పొగాకుతో మధుమేహం!

టైప్‌2 మధుమేహాన్ని బద్ధకం, పిండి పదార్థాలు ఎక్కువగా తినటంతో ముడిపడిందనే భావిస్తుంటాం. పొగాకు, పొగాకు ఉత్పత్తులూ దీనికి దోహదం చేస్తున్నట్టు తాజాగా బయటపడింది.

Updated : 26 Mar 2024 05:11 IST

టైప్‌2 మధుమేహాన్ని బద్ధకం, పిండి పదార్థాలు ఎక్కువగా తినటంతో ముడిపడిందనే భావిస్తుంటాం. పొగాకు, పొగాకు ఉత్పత్తులూ దీనికి దోహదం చేస్తున్నట్టు తాజాగా బయటపడింది. తల్లి కడుపులో ఉండగా పొగాకు ప్రభావానికి గురైనవారికి.. బాల్యంలో లేదా యుక్తవయసులో సిగరెట్లు తాగటం మొదలెట్టిన వారికి పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశమున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మధుమేహం వచ్చే జన్యు స్వభావం గలవారికి దీని ముప్పు మరింత స్పష్టంగా ఉంటుండటం గమనార్హం. నిజానికి పెద్దవారిలో పొగాకు ప్రభావానికీ మధుమేహానికీ సంబంధం ఉంటున్నట్టు ఇంతకుముందే వెల్లడైంది. సిగరెట్లు తాగేవారికి మధుమేహం ముప్పు 30-40% వరకూ ఎక్కువని తేలింది. అయితే చిన్న వయసులో పొగాకు ప్రభావం గురించి స్పష్టంగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే చైనాకు చెందిన షాంఘై జియావో టాంగ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. బ్రిటన్‌ బయోబ్యాంకులో ఉన్న 4.76 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి.. పుట్టటానికి ముందు పొగాకు ప్రభావాన్ని పరిశీలించారు.

అలాగే బాల్యంలో, యుక్తవయసులో సిగరెట్లు కాల్చటం ఆరంభించినవారి సమాచారాన్నీ విశ్లేషించారు. మధుమేహానికి కారణమయ్యే జన్యు స్వభావాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. పుట్టకముందు పొగాకు ప్రభావానికి గురైతే టైప్‌ 2 మధుమేహం వచ్చే అవకాశం 22% ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. పొగతాగే అలవాటు లేనివారితో పోలిస్తే యుక్తవయసులో సిగరెట్లు కాల్చటం మొదలెట్టినవారికి 57% ముప్పు అధికంగా ఉంటున్నట్టూ తేల్చారు. జన్యు స్వభావం కూడా ఉన్నవారిలోనైతే ఇది గణనీయంగా పెరగటం గమనార్హం. జన్యు స్వభావం ఉండి, పుట్టకముందు పొగాకు ప్రభావానికి గురైనవారికి మధుమేహం ముప్పు 330% ఎక్కువగా ఉంటోంది. బాల్యంలో పొగ అలవాటు ఆరంభించినవారికైతే 639%, యుక్తవయసులో మొదలెడితే 427% ముప్పు అధికంగా పొంచి ఉండటం ఆందోళనకరం. అయితే దీన్ని తగ్గించుకునే మార్గం లేకపోలేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించినవారిలో మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గుతోందనీ వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు