మధుమేహం లక్షణాలివి...

మధుమేహం ఇంటింటి సమస్యగా మారింది. ఇందులో కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవు. దీంతో గ్లూకోజు కణాల్లోకి అంతగా వెళ్లదు. అప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి.

Updated : 16 Apr 2024 11:06 IST

ధుమేహం ఇంటింటి సమస్యగా మారింది. ఇందులో కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవు. దీంతో గ్లూకోజు కణాల్లోకి అంతగా వెళ్లదు. అప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇది క్రమంగా గుండెజబ్బు, చూపు పోవటం, నాడులు దెబ్బతినటం వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. ఇటీవల మధుమేహం మీద అవగాహన పెరిగినా చాలామందిలో తీవ్రమయ్యేవరకూ బయటపడటం లేదు. ప్రతి ముగ్గురిలో ఒకరికి సమస్య ఉన్నట్టయినా తెలియటం లేదు. మధుమేహంలో మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోవటమే దీనికి కారణం. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ కొన్ని హెచ్చరికలు పొడసూపుతుంటాయి.

మొదట్లో: మధుమేహం ఎక్కువవుతున్నప్పుడు ముందుగా కనిపించే ప్రధాన లక్షణం అతిగా దాహం వేయటం. అలాగే నోరు ఎండిపోవటం, విపరీతంగా ఆకలి వేయటం, మూత్రం ఎక్కువగా రావటం, కొన్నిసార్లు గంటకోసారి మూత్రానికి వెళ్లటం, అసాధారణంగా బరువు తగ్గటం లేదా పెరగటం వంటివి కూడా కనిపిస్తాయి.

తర్వాతి లక్షణాలు: రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతూ వస్తున్నకొద్దీ తలనొప్పి, చూపు మసక బారటం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి.

తీవ్ర సమస్యల్లో: చాలామందిలో ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసేంతవరకూ మధుమేహం నిర్ధరణ కావటం లేదు. ఇలాంటివారిలో గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవటం.. తరచూ మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు వస్తుండటం.. చర్మం.. ముఖ్యంగా గజ్జల్లో దురద పెట్టటం వంటి హెచ్చరికలు కనిపిస్తుంటాయి.

శృంగార ఆసక్తి తగ్గటం: మధుమేహంతో శృంగారం మీద ఆసక్తి తగ్గుతుంది. ఆడవారిలో యోని పొడిబారే అవకాశమూ ఉంది. మధుమేహంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి ఏదో ఒక లైంగిక సమస్య ఉంటుండటం గమనార్హం. మగవారిలో 35 నుంచి 70% మందిలో కనీసం ఏదో ఒక స్థాయిలో స్తంభన లోపం కనిపిస్తుంటుంది.

కాబట్టి అధిక బరువు, బొజ్జ, అంతగా శ్రమ చేయకపోవటం, పొగ తాగే అలవాటు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం, రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగిజరైడ్లు ఎక్కువగా ఉండటం వంటి మధుమేహ ముప్పు కారకాలు గలవారు అప్పుడప్పుడూ గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి. జబ్బును ముందుగానే గుర్తిస్తే ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని