క్షయను పోషించొద్దు!

అసలే క్షయ. ఆపై పోషణ లోపం (మాల్‌న్యూట్రిషన్‌). రెండూ కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. పోషణ లోపంతో క్షయ ముప్పు, తీవ్రత పెరుగుతాయి.

Updated : 26 Mar 2024 04:31 IST

అసలే క్షయ. ఆపై పోషణ లోపం (మాల్‌న్యూట్రిషన్‌). రెండూ కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. పోషణ లోపంతో క్షయ ముప్పు, తీవ్రత పెరుగుతాయి. మరో వైపు క్షయ పోషణ లోపానికీ దారితీస్తుంది. దీంతో జబ్బు నయం కావటం ఆలస్యమవుతుంది. మరణాల ముప్పూ పెరుగుతుంది. అంటే ఒకరకంగా మన పోషణ లోపమే క్షయను బలోపేతం చేస్తోందన్న మాట. దీన్ని అరికట్టటం మనందరి విధి. క్షయ నివారణలోనే కాదు.. చికిత్సలోనూ పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యముందనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. వీలైనంత త్వరగా క్షయను పూర్తిగా కట్టడి చేయాలని మనదేశం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికిది తప్పనిసరి.

 ఎందుకొస్తుందో తెలుసు. సమర్థమైన చికిత్సా అందుబాటులో ఉంది. నిర్ధరణ దగ్గరి నుంచి మందుల వరకూ అన్నీ ఉచితమే. అయినా క్షయ నివారణ గానీ అదుపు గానీ ఇప్పటికీ సాధ్యం కావటం లేదు. దీని బారినపడుతున్నవారి సంఖ్య అంతగా తగ్గకపోవటమే దీనికి నిదర్శనం. ఇది ఒకరకంగా మానవ వైఫల్యమే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల మంది క్షయ బారిన పడుతుండగా.. వీరిలో దాదాపు 10 లక్షల మంది మనదేశానికి చెందినవారే! దీని మూలంగా ఏటా 5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఆలస్యంగా జబ్బును గుర్తించటం, జబ్బు నిర్ధరణ అయినా సరిగా మందులు వాడకపోవటం, మొండి రకం క్షయలో మందులు కూడా అంత బాగా పనిచేయకపోవటం వంటి అంశాలెన్నో దీనికి కారణమవుతున్నాయి. వీటికి తోడు పోషణలేమి.. ఇది తినకూడదు, అది తినకూడదనే అపోహలు.. పథ్యాలూ తక్కువేమీ కాదు. క్షయ బాధితులు మంచి పోషకాహారం తింటే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. త్వరగా తగినంత బరువు పెరుగుతారు. మందులు సమర్థంగా పనిచేస్తాయి. క్షయ కారక బ్యాక్టీరియా చాలా వేగంగా నిర్వీర్యమవుతుంది. అధ్యయనాలూ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. మంచి పోషకాహారం తీసుకునేవారికి క్షయ ముప్పు గణనీయంగా తగ్గటమే కాకుండా.. క్షయతో బాధపడేవారిలోనూ తొలి రెండు నెలల్లో బరువు పెరిగితే మరణించే ముప్పు 60 శాతం వరకూ తగ్గుతున్నట్టు తేలటం విశేషం. కాబట్టి క్షయ విషయంలో పోషణలేమి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టటం మంచిది.

 ఎంటీ సంబంధం?

శరీరానికి తగినంత పోషణ లభించకపోతే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది. హానికారక క్రిములను నిలువరించే యాంటీబాడీలు అంతగా ఉత్పత్తి కావు. టి కణాలతో ముడిపడిన రోగనిరోధకతా క్షీణిస్తుంది. దీంతో చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లు తగ్గాలన్నా చాలా సమయం పడుతుంది. ఇక క్షయ గురించి చెప్పేదేముంది? మనదేశంలో కొత్తగా క్షయ బారినపడుతున్నవారిలో 55% మంది పోషణలేమి గలవారే కావటం గమనార్హం. నిజానికి క్షయ కారక మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ సోకినా అందరికీ జబ్బు రావాలనేమీ లేదు. మన రోగనిరోధక శక్తి దాన్ని అణచి వేయటానికే ప్రయత్నిస్తుంది. కానీ పోషణలేమి గలవారిలో ఈ రక్షణ కొరవడుతుంది. దీంతో త్వరగా క్షయ వచ్చే ప్రమాదముంది. క్షయ బారినపడ్డవారిలోనూ సమర్థమైన చికిత్స తీసుకుంటున్నా పోషణలేమి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. ఎత్తు, బరువు నిష్పత్తి (బీఎంఐ) తక్కువ గల క్షయ బాధితుల్లో మరణాల శాతం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా మందులు ఆరంభించిన 15 రోజుల్లోనే క్షయ కారక బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించని స్థితికి చేరుకుంటుంది. ఆరు వారాల్లో కళ్లెలోనూ క్రిములు కనిపించవు. కానీ పోషణలేమి గలవారిలో ఇవి ఆలస్యమవుతాయి. కళ్లెలో క్రిములు కనుమరుగు కావటానికీ 10-12 వారాలు పట్టొచ్చు. అంటే వీరి ద్వారా ఎక్కువమందికి క్షయ వ్యాపించే ప్రమాదముందన్నమాట. పిల్లల విషయంలోనూ- పుట్టినప్పుడు 2.5 కిలోల కన్నా తక్కువ బరువు గల పిల్లలకు క్షయ ముప్పు ఎక్కువ. వీరికి బీసీజీ టీకా కూడా అంతగా రక్షణ కల్పించటం లేదు. తక్కువ బరువు గల ఏడాదిలోపు వయసు పిల్లల్లో 22.5% మంది, పెద్దపిల్లల్లో 6-8% మంది క్షయ బారినపడుతున్నారని అంచనా. అమ్మాయిలకు యుక్తవయసులో మంచి పోషకాహారం ఇస్తే పెద్దయ్యాక వారికి పుట్టే పిల్లలూ మంచి బరువుతో పుడతారు. లేకపోతే తక్కువ బరువు పిల్లలు పుట్టే అవకాశముంది. అంటే క్షయ నివారణ అమ్మాయిల చిన్నతనం నుంచే మొదలవుతుందన్నమాట.

ఎలా పెచుకోవాలి ?

పిండి పదార్థం, ప్రొటీన్‌, కొవ్వులు.. శరీర పోషణకు ముఖ్యమైన స్థూల పోషకాలు ఇవే. శరీర బరువులో ప్రతి కిలోకు రోజుకు 40 కిలో కేలరీలు శక్తి అవసరం. అంటే 50 కిలోల బరువున్నవారు 2,000 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలన్నమాట. పిండి పదార్థంతో 1000, ప్రొటీన్‌తో 300, కొవ్వు పదార్థాలతో 700 కేలరీలు లభించేలా చూసుకోవాలి. ఒక గ్రాము ప్రొటీన్‌తో 4 కేలరీలు.. ఒక గ్రాము పిండి పదార్థంతో (బియ్యం, గోధుమల వంటివి) 4 కేలరీలు లభిస్తాయి. ఒక గ్రాము కొవ్వుతో (నూనె, ఛీజ్‌, వెన్న, నెయ్యి వంటివి) 9 కేలరీలు లభిస్తాయి. వీటిని ఎక్కడ కొలుచుకొని తింటామని అనుకుంటున్నారేమో. అంత శ్రమ అక్కర్లేదు. మనం రోజూ తినే అన్నం, చపాతీ, పప్పు, ఆకుకూరలు, కూరగాయలతోనే అన్ని రకాల పోషకాలూ లభించేలా చూసుకోవచ్చు. కాకపోతే పిండి పదార్థాలు, ప్రొటీన్‌, కొవ్వు పదార్థాలు తగు పాళ్లలో ఉండేలా మార్పులు చేసుకుంటే చాలు. ఖరీదైన పదార్థాలు, పొడులు, టానిక్కుల వంటివేమీ అవసరం లేదు. అందుబాటులో ఉన్నవే ఎంచుకోవచ్చు. ఇంట్లో వండినవి, వేడి వేడి పదార్థాలు ఏవైనా తినొచ్చు. పథ్యాలేవీ అవసరం లేదు.

  •  బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు.. రాగులు, కొర్రల వంటి చిరుధాన్యాలతో పిండి పదార్థం తగినంత లభిస్తుంది. భోజనంలో ప్రధానంగా వీటిని తింటుంటాం కాబట్టి దిగులేమీ లేదు.
  • రోగనిరోధక శక్తి పెంపొందటంలో అత్యంత ముఖ్యమైంది ప్రొటీన్‌. సాధారణంగా శరీర బరువులో ప్రతి కిలోకు ఒక గ్రాము ప్రొటీన్‌ అవసరం. కానీ క్షయ బారినపడ్డవారికిది సరిపోదు. ఒకటిన్నర గ్రాములు కావాలి. అంటే 50 కిలోల బరువున్నవారు రోజుకు 75 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాలి. దీని విషయంలో మాంసాహారులకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. మాంసాహారంలో అన్ని అమైనో ఆమ్లాలతో కూడిన నాణ్యమైన ప్రొటీన్‌ దండిగా ఉంటుంది. అలాగని ఖరీదైన చికెన్‌, చేపలు, మాంసమే తినాలనేమీ లేదు. చవకగా అందుబాటులో ఉండే గుడ్డుతోనూ మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. రోజుకు రెండు గుడ్లు తింటే 16 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. ఉడికించో, అట్టు వేసుకునో ఎలాగైనా తినొచ్చు. శాకాహారులైతే కందులు, శనగలు, పెసర్ల వంటి పప్పులు తీసుకోవచ్చు. అలాగే పాలు, పెరుగు విధిగా తీసుకోవాలి.
  • క్షయ బాధితులకు కొవ్వు కూడా ముఖ్యమే. ఇది వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెలు.. నెయ్యి, వెన్న, ఛీజ్‌, గింజ పప్పుల వంటి వాటితో లభిస్తుంది. అయితే ఎప్పుడూ ఒకే రకం నూనె కాకుండా మార్చి, మార్చి వాడుకోవాలి.
  •  తాజా పండ్లు, కూరగాయలూ తినాలి. ఖరీదైనవేమీ అవసరం లేదు. ఆయా కాలాల్లో, ప్రాంతాల్లో దొరికే కూరగాయలు.. అరటి, జామ వంటి పండ్లు ఏవైనా తినొచ్చు. వీటితో విటమిన్లు, పీచు, పిండి పదార్థంతో పాటు కొంత ప్రొటీన్‌ కూడా లభిస్తుంది.
  •  క్షయలో విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌) తగ్గుతుంది. ఆహారంతో ఇది తగినంత లభించక పోవచ్చు. కాబట్టి రోజూ ఒక విటమిన్‌ బి6 మాత్ర వేసుకోవాలి.
  •  విటమిన్‌ డికి, క్షయకూ సంబంధముంది. విటమిన్‌ డి లోపంతో రోగనిరోధక శక్తి కుంటుపడుతుంది. కాబట్టి రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి.

మన చేతుల్లోనే..

  • వీలైనంత త్వరగా క్షయను గుర్తించి, నిర్ధరించటం.. సరైన మందులను క్రమం తప్పకుండా వాడటం ఒక ఎత్తయితే మంచి పోషకాహారం తినటం మరో ఎత్తు. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. జబ్బు నుంచి త్వరగా కోలుకోవటానికిది తోడ్పడుతుంది.

లోపం రెండు రకాలు

పోషణ లోపం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బక్కచిక్కిన శరీరమే. నిజానికి ఎక్కువగా కనిపించేదీ ఇదే. దీన్నే అండర్‌ న్యూట్రిషన్‌ అంటారు. అంటే ఆహారం ద్వారా తగినన్ని పోషకాలు లభించకపోవటం. దీనికి మరో కోణమూ ఉంది. ఆహారం ద్వారా అవసరమైనన్ని సూక్ష్మ, స్థూల పోషకాలు అందకపోవటమూ పోషణ లోపం కిందికే వస్తుంది. ఎలాంటి పోషకాలూ లేని జంక్‌ఫుడ్‌, కూల్‌డ్రింకుల వంటివి అదేపనిగా తీసుకుంటే మితిమీరి బరువు పెరగటం, ఊబకాయానికి దారితీస్తుంది. ఇవీ రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసేవే. క్షయ ముప్పును పెంచేవే.

మూడుసార్లు భోజనం

రోజుకు మూడు సార్లు భోజనం చేయాలి. కూరల్లో మరీ కారం, మసాలు దట్టించొద్దు. ఉప్పూ మితంగానే ఉండాలి. భోజనమే కాదు.. మూడు సార్లు చిరుతిండీ తినాలి. భోజనానికీ భోజనానికి మధ్యలో ఏదో ఒక పండు తినొచ్చు. లేదూ గుప్పెడు ఉడికించిన వేరుశనగలో.. మొలకెత్తిన పెసర్లు, శనగలో తినొచ్చు. వీలున్నవారైతే బాదం, అక్రోట్లు, పిస్తా వంటి గింజపప్పులు తినొచ్చు. పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. భోజనం చేయటానికి ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.

ప్రొటీన్‌ పొడులేవీ వద్దు

ఖరీదైన ప్రొటీన్‌ పొడుల వంటివేవీ అవసరం లేదు. ఒక డబ్బాలో ఉండే మొత్తం ప్రొటీన్‌ రెండు గుడ్లతోనే లభిస్తుంది. బలానికి ప్రత్యేకించి టానిక్కులు వాడుకోవాల్సిన పనిలేదు. కొందరు బలం వస్తుందని సెలైన్‌ ఎక్కించుకుంటారు. ఇది తప్పు. సెలైన్‌లో నీరు, కాస్త గ్లూకోజు తప్ప పోషకాలేమీ ఉండవని తెలుసుకోవాలి.

మానెయ్యాల్సినవి ఇవీ..

మద్యం తాగొద్దు. ఇది ఆకలిని మరింత తగ్గిస్తుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు అసలే కాల్చొద్దు. గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల జోలికీ వెళ్లొద్దు. ఇవి జబ్బును మరింత ఎక్కువ చేస్తాయి. టీ, కాఫీలు మరీ ఎక్కువగా తాగొద్దు. కూల్‌డ్రింకులు అసలే వద్దు. వీటితో డబ్బు దండగ. ఇవి క్షయ మందులను శరీరం గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి కూడా.

వ్యాయామమూ ముఖ్యమే

క్షయతో బాధపడుతున్నామని రోజంతా ఇంట్లోనే ఉండాల్సిన పనిలేదు. సాధారణంగా మందులేసుకోవటం మొదలెట్టిన 15 రోజుల తర్వాత కాస్త ఓపిక వస్తుంది. అప్పుడు మెల్లిగా వ్యాయామం ఆరంభించాలి. అన్నింటికన్నా తేలికైంది నడవటం. ఆరుబయట రోజుకు 45 నిమిషాల సేపు నడవటం మంచిది. నిజానికి రోగనిరోధకశక్తి ఉన్నట్టుండి పెరిగేది కాదు. మంచి ఆహారం తింటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే క్రమంగా పెంపొందుతూ వస్తుంది.

వికారంగా అనిపిస్తే?

క్షయ మందులను ఆరంభించిన మొదట్లో కొందరికి వాంతి, వికారం, కళ్లు తిరిగినట్టు అనిపించొచ్చు. పరగడుపున మందులు వేసుకొని, అరగంట తర్వాత అల్పాహారం చేస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మరీ ఇబ్బంది పడుతుంటే వికారం కలిగించే ఒకరకం మందును తిన్నాక వేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. వారం, పది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అప్పుడు పరగడుపున వేసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. అప్పటికీ వాంతి, వికారం వస్తుంటే కొన్ని మందులతో ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మందుల విషయంలో కంగారు పడొద్దు. మధ్యలో మానెయ్యొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని