రొమ్ముక్యాన్సర్‌కు శీతల చికిత్స

చిన్న చిన్న రొమ్ముక్యాన్సర్‌ కణితులకు ఇకపై సర్జరీ అవసరముండదా? వినూత్న క్రయోబ్లేషన్‌ ప్రక్రియ అలాంటి ఆశే కల్పిస్తోంది. నిజానికి రొమ్ముక్యాన్సర్‌ కణితులను తొలగించటానికి సర్జరీ చేయటమే ఉత్తమం

Published : 09 Apr 2024 00:26 IST

చిన్న చిన్న రొమ్ముక్యాన్సర్‌ కణితులకు ఇకపై సర్జరీ అవసరముండదా? వినూత్న క్రయోబ్లేషన్‌ ప్రక్రియ అలాంటి ఆశే కల్పిస్తోంది. నిజానికి రొమ్ముక్యాన్సర్‌ కణితులను తొలగించటానికి సర్జరీ చేయటమే ఉత్తమం. కానీ రకరకాల కారణాలతో కొందరికి సర్జరీ చేయటం కుదరదు. ఇలాంటి వారికి క్రయోబ్లేషన్‌ చికిత్స మేలు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. కణితులను గడ్డ కట్టించి, నిర్మూ లించటం దీని ప్రత్యేకత. ఇందులో ముందుగా అల్ట్రా సౌండ్‌ లేదా సీటీ స్కాన్‌తో కణితి ఉన్న చోటును గుర్తిస్తారు. అక్క డికి చిన్న, సూది వంటి గొట్టాన్ని జొప్పిస్తారు. దీని ద్వారా అతి శీతల ద్రవాన్ని పంపించి, కణితి చుట్టూ మంచు బంతిని సృష్టిస్తారు. అప్పుడది క్యాన్సర్‌ కణాలను గడ్డ కట్టించి, చంపుతుంది. వయసు, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో సర్జరీ చేయటం కుదరని, సర్జరీ చేయించుకోవటం ఇష్టపడని 60 మంది రొమ్ముక్యాన్సర్‌ బాధితులను ఎంచుకొని ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 0.3 నుంచి 9 సెంటీమీటర్ల కణితులున్నట్టు గుర్తించారు. సగటున 2.5 సెంటీమీటsర్ల సైజు కణితులున్నాయి. 1.4 సెంటీమీటర్ల కన్నా పెద్ద సైజు కణితులకు ఒకటి కన్నా ఎక్కువ గొట్టాలను ఉపయోగించారు. రొమ్ము కణితులుండి, సర్జరీ చేయటం కుదరనివారికిది బాగా ఉపయోగ పడుతుందని, ప్రామాణిక సంరక్షణ పద్ధతుల కన్నా మెరుగైన ఫలితం కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. వీరిలో చికిత్స చేసిన 16 నెలల తర్వాత 10% మందికి సమస్య తిరగబెట్టినట్టు తేలింది. సాధారణంగా సర్జరీ చేయటం కుదరనివారికి రేడియేషన్‌, హార్మోన్‌ చికిత్సలు చేస్తుంటారు. అయినా కణితులు తిరిగి ఏర్పడుతుంటాయి. క్రయోబ్లేషన్‌ చికిత్సతో సమస్య తిరగబెట్టటం కేవలం 10 శాతంగానే ఉండటం గొప్ప విషయమని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని