నాడీ కణాలు దెబ్బతింటే దీర్ఘకాల జ్ఞాపకాలు!

మెదడులోని నాడీ కణాల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తటాన్ని హాని కరమైందనే భావిస్తాం.

Published : 02 Apr 2024 00:05 IST

మెదడులోని నాడీ కణాల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తటాన్ని హాని కరమైందనే భావిస్తాం. ఇది అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి జబ్బులకు దారి తీస్తుంది మరి. కానీ మెదడు భాగమైన హిప్పో క్యాంపస్‌లోని కొన్ని నాడీకణాల్లో పుట్టుకొచ్చే వాపు ప్రక్రియ దీర్ఘకాల జ్ఞాపకాలు ఏర్పడటానికి కీలకమంటే నమ్ముతారా? ఆశ్యర్యంగా అనిపించినా ఇది నిజమేనని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది. మన మెదడులో హిప్పోక్యాంపస్‌ను జ్ఞాపక కేంద్రం అనుకోవచ్చు. దీనిలోని కొన్ని నాడీ కణాల డీఎన్‌ఏ దెబ్బనటం, మరమ్మతు కావటం.. ఒక చట్రంలా కొనసాగుతూ రావటం వల్ల స్థిరమైన జ్ఞాపకాల సముచ్ఛయాలు ఏర్పడుతున్నట్టు తేలింది. మనకు చిన్నప్పటి సంఘటనల వంటి పాత విషయాలు గుర్తుండటానికి తోడ్పడేవి ఈ సముచ్ఛయాలే కావటం విశేషం. ఎలుకలకు స్వల్పంగా, ఒక మాదిరిగా షాక్‌ ఇవ్వటం ద్వారా ఈ జ్ఞాపకాలు ఏర్పడే ప్రక్రియను శాస్త్రవేత్తలు గుర్తించారు. షాక్‌ ఇచ్చిన తర్వాత ఎలుకల మెదడులో హిప్పోక్యాంపస్‌లోని నాడీ కణాలను పరిశీలించగా.. వాపు ప్రక్రియ సమాచార మార్గంలో పాలు పంచుకునే జన్యువులు ఉత్తేజితమైనట్టు బయటపడింది. మొదట్లో ఇన్‌ఫెక్షన్‌ మూలంగా వాపు ప్రక్రియ ఉత్తేజితమైందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ మరింత నిశితంగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. హిప్పోక్యాంపస్‌ కణాల సముచ్ఛయాల్లోనే వాపు ప్రక్రియ ప్రేరేపితమైందని, ఇది డీఎన్‌ఏ దెబ్బతినటానికి నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడు చర్యల్లో భాగంగా డీఎన్‌ఏ తరచూ అక్కడక్కడా స్వల్పంగా విచ్ఛిన్నమవుతుంటుంది. ఇవి నిమిషాల్లోనే మరమ్మతు అవుతాయి కూడా. కానీ హిప్పోక్యాంపస్‌లోని నాడీ కణాల్లో డీఎన్‌ఏ దెబ్బతినటం గణనీయంగా, ఎక్కువకాలం కొనసాగుతుండటం విచిత్రం. ఇది మరమ్మతయ్యే క్రమంలో వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటం.. ఇది జ్ఞాపకాలు ఏర్పడేలా చేస్తుండటం మరింత విచిత్రం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని