మలేరియా చికిత్సకు పోషణలేమి గండి

పోషణలోపం పిల్లలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది ఎదుగులను దెబ్బతీయటంతో పాటు జబ్బుల ముప్పునూ పెంచుతుంది. జబ్బులు తగ్గటమూ కష్టం కావొచ్చు.

Published : 19 Mar 2024 00:34 IST

పోషణలోపం పిల్లలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది ఎదుగులను దెబ్బతీయటంతో పాటు జబ్బుల ముప్పునూ పెంచుతుంది. జబ్బులు తగ్గటమూ కష్టం కావొచ్చు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం కూడా ఇదే సూచిస్తోంది. తీవ్ర పోషణలోపం గల పిల్లలకు మలేరియా చికిత్సలు విఫలం కావటం, తిరిగి జబ్బు సంక్రమించే ముప్పు ఎక్కువని ఇందులో బయటపడింది. ఎత్తుకు తగిన బరువులేని ఐదేళ్ల లోపు పిల్లల్లో మలేరియా చికిత్సలు విఫలమయ్యే ముప్పు సుమారు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేసిన అత్యుత్తమ మలేరియా మందులిచ్చినా కూడా ఈ దుష్ప్రభావం కనిపిస్తుండటం గమనార్హం. అంతేకాదు వీరికి తీవ్ర మలేరియా, మరణాల ముప్పులూ ఎక్కువగానే ఉంటున్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది పిల్లలు తీవ్ర పోషణలేమితో బాధపడుతున్నారని అంచనా. గత మూడేళ్లలోనే వీరి సంఖ్య 30% పెరిగింది కూడా. మలేరియాతో చనిపోతున్నవారిలో 80% మంది ఐదేళ్లలోపు పిల్లలే కావటం విషాదం. మలేరియా, పోషణలేమి పేద సమాజాల్లోనే ఎక్కువ. పరిశోధన వనరులూ తక్కువే. అందువల్ల పోషణలేమితో బాధపడే పిల్లల్లో మలేరియా చికిత్సల ప్రభావం మీద అంతగా అధ్యయనాలు జరగలేదు. గతంలో నిర్వహించిన అధ్యయనల్లో విరుద్ధ ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మలేరియా చికిత్సల ఫలితాలు, పోషణలేమి రెండూ ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటున్నట్టు తేలటం ఆలోచించదగ్గ విషయం. అందుకే మున్ముందు మలేరియా మీద నిర్వహించే అధ్యయనాల్లో పిల్లల ఎత్తు, బరువులనూ నమోదు చేయాలని పరిశోధకులు సూచించారు. మలేరియా విషయంలో ఏయే పిల్లలను మరింత ఎక్కువ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన అవసరముందో తెలుసుకోవటానికిది తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఇలాంటి పిల్లలకు మలేరియా మందుల మోతాదును పెంచాలా? అనేది తెలుసుకోవటానికీ మున్ముందు శోధించాల్సిన అవసరముందని భావిస్తున్నారు. ఏదేమైనా పిల్లల్లో పోషణలోపం తలెత్తకుండా చూడటం అత్యవసరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని