ఎండ వేడి చల్లగా!

వేసవి అనగానే సెలవుల కాలమే గుర్తుకొస్తుంది. సరదాగా బయటకు వెళ్లటం, షికార్లు చేయటం బాగానే ఉంటుంది గానీ వేడిని తట్టుకోవటమే కష్టం. అప్పుడే ఎండలు ఎలా భగ్గుమంటున్నాయో చూస్తూనే ఉన్నాం.

Updated : 09 Apr 2024 11:58 IST

వేసవి అనగానే సెలవుల కాలమే గుర్తుకొస్తుంది. సరదాగా బయటకు వెళ్లటం, షికార్లు చేయటం బాగానే ఉంటుంది గానీ వేడిని తట్టుకోవటమే కష్టం. అప్పుడే ఎండలు ఎలా భగ్గుమంటున్నాయో చూస్తూనే ఉన్నాం. రోజురోజుకీ పెరిగిపోతున్న వేడి కలవర పెడుతోంది. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవి వెంట బెట్టుకొచ్చే సమస్యలూ సరేసరి. చెమట ఎక్కువగా పోయటం వల్ల ఒంట్లో నీరు, లవణాలు తగ్గిపోతాయి. బలహీనత, నీరసం కమ్ముకొస్తాయి. దాహం తీర్చుకోవటానికి ఎక్కడపడితే అక్కడ తాగే నీటితో.. వేడి మూలంగా త్వరగా చెడిపోయే ఆహారంతో విరేచనాలు, కామెర్ల వంటి జబ్బులూ దాడిచేస్తాయి. విష జ్వరాల బెడదా తక్కువేమీ కాదు. కానీ ఆహార, విహారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవి బాధలను నివారించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. సమస్యలు ఎదురైనా ఔషధాలు, చిట్కాలతో ఉపశమనం పొందొచ్చని భరోసా ఇస్తోంది.

‘ఖాదీని యాత్మ మనః కాలో దిశస్య ద్రవ్య సంగ్రహః’ అని శాస్త్రం చెబుతుంది. అంటే పంచ మహాభూతాలు (భూమి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం), ఆత్మ, మనసు, దిక్కులు, కాలం.. ఇవన్నీ కలిసి మనకు కనిపించే అన్నింటినీ తయారుచేస్తాయని అర్థం. వీటిని కార్య కారణ ద్రవ్యాలనీ అంటారు. సృష్టిలోని ప్రతీదీ వీటితోనే ఏర్పడుతుంది. వీటిల్లో కాలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయా కాలాలు మన శరీరం మీద, ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపి స్తాయి. అందుకే ఆయా కాలాలకు అనుగుణంగా వ్యహరించాలని ఆయుర్వేదం నిర్దిష్టంగా చెబుతుంది. మనకు సంవత్సరంలో పన్నెండు మాసాలు, రెండు ఆయనాలు, ఆరు రుతువులు. ఉత్తరాయణంలో శిశిర, వసంత, గ్రీష్మ రుతువులు.. దక్షిణాయనంలో వర్ష, శరద్‌, హేమంత రుతువులు వస్తాయి. మనిషి శరీర బలాన్ని బట్టి ఆయుర్వేదం వీటిని ఆదాన, విసర్గ కాలాలుగానూ విభజిస్తుంది. ఉత్తరాయణాన్ని ఆదాన కాలంగా, దక్షిణా యనాన్ని విసర్గ కాలంగా పేర్కొంటుంది. విసర్గ కాలంలో సూర్యుడు తన శక్తిని భూమ్మీది సమస్త ప్రాణికోటికి అందిస్తాడు. అదే ఆదాన కాలంలో బలాన్ని వెనక్కి గ్రహిస్తుంటాడు. ఆదాన కాలంలో వచ్చే గ్రీష్మ రుతువులో వేడి పెరగటం వల్ల ఒంట్లో జల భూతం తగ్గుతుంది. ఫలితంగా నీరసం, దాహం పెరుగుతాయి. ఎండా కాలంలో ఒంట్లో శ్లేష్మం (కఫం) కరిగిపోయి జఠరాగ్నిని చల్లారుస్తుంది. దీంతో అగ్నిమాంద్యం తలెత్తి ఆకలి తగ్గటం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవటం వంటివి మొదలవుతాయి. అన్ని వ్యాధులకూ మూలం అగ్నిమాంద్యమేనని ఆయుర్వేదం చెబుతుండటం గమనార్హం.

తిండి సరిగా..

ఆహారం రుచిగా, శుచిగా ఉంటేనే ధాతువులకు బలం చేకూరుతుంది. కాబట్టి ఆహారం మీద శ్రద్ధ అవసరం. ఎండా కాలంలో పదార్థాలు త్వరగా చెడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు బయట నిల్వ ఉంచివని తినొద్దు. అప్పుడే వండిన ఆహారం తినాలి. ఈ కాలంలో అగ్నిమాంద్యం వచ్చే అవకాశముంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, నోటికి హితవుగా ఉండే ఆహారం తీసుకోవాలి. మితంగా నెయ్యి, నూనె వంటి స్నిగ్ధ పదార్థాలూ అవసరమే. వేసవిలో మధుర (తీపి) రసం మేలు చేస్తుంది. ఇది ఒంటికి బలాన్ని చేకూరుస్తుంది. కూరల విషయంలో దోసకాయ, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటి నీటితో కూడిన కూరగాయలు మేలు. బచ్చలి, పొన్నగంటి వంటి ఆకుకూరలూ శ్రేష్ఠమే. ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, నారింజ పండ్లు నీటితో పాటు పోషకాలనూ అందిస్తాయి. మితంగా మామిడి పండ్లు, పుచ్చకాయ కూడా తినొచ్చు. పెరుగుతో భోజనం చేయకపోతే అసలు తిన్నట్టే అనిపించదు. అయితే వేసవిలో పుల్లటి పెరుగు తినొద్దు. ఇది పిత్తం ప్రకోపించేలా చేస్తుంది. తీయటి పెరుగు తినాలి. వేసవిలో చాలామంది ఐస్‌క్రీములు తింటుంటారు. ఇలాంటి చల్లటి పదార్థాలు హాయిని కలిగిస్తుండొచ్చు గానీ మరీ చల్లటివి తినొద్దు. అతి శీతల పదార్థాలు జీర్ణశక్తిని తగ్గిస్తాయి.

 పానీయ శక్తి

వేసవిలో చెమట రూపంలో ఒంట్లోంచి నీరు, లవణాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు నీటిని భర్తీ చేసుకోవాలి. అయితే మరీ చల్లగా ఉండే నీటి కన్నా గది ఉష్ణోగ్రతలో లేదా కాస్త చల్లగా ఉండే కుండలో నీరు తాగటం మంచిది. కొన్నిరకాల పానీయాలూ ఉపయోగపడతాయి.
షడంగ పానీయం: ఇది ఔషధ పానీయం. సాధారణంగా దీన్ని జ్వరం వచ్చినవారికి సూచిస్తారు గానీ ఎండాకాలంలోనూ మేలు చేస్తుంది. తుంగ ముస్తెలు, పర్పాటకం, వట్టివేళ్లు, చందనం, సుగంధిపాల, శొంఠిని రాత్రిపూట నీటిలో నానబెట్టి.. మర్నాడు ఉదయం వేడి చేసి వడగట్టుకోవాలి. దీన్ని అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా తాగాలి. ఇప్పుడు షడంగ పానీయం చూర్ణాన్ని కూడా అమ్ముతున్నారు. తీసుకున్న చూర్ణానికి 14 రెట్లు నీళ్లు కలిపి.. సగం మిగిలే వరకు కాచుకోవాలి. చల్లబడిన తర్వాత కొద్దికొద్దిగా తాగాలి.
రసాలా: పెరుగులో చక్కెర, కాస్త యాలకుల పొడి కలిపి తీసుకోవటం మంచిది. ఇది ఒంటికి చలువనిస్తుంది.  
రాగ: దానిమ్మ పండ్ల రసంలో పెరుగు మీదుండే తేట లేదా చిక్కటి పాలు, చక్కెర కలిపి కొద్దికొద్దిగా తాగుతుంటే శరీర తాపం తగ్గుతుంది.
ఖాండవ: దానిమ్మరసంలో బాగా వండిన మాంసరసాన్ని (సూప్‌) కూడా కలిపి చేస్తే ఖాండవ పానీయం తయార వుతుంది. ఇందులో బెల్లం, కొద్దిగా మిరియాలు, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క పొడులు కూడా వేసి.. చల్లగా చేసుకొని సాయంత్రం వేళల్లో తాగొచ్చు. మాంసరసం ఉండటం వల్ల శరీరానికి తగినంత పోషణ కూడా లభిస్తుంది. పుల్లటి దానిమ్మ మూలంగా నోటి హితవు కలుగుతుంది, జీర్ణక్రియ పెరుగుతుంది.
మజ్జిగ: పల్చటి మజ్జిగలో నిమ్మరసం పిండుకొని.. కొద్దిగా మిరియాల పొడి, సైంధవ లవణం కలిపి ఉదయం, సాయంత్రం ఒకో గ్లాసు తాగితే చెమట ద్వారా పోయిన నీరు, లవణాలు భర్తీ అవుతాయి. వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు.
నిమ్మరసం: నీటిలో నిమ్మరసం కలిపి తాగినా మంచిదే. ఇందులో కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపితే ఇంకా మంచిది. వీలుంటే జిలకర, యాలకుల పొడులూ వేసుకోవచ్చు.
మామిడి పానీయం: మామిడి కాయను ఉడికించి, గుజ్జును తీయాలి. దీనికి తగినంత చక్కెర కలిపి ఉడికించి, పాకం చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సైంధవ లవణం, యాలకుల పొడి కలిపి.. నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకొని, నీటిలో కలిపి పానీయంగా తాగితే మేలు చేస్తుంది.
పానకం: శ్రీరామనవమికి బెల్లంతో చేసే పానకం అందరికీ తెలిసిందే. ఇది దప్పికను బాగా తీరుస్తుంది. చలువ చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.
ధనియాల నీరు: ముందురోజు రాత్రి ధనియాలను నీటిలో నానేసి, మర్నాడు ఉదయం తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది.

విహారంలో జాగ్రత్త

  • ఎండలోకి ఎక్కువగా వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే శరీరానికి ఎండ నేరుగా తగలకుండా చూసుకోవాలి. గొడుగు తీసుకెళ్లాలి. తలకు రుమాలు చుట్టుకోవాలి. అలాగే లేత రంగు దుస్తులు ధరించాలి.
  • ఉదయం శరీరానికి నువ్వుల నూనె రాసుకొని, తర్వాత స్నానం చేస్తే చల్లదనం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత అరగదీసిన గంధాన్ని పూసుకోవాలి. నుదురు, పొట్ట, ఛాతీ మీద చందనం రాసుకుంటే శరీరంలోంచి ఉష్ణం త్వరగా బయటకు వెళ్లిపోతుంది.
  •  రాత్రి పడుకునే ముందు మాడుకు, పాదాలకు నువ్వుల నూనె రాసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. నిద్ర బాగా పడుతుంది.
  •  కారులో ప్రయాణించేవారు తుంగ ముస్తల పొడిని ఫిల్టర్‌ కాగితంలో చుట్టి లోపల పెట్టుకోవచ్చు. ఇది గాలిని సుగంధమయం చేయటమే కాకుండా ఎండదెబ్బ తగలకుండానూ కాపాడుతుంది. ముస్తల పొడికి చందనాన్నీ కలిపితే దోమలు దరిజేరకుండా చూసుకోవచ్చు.

సమస్యలు- చిట్కాలు, ఔషధాలు

ఎండాకాలంలో కొన్ని జబ్బులు ప్రత్యేకించి కనిపిస్తుంటాయి. కొన్ని చిట్కాలు, ఔషధాలతో వీటిని తగ్గించుకోవచ్చు.
తలనొప్పి: నుదుటికి గంధం పూతను రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిన్న గుడ్డలో రెండు మూడు చుక్కల జీవనధార తైలాన్ని వేసి వాసన చూసినా మేలే.
అతిసార (విరేచనాలు): దీన్ని అసలే నిర్లక్ష్యం చేయొద్దు. ఎండాకాలంలో మామూలుగానే ఒంట్లో నీరు తగ్గుతుంది. విరేచనాలతో మరింత ఎక్కువగా తగ్గుతుంది. కాబట్టి సత్వర చికిత్స అవసరం. దీనికి గంగాధర చూర్ణం.. కుటజ ఘనవటి, కర్పూర రస మాత్రలు.. బిల్వ అవలేహ్యం, కుటజ అవలేహ్యం ఔషధాలు ఉపయోగపడతాయి.
వడదెబ్బ: మజ్జిగలో ఉల్లిపాయ కలిపి తీసుకుంటే ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. చద్దన్నమూ మేలు చేస్తుంది. అయితే రాత్రి అన్నంలో నీరు పోసి పొద్దున లేచి తినటం కాదు. రాత్రిపూట తాజా అన్నంలోనే పాలు పోసి, కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టాలి. అలాగే మిరపకాయ, ఉల్లిపాయ వేసి మూత పెట్టాలి. మర్నాడు ఉదయం ఉప్పు కలిపి తినాలి. ఇది వడదెబ్బ తగలకుండానే కాదు, మానసిక స్థితి అస్తవ్యస్తం కాకుండానూ కాపాడుతుంది.
గులాబీ రెక్కలు, ప్రవాళ భస్మం కలిపి చేసిన గుల్కండ్‌ విత్‌ ప్రవాళ కూడా మంచిదే. దీన్ని రోజూ ఉదయం, సాయంత్రం ఒక చెంచా చొప్పున తీసుకుంటే వడదెబ్బతో పాటు చర్మం నలుపెక్కటాన్నీ నివారించుకోవచ్చు.
చర్మ సమస్యలు: ఎండ తగిలిన చోట చర్మం నల్లబడటం చూస్తూనే ఉంటాం. ఇలాంటివారు సాయంత్రం వేళ చెంచాడు పులిసిన పెరుగులో కాస్త పసుపు, చందనం, నిమ్మరసం కలిపి.. ముఖం, చేతులు, మెడ, పాదాలకు రాసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే నలుపు తగ్గే అవకాశముంది. కొబ్బరినూనెలో గంధాన్ని కలిసి చర్మానికి రాసుకుంటే చెమట కాయల వంటి సమస్యలు తగ్గటానికి తోడ్పడుతుంది.
కామలా (కామెర్లు): ఇది వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. వేపుళ్లు, నూనె పదార్థాలు తగ్గించాలి. మిరియాలు వాడొద్దు. దీనికి కటుక రోహిణి, గుంట గలకర ఉపయోగపడతాయి. అలాగే నేల ఉసిరి మొక్కను దంచి చిన్న ఉండగా చేసుకొని తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఆరోగ్యవర్ధిని మాత్రలూ మేలు చేస్తాయి.
కళ్లకలక: దీనికి త్రిఫల కషాయం ఉపయోగపడుతుంది. గిన్నెలో రెండు చెంచాల త్రిఫల చూర్ణం తీసుకొని.. దీనికి ఏడు రెట్లు నీరు కలపాలి. గిన్నెను పొయ్యి మీద పెట్టి సగం అయ్యేవరకు మరిగించాలి. చల్లబడ్డాక గుడ్డతో కషాయాన్ని వడగట్టి తరచూ కళ్లను కడుక్కోవాలి. సప్తామృత లోహం మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కోటి వేసుకోవచ్చు. త్రిఫలా ఘృతాన్ని ఉదయం, రాత్రి ఒకో చెంచా తిన్నా మంచిదే.
విషజ్వరాలు: వేసవిలో విషజ్వరాలూ వస్తుంటాయి. జలుబు (ప్రతిశ్యాయ) తగ్గటానికి శీతోపలాది చూర్ణం, హరిద్రకాండ, లక్ష్మీవిలాస రసం ఉపయోగపడతాయి. జ్వరాలకైతే సుదర్శన చూర్ణం, సుదర్శన ఘనవటి, ఆయుష్‌ 64, కాలమేఘ వంటి ఔషధాలు మేలు చేస్తాయి.


అన్ని రుతువులకూ కరక్కాయ

ఆరోగ్య సంరక్షణకు కరక్కాయ (హరితకి) చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఆయా రుతువుల్లో ఆయా అనుపానాలతో తీసుకోవాల్సి ఉంటుంది. శిశిరంలో పిప్పలి, వసంతంలో తేనె, గ్రీష్మంలో బెల్లం, వర్షలో సైంధవ లవణం, శరద్‌లో చక్కెర, హేమంతంలో శొంఠితో కలిపి తీసుకోవాలి. కరక్కాయ చూర్ణానికి రెండింతల అనుపానాలను కలిపి రోజుకు ఒక్కసారే సాయంత్రం వేళ తీసుకోవాలి. ఇది ఆయా రుతువుల్లో దోషాలు వికృతం కాకుండా కాపాడుతుంది. జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. జబ్బులు వచ్చినా తర్వగా కోలుకునేలా చూస్తుంది. అయితే సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు మాత్రం దీన్ని వాడకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు