఇది అత్యావశ్యకం కూడా.

 కిడ్నీలు చేసే ముఖ్యమైన పని రక్తాన్ని వడపోయటం. ఇందులో నెఫ్రాన్ల పాత్ర కీలకం. ఒకో కిడ్నీలో సుమారు పది లక్షల వరకూ నెఫ్రాన్లుంటాయి. వీటిల్లోని సూక్ష్మ రక్తనాళాల గుచ్ఛాలు (గ్లోమరులస్‌) ప్రాథమిక ఫిల్టర్‌గా పనిచేస్తే.. గొట్టంలాంటి భాగాలు (ట్యూబ్యూల్‌) శరీరానికి అత్యవసరమైన పదార్థాలను తిరిగి సంగ్రహిస్తాయి. అంటే ఒకవైపు అదనపు వ్యర్థాలను ఒంట్లోంచి బయటకు పంపటంతో పాటు అవసరమైన వాటిని అట్టి పెడతాయన్నమాట. కాబట్టే కిడ్నీలు దెబ్బతింటే శరీరమంతా ప్రభావితమవుతుంది. ఒంట్లో వ్యర్థాలు పోగుపడి చెత్తకుప్పలా తయారవుతుంది. చిత్రమేంటంటే- నెఫ్రాన్లు దెబ్బతింటున్నా తొలిదశలో పైకేమీ తెలియకపోవటం. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయి. దీంతో కిడ్నీల సామర్థ్యం క్రమంగా మందగిస్తుంది. చివరికి పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి (కిడ్నీ వైఫల్యం) వస్తుంది. అప్పుడు డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం. కానీ తొలిదశలో గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచటం మంచిది.

గుర్తించేదెలా?

కిడ్నీ జబ్బు తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. ముదురుతూ వస్తున్నకొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. వీటిని ముందుగా గుర్తిస్తే జబ్బు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
నిస్సత్తువ, అలసట: కిడ్నీ పనితీరు సన్నగిల్లితే రక్తహీనతకు దారితీస్తుంది. ఇందులో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోతుంది. దీంతో కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటివి పొడసూపుతాయి. ఇవి రోజువారీ పనులకూ ఆటంకం కలిగిస్తాయి.
పాదాల ఉబ్బు: ఎక్కువగా ఉన్న ద్రవాలను కిడ్నీలు తొలగించ లేకపోవటం పెద్ద సమస్య. దీంతో ద్రవాలు శరీరంలోనే.. ముఖ్యంగా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ పోగు పడతాయి. ఫలితంగా పాదాలు, కళ్ల ఉబ్బు మొదలవుతాయి.
మూత్రంలో మార్పులు: మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చు. తరచూ.. ముఖ్యంగా రాత్రిపూట మూత్రం రావటం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటివన్నీ కిడ్నీ సామర్థ్యం సన్నగిల్లుతోందటానికి సంకేతాలే.
చర్మం పొడి, దురద: కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే క్యాల్షియం, ఫాస్ఫేట్‌ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటివి తలెత్తుతాయి.
ఆకలి తగ్గటం: రక్తంలో విషతుల్యాలు పోగుపడుతున్నకొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. వికారం మొదలవుతుంది. దీంతో ఏదీ తినబుద్ధి కాదు. సరిగా తినకపోవటం వల్ల బరువూ తగ్గుతుంది.
తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవటం: రక్తంలో వ్యర్థాలు పోగవటం మెదడు పనితీరునూ ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రత కుదరకపోవటం, తలనొప్పి, తల తేలిపోవటం వంటి విషయగ్రహణ లక్షణాలు కనిపిస్తాయి. సమస్య తీవ్రమైతే మూర్ఛలకూ దారితీయొచ్చు.
- ఇలాంటి లక్షణాలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తుండటం వల్ల చాలామంది పొరపడుతుంటారు. దీంతో చికిత్స తీసుకోవటమూ ఆలస్యమవుతుంది. కాబట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు. తొలిదశలోనే కిడ్నీజబ్బును గుర్తిస్తే చికిత్స తేలికవుతుందని తెలుసుకోవాలి.

ఎందుకు దెబ్బతింటాయి?

కిడ్నీలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు దోహదం చేస్తుంటాయి.

1. మధుమేహం: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వైఫల్యానికిది ప్రధాన కారణం ఇదే. రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే కిడ్నీల్లోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్తాన్ని వడపోసే నెఫ్రాన్లూ క్షీణిస్తాయి. మధుమేహంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. ఇవీ కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదముంది.
2. అధిక రక్తపోటు: దీర్ఘకాలంగా రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీల మీద విపరీత భారం పడుతుంది. క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. నిజానికి అధిక రక్తపోటు కిడ్నీ జబ్బుకూ సంకేతమే.
3. సూక్ష్మ రక్తనాళాల వాపు: ఇన్‌ఫెక్షన్లు, స్వీయ రోగనిరోధక జబ్బులు, కొన్నిరకాల మందులతో కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో వాపు (గ్లోమరులోనెఫ్రయిటిస్‌) తలెత్తొచ్చు. ఇది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
4. కిడ్నీల్లో తిత్తులు: జన్యుపరంగా కొందరికి కిడ్నీల్లో నీటితిత్తులు ఉంటాయి. కొందరిలో కిడ్నీ మొత్తం ద్రాక్ష పండ్ల గుత్తిగా మారుతుంది కూడా. క్రమంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటూ వస్తుంది.
5. మూత్ర ఇన్‌ఫెక్షన్లు: కొందరికి తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీలూ దెబ్బతినే ప్రమాదముంది.
6. మందులు: నొప్పిని తగ్గించే మందులు, ఒమిప్రజోల్‌ వంటి పీపీఈ రకం మందులు, యాంటీబయాటిక్స్‌ వంటివీ కిడ్నీలను దెబ్బతీయొచ్చు. వీటిని డాక్టర్‌ సలహా లేకుండా అనవసరంగా, అధిక మోతాదులో, తరచూ వేసుకోవటం ప్రమాదకరం.


మనదేశంలో ప్రత్యేకించి..

మనదేశంలో కొన్నిచోట్ల..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టమైన కారణమేదీ లేకుండా కిడ్నీలు దెబ్బతినటమూ చూస్తున్నాం. పర్యావరణంలోని విషతుల్యాలు, భార లోహాల ప్రభావం, ఒంట్లో నీటి శాతం తగ్గటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అలాగే గాలి కాలుష్యమూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. గాలి కాలుష్యానికీ దీర్ఘకాల కిడ్నీ జబ్బుకూ సంబంధం ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక వేడి మూలంగానూ.. ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది.
ఎందుకు దెబ్బతింటాయి?


నిర్ధరణ కచ్చితంగా..

దీర్ఘకాల కిడ్నీజబ్బులో నిర్ధరణ చాలా కీలకం. దీని లక్షణాలు ఇతర జబ్బులనూ పోలి ఉండటం వల్ల కచ్చితంగా నిర్ధరించటం ముఖ్యం. పరీక్షలతో జబ్బు ఉన్నదీ లేనిదీ తేలుతుంది, తీవ్రతా బయటపడుతుంది. చికిత్సను నిర్ణయించుకోవటానికిది తోడ్పడుతుంది.
రక్త పరీక్షలు: దీర్ఘకాల కిడ్నీజబ్బు నిర్ధరణలో రక్తంలో క్రియాటినైన్‌ మోతాదులు కీలకం. ఇది కండరాల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థం. క్రియాటినైన్‌ మోతాదులు పెరిగితే కిడ్ని పనితీరు దెబ్బతిందనే అర్థం. దీని ఆధారంగానే కిడ్నీ వడపోత వేగాన్ని అంచనా (ఈజీఎఫ్‌ఆర్‌) వేస్తారు. కిడ్నీలు 50% దెబ్బతినేవరకూ క్రియాటినైన్‌ మోతాదులు పెరగకపోవచ్చు. అందువల్ల ఈజీఎఫ్‌ఆర్‌ అనేది చాలా ముఖ్యం. రక్తంలో క్రియాటినైన్‌ మోతాదులతో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని దీన్ని లెక్కిస్తారు. ఈజీఎఫ్‌ఆర్‌ 90 మి.లీ. కన్నా ఎక్కువుంటే నార్మల్‌. ఒకవేళ 90 మి.లీ. కన్నా తగ్గి, కిడ్నీలు కొంతవరకు దెబ్బతింటే కిడ్నీజబ్బు తొలిదశలో ఉందని అర్థం. ఇక 89-60 మి.లీ. ఉంటే ఒక మాదిరి.. 30-59 మి.లీ. ఉంటే మధ్యస్థ.. 15-29 మి.లీ. ఉంటే తీవ్ర దశ జబ్బుగా పరిగణిస్తారు. అదే ఈజీఎఫ్‌ఆర్‌ 15 కన్నా తగ్గితే కిడ్నీ వైఫల్యం మొదలైనట్టే.
మూత్ర పరీక్షలు: మూత్ర విశ్లేషణలో కిడ్నీ ఆరోగ్యం తీరుతెన్నులు తెలుస్తాయి. మూత్రంలో ప్రొటీన్‌ (ఆల్బుమిన్‌/సుద్ద), రక్తం పడటం కిడ్నీ జబ్బుకు సంకేతాలు. సుద్ద, క్రియాటినైన్‌ నిష్పత్తి ఆధారంగా మూత్రంలో ఎంత ప్రొటీన్‌ పోతుందో తెలుస్తుంది.
ఇమేజింగ్‌ పరీక్షలు: అల్ట్రాసౌండ్‌ లేదా సీటీ స్కాన్‌ పరీక్షలతో కిడ్నీ సైజు, ఆకారం, అడ్డంకుల వంటివన్నీ బయటపడతాయి. ఇవి కిడ్నీలను క్షుణ్నంగా విశ్లేషించటానికి తోడ్పడతాయి.
బయాప్సీ: కిడ్నీ పనితీరు సన్నగిల్లినా కారణమేంటో తెలియనప్పుడు చిన్న ముక్కను తీసి పరీక్షించాల్సి ఉంటుంది (బయాప్సీ). దీంతో కిడ్నీ తీరుతెన్నులతో పాటు ఎంతవరకు దెబ్బతిన్నదో కూడా బయటపడుతుంది.
రక్తపోటు: అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినటానికే కాదు.. కిడ్నీ దెబ్బతినటం మూలంగానూ రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి తరచూ బీపీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కిడ్నీ జబ్బు నిర్ధరణకే కాకుండా, జబ్బు నియంత్రణలో ఉంటుందో లేదో తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది.

కాపాడుకోవచ్చు

కిడ్నీ జబ్బుతో బాధపడటం కన్నా రాకుండా చూసుకోవటమే మంచిది. ఇందుకు కొన్ని జాగ్రత్తలు ఉపయోగపడతాయి. ఇవి కిడ్నీ జబ్బు ముప్పు తగ్గటానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, జబ్బు వచ్చినా త్వరగా ముదరకుండా చూసుకోవటానికి తోడ్పడతాయి.

  •  రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకు ఆహార, వ్యాయామ నియమాలు తోడ్పడతాయి. మొత్తమ్మీద రక్తపోటు 130/80 కన్నా మించకుండా చూసుకోవాలి. 140/90, అంతకన్నా ఎక్కువుంటే మందులు వేసుకోవాలి.
  •  మధుమేహం గలవారు గ్లూకోజును కచ్చితంగా నియంత్రించుకోవాలి. మూడు నెలల సగటు గ్లూకోజును తెలిపే హెచ్‌బీఏ1సీ 7 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తరచూ గ్లూకోజు పరీక్షించుకోవటం, సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం, క్రమం తప్పకుండా మందులేసుకోవటం ప్రధానం.
  •  ఆరోగ్యకరమైన జీవనశైలి కిడ్నీలకు పెద్ద రక్ష. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. రోజుకు 5-6 గ్రాముల మించకుండా చూసుకోవాలి. జంక్‌ ఫుడ్‌, నిల్వ ఆహార పదార్థాలు మానెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తప్పనిసరి. రోజుకు కనీసం అరగంట సేపైనా నడక, కాస్త వేగంగా పరుగెత్తటం, సైకిల్‌ తొక్కటం, ఈత కొట్టటం వంటివి చేయాలి. వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తాయి. రక్తంలో గ్లూకోజు, రక్తపోటూ తగ్గుతాయి. ఇవన్నీ కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడేవే.
  •  బరువు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఊబకాయులకు కిడ్నీజబ్బు ముప్పు 2-7 రెట్లు ఎక్కువ. అధిక బరువుతో కిడ్నీలపైనా భారం పెరుగుతుంది. ఊబకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులూ పొంచి ఉంటాయి. ఇవీ కిడ్నీలను దెబ్బతీసేవే. కాబట్టి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 కన్నా మించకుండా చూసుకోవాలి.
  •  మధుమేహం, అధిక రక్తపోటు గలవారు.. ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు వచ్చి ఉన్నవారు అప్పుడప్పుడు క్రియాటినైన్‌, మూత్ర పరీక్షలు చేయించుకోవటం మంచిది. కిడ్నీ జబ్బు ఆనవాళ్లుంటే ముందే తెలుస్తాయి.
  •  చీటికీ మాటికీ డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులను వేసుకోవద్దు. ఇవే కాదు.. ఎలాంటి మందులనైనా డాక్టర్‌ సలహా లేకుండా వాడొద్దు.
  •  తగినంత నీరు తాగాలి. కిడ్నీలు సరిగా పనిచేయటానికిది తోడ్పడుతుంది. సోడియం, యూరియా, విషతుల్యాలు తేలికగా బయటకు పోవటానికి సాయం చేస్తుంది.
  •  సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగితే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీ జబ్బు ముప్పు పెరుగుతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లొద్దు.
  •  మద్యం మితిమీరితే రక్తపోటులో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. కాలేయం దెబ్బతింటుంది. కిడ్నీ పనితీరూ మందగిస్తుంది. కాబట్టి మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. అలవాటు లేనివారు దీని జోలికి వెళ్లొద్దు.
  •  రక్తంలో కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంచుకోవాలి. మాంసాహారం, వేపుళ్లు తగ్గించుకోవాలి.

చికిత్స

కిడ్నీ జబ్బు చికిత్స అందరికీ ఒకేలా ఉండదు. జబ్బు దశ, జబ్బుకు దారితీసిన అంశాలు, ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. జబ్బు త్వరగా ముదరకుండా, లక్షణాలను తగ్గించేలా, రోజువారీ జీవితాన్ని హాయిగా గడిపేలా చూడటమే చికిత్స ఉద్దేశం.

  •  రక్తపోటు అదుపు అతి ముఖ్యం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటంతో పాటు మందులూ ఉపయోగపడతాయి. ఏసీఈ ఇన్‌బిటార్స్‌ లేదా ఏఆర్‌బీ రకం మందులు రక్తపోటును తగ్గించటంతో పాటు మూత్రంలో సుద్ద పోకుండా చూస్తాయి. కిడ్నీ త్వరగా దెబ్బతినకుండా కాపాడతాయి.
  •  మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజు కచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూడటం చాలా చాలా ముఖ్యం. ఇందుకు గ్లూకోజును తగ్గించే మందులు, ఇన్సులిన్‌ అవసరమవుతాయి.
  • దీర్ఘకాల కిడ్నీజబ్బు నియంత్రణలో ఆహారం పాత్ర కీలకం. ముఖ్యంగా ఉప్పు తగ్గించుకోవాలి. అలాగే పొటాషియం, ఫాస్ఫరస్‌ పరిమితం చేసుకోవాలి. దీంతో కిడ్నీల మీద భారం, ఒంట్లో వ్యర్థాలు పోగవటం తగ్గుతాయి.
  •  కిడ్నీజబ్బు మూలంగా రక్తహీనత, ఎముక జబ్బులు, పొటాషియం పెరగటం వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వీటికీ చికిత్స అవసరం. రక్తహీనత తగ్గటానికి ఎరిత్రోపాయిటిన్‌ ఉత్పత్తిని పెంచే మందులు, ఎముక ఆరోగ్యానికి ఫాస్ఫేట్‌ బైండర్‌ రకం మందులు ఉపయోగపడతాయి. ఆహారంలో మార్పులు లేదా మందులతో పొటాషియం మోతాదులు తగ్గేలా చూడాల్సి ఉంటుంది.
  •  డయాలిసిస్‌: కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలిసిస్‌ అవసరమవుతుంది. ఇది రక్తంలోని వ్యర్థాలు, ఎక్కువమొత్తంలో ఉండే ద్రవాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది. ఇందులో రెండు రకాల పద్ధతులున్నాయి.
  •  కిడ్నీ మార్పిడి: కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు ఇతరుల కిడ్నీని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది డయాలిసిస్‌ నుంచి విముక్తి కలిగిస్తుంది. మరింత చురుకుగా జీవించటానికి తోడ్పడుతుంది. అయితే కిడ్నీని శరీరం తిరస్కరించకుండా జీవితాంతం రోగనిరోధకశక్తిని అణచి పెట్టే మందులు వాడుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని