అండగా నిలవాలి

మనం పరిసరాలను గమనిస్తూనే పెరుగుతాం. చుట్టుపక్కల వారిని అనుకరిస్తూనే నేర్చుకుంటాం. ఇవి పుట్టినప్పటి నుంచే అలవడతాయి. తల్లి కళ్లలోకి చూడటం, స్పర్శను గుర్తించటం, నవ్వితే నవ్వటం, మాటలకు స్పందించటం తొలిరోజుల్లోనే అబ్బుతాయి.

Updated : 02 Apr 2024 12:03 IST

నేడు ప్రపంచ ఆటిజమ్‌ అవగాహన దినం

మనం పరిసరాలను గమనిస్తూనే పెరుగుతాం. చుట్టుపక్కల వారిని అనుకరిస్తూనే నేర్చుకుంటాం. ఇవి పుట్టినప్పటి నుంచే అలవడతాయి. తల్లి కళ్లలోకి చూడటం, స్పర్శను గుర్తించటం, నవ్వితే నవ్వటం, మాటలకు స్పందించటం తొలిరోజుల్లోనే అబ్బుతాయి. నెమ్మదిగా తల్లిదండ్రుల మాటలను అనుకరించటం, అత్తాత్తా అనటం, ఇతర పిల్లలను చూసి సంతోషించటం, వారితో కలవటానికి ఆసక్తి చూపటం నేర్చుకుంటాం. ఆ తర్వాత పదాల మధ్య సంబంధాలను గుర్తించటం, అర్థవంతమైన మాటలు మాట్లాడటం, నలుగురితో కలివిడిగా ఉండటం, కలిసి ఆడుకోవటం వంటివీ సరే సరి. అప్రయత్నంగానే నేర్చుకునే ఇలాంటి భాషా, భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు చదువుకోవటానికి, తోటి పిల్లలతో కలవటానికి.. పెద్దయ్యాక సమాజంలో పైకి ఎదగటానికి, ఆటుపోట్లను ఎదుర్కోవటానికి ఎంతో అవసరం. ఆటిజమ్‌ బారినపడ్డ పిల్లల్లో ఇవే కొరవడతాయి. దీని ప్రభావాలు జీవితాంతం కొనసాగుతూ వస్తుంటాయి. అయితే తొలిదశలోనే చికిత్స చేస్తే సమస్య ముదరకుండా చూడొచ్చు. మిగతా పిల్లల మాదిరిగా జీవించేలా చేయొచ్చు. కాకపోతే ముందే గుర్తించటం, వారికి ఓపికగా అండగా నిలవటం ముఖ్యం

ఏంటీ సమస్య?

ఆటిజమ్అనేది మెదడు ఎదుగుదలతో ముడిపడిన సమస్య. వీరి మెదడు ఆకారం బాగానే ఉంటుంది గానీ కొన్ని భాగాల్లో లోపాలు సమస్యకు దారితీస్తాయి. మన మెదడులోని నాడీ కణాలు ఒకదాంతో మరోటి అనుసంధానమై సమాచారాన్ని అంది పుచ్చుకుంటాయి. మాట్లాడటం, నడవటం, సమయానికి అనుగుణంగా స్పందించటం వంటి పనులన్నీ దీని చలవే. ఆటిజమ్‌లో ఇదే లోపిస్తుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడే.. పిండంలో మెదడు ఏర్పడే సమయంలోనే నాడీ కణాల కదలికలు, నాడీ కణాల వృద్ధి, ఇవి అనుసంధానం కావటానికి తోడ్పడే చివర్లు ఏర్పడటంలో లోపాలు తలెత్తటం ఆటిజమ్‌కు దారితీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఎందుకొస్తుంది?

ఆటిజమ్‌ రావటానికి ప్రత్యేకించి ఒక కారణమంటూ లేదు. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. అన్నింటికన్నా ప్రధానమైనవి జన్యు లోపాలు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యు లోపాలతోనే 60-80% వరకూ సమస్య తలెత్తుతుంది. కొన్ని క్రోమోజోముల్లో అసాధారణ మార్పులు ఆటిజమ్‌కు దారితీస్తుంటాయి. కాబట్టి ఒక బిడ్డ ఆటిజమ్‌తో పుట్టినట్టయితే మరోసారి సంతానాన్ని కనాలనుకుంటే జన్యు విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.

  • గర్భం ధరించిన తర్వాత తొలి మూడు నెలల్లో తల్లికి పోషణలేమి, రక్తహీనత, ఇన్‌ఫెక్షన్లు రావటం.. పొగ, మద్యం అలవాట్లు.. కొన్నిరకాల మందులు వేసుకోవటమూ పిల్లల్లో ఆటిజమ్‌ ముప్పును పెంచొచ్చు.
  • కాన్పు సమయంలో బిడ్డ మెదడు దెబ్బతిన్నా ఆటిజమ్‌కు దారితీయొచ్చు. పుట్టిన వెంటనే ఏడ్వకపోవటం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం, తక్కువ బరువుతో పుట్టటం కూడా కారణం కావొచ్చు.
  • ఆలస్యంగా సంతానం కనేవారిలోనూ వీర్యం, అండం నాణ్యత దెబ్బతినటంతోనూ ఆటిజమ్‌ వచ్చే అవకాశముంది.

ప్రధాన లక్షణాలు

ఆటిజమ్‌ పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉండొచ్చు. పైకి ఎలాంటి తేడా కనిపించక పోవచ్చు. అయితే ఎదుగుతున్నకొద్దీ.. ముఖ్యంగా రెండేళ్లు వచ్చేటప్పటికి లక్షణాలు బయటపడుతుంటాయి.

భావ వ్యక్తీరణ లోపం: కొందరు పిల్లల్లో మాటలు ఆలస్యం కావటం, వచ్చినా సరిగా రాకపోవటం, పూర్తి వాక్యాలను పలక లేకపోవటం కనిపిస్తుంటాయి. వీరికి జవాబు చెప్పటం తెలియదు. ఏదైనా అడిగితే దాన్నే తిరిగి వల్లె వేస్తుంటారు. ఉదాహరణకు- నీ పేరేంటని అడిగితే.. తమ పేరు చెప్పకుండా తిరిగి నీ పేరేంటి? అని అడుగుతారు. సమయం, సందర్భం లేకుండా తమకు తెలిసిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతుంటారు. కొందరు తమకు అవసరమైన వాటిని నోటితో చెప్పలేరు కూడా. ఆయా వస్తువులను వేలితో చూపిస్తుంటారు. కొందరు సైగలతోనూ భావాలను వ్యక్తం చేయలేకపోవచ్చు. వీరి ముఖంలో భావాలూ పలకవు.

ఇతరులతో కలవలేకపోవటం: మామూలుగా పిల్లలు తోటివారితో కలివిడిగా ఉంటారు. చక్కగా కలిసి ఆడుకుంటారు. పిల్లల మానసిక ఎదుగుదలలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఆటిజం పిల్లలు ఇతరులతో కలవటానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఒక్కరే ఆడుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిచినా స్పందించరు. కళ్లలోకి నేరుగా చూడరు. శరీర హావభావాలను, ముఖంలో భావాలను, గొంతు హెచ్చుతగ్గుల వంటివాటినీ పోల్చుకోలేరు. నువ్వు నేను అనే తేడా తెలియకపోవటం, తల్లిదండ్రులను సొంతవారిగా భావించకపోవటమూ చూస్తుంటాం.

విచిత్ర ప్రవర్తన: కొందరిలో కొన్ని ప్రత్యేక ప్రవర్తనలూ కనిపిస్తుంటాయి. చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయటం.. చేతులు, కాళ్లు అదేపనిగా ఊపటం, చప్పట్లు కొట్టటం, తమ చుట్టూ తాము తిరగటం, నోటితో రకరకాల చప్పుళ్లు వంటివి చేస్తుండొచ్చు. తిరుగుతున్న ఫ్యాన్ల వంటి వాటిని తదేకంగా చూస్తుండొచ్చు. కారు, బస్సు బొమ్మలతో కాకుండా వాటి చక్రాలతో ఆడుకుంటుండొచ్చు. ఒకే రకం వస్తువులను సేకరించటం.. వస్తువులను ఒకదాని వెనకాల మరోటి వరుసగా పేర్చటం చేస్తుంటారు. పనులను ఒకేలా, రోజూ అలాగే చేయటానికి ప్రయత్నిస్తుంటారు. ఏమాత్రం అటూఇటైనా చిరాకు పడతారు. ఇలా తమకు తాము స్థిమిత పడాలని చూస్తుంటారు.

జ్ఞానేంద్రియ లక్షణాలు: ఆటిజమ్‌లో జ్ఞానేంద్రియాలతో ముడిపడిన లక్షణాలూ ప్రధానమే. కొందరు చిన్న శబ్దాలనైనా తట్టుకోలేరు. కుక్క అరుపు, మిక్సీ చప్పుళ్ల వంటివి వినగానే భయపడి చెవులు మూసుకొని, పరుగెడుతుంటారు. మరికొందరు చేతులతో దబాదబా బాదుతూ పెద్ద శబ్దాలు చేస్తూ సంతోషిస్తుండొచ్చు కూడా. ఎదుటి వారిని చూసేటప్పుడు వంకరగా చూడొచ్చు. లేదూ కళ్లు మూసుకోవచ్చు. స్పర్శ విషయానికి వస్తే- కొందరు మెత్తటి దుస్తులు బాగా ఇష్టపడొచ్చు. కొందరికి గరుకు దుస్తులు నచ్చొచ్చు. అన్నం నమిలి మింగకపోవచ్చు. కొన్ని పదార్థాలు నచ్చకపోవచ్చు. ఉదాహరణకు- కొందరు పాలు నచ్చక కక్కేస్తుంటారు. వస్తువులను పదే పదే వాసన చూస్తుంటారు కూడా.

ఐదు రకాలు

ఆటిజమ్‌ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరిలో ఒకట్రెండే కనిపించొచ్చు. కొందరిలో ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రంగా లేదా స్వల్పంగానూ ఉండొచ్చు. ఇవి మొదలైన వయసు, తీవ్రత, ముదురుతున్న తీరును బట్టి ఆటిజమ్‌ను ఐదు రకాలుగా విభజించొచ్చు.

1 ఆటిస్టిక్‌ డిజార్డర్‌: దీన్నే చైల్డ్‌హుడ్‌ ఆటిజమ్‌ అంటారు. ఎక్కువగా కనిపించే సమస్య ఇదే. ఇది ఆడపిల్లల్లో కన్నా మగవారిలో ఎక్కువ.

2 రట్స్‌ డిజార్డర్‌: ఏడాది తర్వాత లక్షణాలు కనిపించటం, రెండు మూడేళ్లలోనే తీవ్రం కావటం దీని ప్రత్యేకత. కొందరిలో వచ్చిన మాటలు వెనక్కీ పోతుంటాయి. ఇది క్రమంగా ముదురుతూ వచ్చే సమస్య. కొంత కాలం తర్వాత నాడీ సమస్యలూ మొదలు అవుతాయి. కొందరికి ఫిట్స్‌ రావొచ్చు.

3 ఆస్పర్జెర్స్‌ డిజార్డర్‌: ఇందులో తెలివితేటలు బాగానే ఉంటాయి గానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి జవాబు చెప్పి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పనుల్లో బాగా శ్రద్ధ, ఆసక్తి చూపిస్తారు. అందువల్ల వాటిల్లో మంచి నైపుణ్యం సాధిస్తారు. అయితే కోపం, ఉద్రేకం ఎక్కువగా ఉంటాయి.

4 చైల్డ్‌హుడ్‌ డిస్‌ఇంటిగ్రేటివ్‌ డిజార్డర్‌: అబ్బిన నైపుణ్యాలు తిరిగి వెనక్కి పోవటం దీని ప్రత్యేకత. వీరిలో ముఖం రఫ్‌గా, ముదిరినట్టుగా కనిపిస్తుంది. నాడీ సమస్యలూ మొదలవుతాయి. ఫిట్స్‌ తీవ్రంగా రావొచ్చు.

5 పర్వేసివ్‌ డెవలప్‌మెంట్‌ డిజార్డర్‌ నాట్‌ అదర్‌వైజ్‌ స్పెసిఫైడ్‌: ఇది గలవారు నలుగురితో కలవకపోవటం, మాటలు, సైగలతో భావాలను చెప్పలేకపోవటం, ఊహాశక్తి లోపించటం, కొన్ని విషయాల మీదే ఆసక్తి చూపటం, చేసిన పనులే తిరిగి చేయటం వంటివి చేస్తుంటారు.

నిర్ధరణ ఎలా?

లక్షణాల ఆధారంగానే ఆటిజమ్‌ను అంచనా వేస్తారు. అలాగే ఫిట్స్‌, స్వల్పంగా బుద్ధిమాంద్యం వంటి నాడీ సమస్యలు.. ఏడీహెచ్‌డీ (కుదురుగా ఉండకపోవటం, అటూఇటూ తిరగటం, చేసిందే చేయటం), భయాల వంటి మానసిక సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూస్తారు. వయసు తగినట్టుగా మెదడు ఎదిగిందో లేదో తెలుసుకోవటానికి ‘డెవలప్‌మెంట్‌ కోషెంట్‌ అసెస్‌మెంట్‌’ పరీక్ష కూడా ముఖ్యమే. ఇందులో మాట్లాడటం, కదలికలు, ఇతరులతో కలివిడితనం తీరును అంచనా వేస్తారు. ఆటిజమ్‌ డిజార్డర్‌ అబ్జర్వేషన్‌ స్కేల్‌, చైల్డ్‌ ఆటిజమ్‌ రేటింగ్‌ స్కేల్‌ ద్వారా సమస్య తీవ్రతను గుర్తిస్తారు. మరీ చిన్నపిల్లలకైతే మాడిఫై చెక్‌లిస్ట్‌ ఫర్‌ ఆటిజమ్‌ టాడ్లర్స్‌ విధానం ఉపయోగపడుతుంది. ఫిట్స్‌ వస్తున్నవారికి ఈఈజీ పరీక్ష అవసరమవుతుంది.

చికిత్సలు రకరకాలు

ఆటిజమ్‌లో నాడుల పనితీరు కుంటుపడుతుంది. వీలైనంత త్వరగా వాటిని ఉత్తేజితం చేస్తే కుదురుకునే అవకాశముంది. నాడీ అనుసంధానాలు చాలావరకూ ఐదేళ్లలోపే ఏర్పడతాయి. కాబట్టి ఆలోపే చికిత్స ఆరంభించాలి. ఆలస్యమైతే నాడీ అనుసంధానాలు అక్కడికే పరిమితమవుతాయి. దీంతో ఆయా పనులు కుంటుపడతాయి. ఇవి జీవితాంతం కొనసాగుతూ వస్తాయి. జ్ఞానేంద్రియాల సాయంతో నాడులను ఉత్తేజితం చేయొచ్చు. ఇందుకు కొన్ని చికిత్సలు ఉపయోగపడతాయి. పేరుకు చికిత్సలే అయినా ఇవన్నీ శిక్షణలే. ఉదాహరణకు- మాటలు ఆలస్యమైనవారికి, సరిగా రానివారికి మాటలు నేర్పించటం (స్పీచ్‌ థెరపీ) ఉపయోగపడుతుంది. రోజూ చేసే పనులను నెమ్మదిగా చేయించటం, కుదురుగా కూర్చునేలా చేయటం, కళ్లలోకి చూడటాన్ని మెరుగు పరచటం, ఇతర పిల్లలతో కూర్చోబెట్టి కలివిడి తనాన్ని పెంచటం వంటివన్నీ ఉపయోగపడతాయి. వీటిని నిపుణుల సమక్షంలో చేయించొచ్చు. లేదూ తల్లిదండ్రులకు అలవడిన తర్వాత ఇంట్లోనైనా చేయించొచ్చు. ఆటిజమ్‌ పిల్లలను మామూలు పిల్లల కన్నా మరింత ఎక్కువ శ్రద్దతో పెంచాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లోనూ తోడుగా ఉండటం అవసరం. ఉదాహరణకు- లేచి, నడవమని చెప్పటం కన్నా ముందు నిల్చొబెట్టి ‘నువ్వు నిలబడ్డావు’ అని చెప్పాలి. తర్వాత నడువు అని చెప్పి మెల్లిగా ఒక్కో అడుగు దగ్గరుండి వేయించాలి. ఇలా ఆయా పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని, నెమ్మదిగా నేర్పించాల్సి ఉంటుంది.

ప్రవర్తన మార్పు: ఆటిజమ్‌ పిల్లలు చేతులు ఊపటం వంటివి అదే పనిగా చేస్తుంటారు. మొండితనం ప్రదర్శిస్తుంటారు. వీటిని మాన్పించటానికి బిహేవియర్‌ మోడిఫికేషన్‌ చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో ఆయా అలవాట్లను బట్టి సరి చేయటానికి ప్రయత్నిస్తారు. ప్రత్యక్షంగా చూపిస్తూ సరిగా ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తారు, ప్రోత్సహిస్తారు.

ఆక్యుపేషన్‌ థెరపీ: జ్ఞానేంద్రియ సమస్యలు ఉన్నట్టయితే ఒత్తిడి, స్పర్శ వంటి పద్ధతులతో చికిత్స చేస్తారు. శరీరానికి రకరకాల ఆకారాలు తాకించటం, వాటిని ముట్టుకునేలా చేయటం వంటి వాటితో భయాలు పోగొడతారు. ఎలా తినాలో నేర్పిస్తారు.
ఇలాంటి చికిత్సలన్నింటినీ కలిపి చేయాల్సి ఉంటుంది. వీటికి ఓర్పు అవసరం. ఫలితాలు కనిపించటానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుసుకోవాలి. కొందరికి ఏడాది కూడా పట్టొచ్చు. తొలిదశలోనే చికిత్సలు మొదలెడితే మంచి ఫలితం చూపిస్తున్నట్టు అధ్యయనాలు, అనుభవాలు చెబుతున్నాయి. మొదట్లోనే ఫలితం కనిపించటం లేదని నిరాశ చెంది, మానేస్తే మొదటికే మోసం వస్తుంది. తెలివితేటలు కాస్త మెరుగై, ఆటిజమ్‌ స్వల్పంగా ఉంటే మామూలు బడుల్లో చేర్పించటానికి వీలవుతుంది. బుద్ధిమాంద్యం వంటివి గలవారినైతే ప్రత్యేక స్కూళ్లలో చేర్పించొచ్చు. ఆటిజమ్‌ పిల్లలకు విడిగా ప్రత్యేక తరగతులు నిర్వహించే మామూలు బడుల్లోనైనా చేర్పించొచ్చు.

అవసరమైతే మందులు

కోపం, మొండితనం, చెప్పిందే చెప్పటం, ఉద్రిక్తత వంటివి గలవారికి మందులూ అవసరమవుతాయి. ఆటిజమ్‌ పూర్తిగా నయం కాకపోయినా మందులతో ఇలాంటి లక్షణాలు అదుపులో ఉండేలా చేయొచ్చు. కుదురుగా కూర్చొని నేర్చుకోవటానికి, చదువుకోవటానికివి దోహదం చేస్తాయి.

ముందే పసిగట్టటం ముఖ్యం

ఆటిజమ్‌ లక్షణాలు చాలావరకూ రెండు, రెండున్నర ఏళ్లలోనే బయటపడుతుంటాయి. కూర్చోవటం, నిల్చోవటం వంటివన్నీ బాగానే అబ్బుతాయి గానీ తల్లిదండ్రుల కళ్లలోకి నేరుగా చూడరు, నవ్వరు. బయటకు వెళ్తున్నప్పుడు టాటా చెప్పటం వంటి స్పందనలు కనిపించవు. మాటలు రావటం ఆలస్యం కావటం, పేరు పెట్టి పిలిస్తే పలక్కపోవటం, ఒంటరిగా ఉండటం, ఇతర పిల్లలతో కలిసి ఆడకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయరాదు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పిల్లల సైకియాట్రిస్టుకు చూపించాలి. పిల్లల్లో ఎదుగుదల సమస్యలకు చికిత్స చేసే నిపుణులనైనా సంప్రదించొచ్చు. త్వరగా చికిత్సలు చేయిస్తే అన్నింటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తీర్చిదిద్దొచ్చు. నూటికి నూరు శాతం బాగు పడకపోయినా రోజువారీ పనులు సొంతంగా చేసుకోవటం సాధ్యమవుతుంది. చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం ద్వారా సమాజంలో గుర్తింపూ పొందుతారు. అదే చికిత్సలు ఆలస్యమైతే మామూలు స్కూళ్లకు పంపించటం కష్టమవుతుంది. బడికి పంపించినా చదువుల మీద శ్రద్ధ పెట్టరు. పెద్దగా అయ్యేకొద్దీ వృత్తి పనులు చేసుకోవటమూ ఇబ్బందిగా పరిణమిస్తుంది.

అసాధారణ నైపుణ్యాలూ..

ఆటిజమ్‌ ఉన్నా కూడా కొందరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని విషయాల్లో మంచి నైపుణ్యమూ ఉండొచ్చు. కొందరు రాగయుక్తంగా పాటలు పాడొచ్చు. బొమ్మలు వేయటం వంటి కళల్లో ప్రావీణ్యం కనబరచొచ్చు. కొందరికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగానూ ఉండొచ్చు. అందువల్ల వారి ఇష్టాలను బట్టి ప్రోత్సహించాలి. ఇష్టంలేని సబ్జెక్టులను పక్కన పెట్టి ఆసక్తి చూపే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు