చర్మంలో పార్కిన్సన్స్‌ గుట్టు

తల, చేతుల వంటి భాగాలను వణికించే.. నడక, చురుకుదనాన్ని తగ్గించే పార్కిన్సన్స్‌ జబ్బును, దీంతో ముడిపడిన సమస్యలను చిన్న చర్మం ముక్క పరీక్షతో గుర్తించొచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు కనుగొన్నారు.

Published : 09 Apr 2024 00:30 IST

తల, చేతుల వంటి భాగాలను వణికించే.. నడక, చురుకుదనాన్ని తగ్గించే పార్కిన్సన్స్‌ జబ్బును, దీంతో ముడిపడిన సమస్యలను చిన్న చర్మం ముక్క పరీక్షతో గుర్తించొచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు కనుగొన్నారు. త్వరగా చికిత్స చేయటానికి, సమస్య రకాల మధ్య తేడాలను కచ్చితంగా గుర్తించటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు. పార్కిన్సన్స్‌ను, దీంతో ముడిపడిన సమస్యలను నయం చేసే చికిత్సలేవీ లేవు. ఇవి సంక్లిష్టమైనవి కావటం.. వీటి లక్షణాలు ఇతర జబ్బులను పోలి ఉండటం వల్ల తరచూ పొరపడుతుంటారు. గుర్తించటమూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఆశలు రేకెత్తిస్తోంది. నిజంగా జబ్బుతో బాధపడేవారిని గుర్తించి, ప్రయోగ పరీక్షలు నిర్వహించటానికి.. త్వరగా కొత్త చికిత్సలను ఆవిష్కరించటానికి వీలుంటుందని ఆశిస్తున్నారు. చికిత్స తీసుకునేవారికీ సరైన మందులను సూచించటానికి తోడ్పడగలదు. పార్కిన్సన్స్‌, దీంతో ముడిపడిన సమస్యలను సైనుక్లీనోపతీస్‌గా పిలుచుకుంటారు. వీటిల్లో అల్ఫా-సైనుక్లీన్‌ అనే ప్రొటీన్‌ అస్తవ్యస్తమవుతుంది మరి. ఈ జబ్బులన్నీ భిన్నంగా ఉంటాయి. చికిత్సలూ వేరే. అయితే ఒకదాని లక్షణాలు మరోదానిలా కనిపించటం, వీటిని కచ్చితంగా గుర్తించే జీవ సూచికలు లేకపోవటం పెద్ద సవాలుగా నిలుస్తోంది. ఇక్కడే కొత్త అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ జబ్బులు గలవారి చర్మంలోని నాడీకణాల పోచల్లో ఫాస్ఫోరీలేటెడ్‌ అల్ఫా-సైనుక్లీన్‌ (పీ-ఎస్‌వైఎన్‌) ప్రొటీన్‌ పోగుపడుతుంది. అదీ జబ్బు తొలిదశలో, లక్షణాలు పైకి కనిపించటానికి చాలా ఏళ్ల ముందుగానే. శరీరంలోని వివిధ భాగాల నుంచి చర్మం ముక్కలను తీసి పరీక్షిస్తే ఇది బయటపడుతుంది. దీని ద్వారా 90% కచ్చితత్వంతో పార్కిన్సన్స్‌, దీంతో ముడిపడిన సమస్యలను గుర్తించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని