నెలసరి నిలిచిందా?గుండె మరింత జాగ్రత్త!

నెలసరి నిలిచిన (మెనోపాజ్‌) తర్వాత ఆడవారిలో గుండె ఆరోగ్యం ఊహించిన దాని కన్నా వేగంగా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్నవయసులో గుండెపోటు ముప్పు తక్కువ.

Published : 09 Apr 2024 00:41 IST

నెలసరి నిలిచిన (మెనోపాజ్‌) తర్వాత ఆడవారిలో గుండె ఆరోగ్యం ఊహించిన దాని కన్నా వేగంగా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్నవయసులో గుండెపోటు ముప్పు తక్కువ. కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే దీని కన్నా చాలా ఎక్కువగా ముప్పు పెరుగుతున్నట్టు ఇప్పుడు బయటపడింది. గుండెజబ్బు ముప్పు కారకాలు గల మగవారిని, నెలసరి నిలిచిన మహిళలను ఎంచుకొని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరంతా కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ వాడుతున్నవారే. గుండె రక్తనాళాల్లో ఎంత క్యాల్షియం పోగుపడిందో తెలిపే స్కోరును పరిశీలించగా.. మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. నెలసరి నిలిచిన తర్వాత వీరిలో గుండె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నట్టు ఇది తెలియజేస్తోంది. తీవ్ర గుండె సమస్యల విషయంలో వీరికి స్టాటిన్స్‌ తగినంత రక్షణం కల్పించటం లేదని ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంతకీ నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో పూడికలు ఏర్పడే వేగం ఎందుకు పెరుగుతోంది? చాలావరకూ ఈస్ట్రోజెన్‌ మోతాదులు వేగంగా తగ్గటమే. స్త్రీ హార్మోన్‌గా భావించే ఈస్ట్రోజెన్‌ లైంగిక పరమైన అంశాల్లోనే కాకుండా ఇతరత్రా పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. రక్తనాళాలు విప్పారేలా చూడటం వీటిల్లో ఒకటి. ఇలా అధిక రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది. అంతేకాదు.. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పోగు పడకుండా, గట్టిపడకుండా కాపాడుతుంది. విశృంఖల కణాలనూ నిర్వీర్యం చేసి వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తకుండా చూస్తుంది. నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్‌ మోతాదులు తగ్గటం వల్ల ఇలాంటి రక్షణలన్నీ కొరవడతాయి. కొవ్వు కణజాలం, బరువు పెరగటం.. జీవక్రియల వేగం తగ్గటం, నిద్ర అస్తవ్యస్తం కావటం వంటివీ పొడసూపుతాయి. నిజానికి ఈ విషయం చాలాక్రితమే తెలిసినా ఎంతోమంది మహిళలకు దీని గురించి తెలియదనే చెప్పుకోవాలి. పూడికలు ఏర్పడే వేగం రెట్టింపు అవుతుందనే సంగతి ఇప్పుడు తేలటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల గుండెజబ్బు ముప్పు కారకాలు గల పెద్దవయసు మహిళలు ఒక్క స్టాటిన్స్‌ మీదే ఆధారపడకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఒత్తిడి తగ్గించుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు