నోటి క్యాన్సర్‌ జాగ్రత్త సుమా!

నోరు మంచిదైతే ఆరోగ్యమూ మంచిదవుతుంది. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది దీన్నుంచే. తిన్న ఆహారం లాలాజలంతో కలిసి.. జీర్ణక్రియ ఆరంభమయ్యేదీ ఇక్కడే. ఇంత కీలకమైంది కాబట్టే నోటికి ఏ సమస్య వచ్చినా ఇబ్బందే.

Updated : 16 Apr 2024 07:39 IST

ఇది నోటి క్యాన్సర్‌ అవగాహన మాసం

నోరు మంచిదైతే ఆరోగ్యమూ మంచిదవుతుంది. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది దీన్నుంచే. తిన్న ఆహారం లాలాజలంతో కలిసి.. జీర్ణక్రియ ఆరంభమయ్యేదీ ఇక్కడే. ఇంత కీలకమైంది కాబట్టే నోటికి ఏ సమస్య వచ్చినా ఇబ్బందే. చిన్న నంజు పొక్కు పుడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్‌ పుండు పడితే? శరీరం మొత్తం అతలాకుతలమవుతుంది. మంచి విషయం ఏంటంటే- దీన్ని చాలావరకూ నివారించుకునే వీలుండటం. తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం కావటం. అయినా మనదగ్గర రోజురోజుకీ నోటి క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 4 లక్షల మంది కొత్తగా దీని బారినపడుతుండగా వీరిలో పావు వంతు మంది మనదేశానికి చెందినవారే! వీరిలోనూ 60-70% మందిలో బాగా ముదిరిన తర్వాతే జబ్బు బయటపడుతుండటం గమనార్హం. నోటి క్యాన్సర్‌ మీద అవగాహన లేకపోవటం, భయం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ నోటి క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా సమగ్ర కథనం మీకోసం.

నోటి క్యాన్సర్‌ పెద్ద సమస్య. ఇది పెదవుల దగ్గరి నుంచి నాలుక, నాలుక కింది భాగం, చిగుళ్లు, దంతాలు, లోపలి బుగ్గలు, అంగిలి, నాలుక వెనకాల గొంతు వరకూ ఎక్కడైనా రావొచ్చు. మిగతా దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో నోటి క్యాన్సర్లు చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా వీటితో బాధపడుతున్నవారిలో సగం మంది ఇక్కడి వారే కావటం గమనార్హం. దీనికి చాలావరకూ కొన్ని ప్రత్యేకమైన దురలవాట్లే కారణం. మనదేశంలో కనిపించే క్యాన్సర్లలో 25-35% వరకూ నోటి క్యాన్సర్లే. ఇవి ఆడవారిలో కన్నా మగవారిలో ఇంకాస్త ఎక్కువ. సాధారణంగా నోటి క్యాన్సర్‌ పుండుగానే మొదలవుతుంది. అయితే మనదగ్గర నోట్లో పుండ్లను పెద్దగా పట్టించుకోరు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో చాలామందిలో ముదిరిన తర్వాతే బయటపడుతోంది. నిజానికి తొలిదశలో గుర్తిస్తే చికిత్స తేలిక. ఫలితమూ బాగుంటుంది. దాదాపు 70-90% మందికి పూర్తిగా నయమవుతుంది. అదే ముదిరిన దశలోనైతే సంక్లిష్ట చికిత్స అవసరమవుతుంది. ఫలితమూ అంతంతే. ఈ దశలో కేవలం 30-35% మందిలోనే నయమవుతుంది. అంటే బోలెడంత ఖర్చు పెట్టి చికిత్సలు చేసినా చాలామందిని కాపాడుకోలేకపోతున్నామనే అర్థం. కాబట్టి నోటి క్యాన్సర్‌ను ముందే గుర్తించటం కీలకం. దీని ముప్పు కారకాలు, చికిత్స పద్ధతులు, నివారణ మార్గాల గురించి తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం.


పునర్నిర్మాణమూ ముఖ్యమే

మాట్లాడటానికి, తినటానికి, ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. కాబట్టి క్యాన్సర్‌ బాధితులకు శస్త్రచికిత్సతో తొలగించిన భాగాలను తిరిగి నిర్మించకపోతే జీవితం హాయిగా సాగదు. సమాజంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందువల్ల పుండు మరీ పెద్దగా ఉండి, ఆయా భాగాలను ఎక్కువగా తొలగించినవారికి వాటిని తిరిగి నిర్మించి, అతికించటం చాలా ముఖ్యం. ఉదాహరణకు- నాలుకను సగం, అంతకన్నా ఎక్కువగా తొలగిస్తే శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మం, మాంసం, కొవ్వుతో పాటు కండరాన్ని తీసుకొచ్చి నాలుక రూపంలోకి మార్చి.. అతికిస్తారు. అలాగే దవడ ఎముక, బుగ్గల వంటి భాగాలనూ పునర్‌నిర్మిస్తారు. కొత్త శిక్షణా ఇస్తారు. కొన్ని వ్యాయామాలతో నాలుకను ఎలా కదిలించాలో, ఎలా మింగాలో నేర్పిస్తారు. అప్పటికే ఉన్న నాలుక కొత్తగా అమర్చిన నాలుక కదలికలకు తోడ్పడుతుంది. దీనికి రుచి తెలియక పోవచ్చు గానీ మింగటం, మాట్లాడటం వంటివి సులభ మవుతాయి. ముఖమూ అందంగా కని పిస్తుంది.


చికిత్స- దశలను బట్టి

ఒకటి, రెండు దశల్లో.. నోరు బాగా తెరచుకుంటూ ఉంటే చాలావరకూ శస్త్రచికిత్సతోనే నయం చేయొచ్చు. క్యాన్సర్‌ బయటకు కనిపించకుండా చుట్టుపక్కల కొంత వరకూ విస్తరించి ఉంటుంది. అందువల్ల పుండు పడ్డ చోటుతో పాటు ఆ భాగాన్ని కూడా అదనంగా కత్తిరిస్తారు. స్కాన్‌ పరీక్షల్లో కనిపించకపోయినా 20-25% మందిలో క్యాన్సర్‌ లింఫ్‌ గ్రంథులకూ విస్తరించే ప్రమాదముంది. కాబట్టి వీటిని కూడా తొలగించి, పరీక్షకు పంపిస్తారు. దీంతో గ్రంథుల్లో క్యాన్సర్‌ కణాలున్నాయో లేదో తెలుస్తుంది. కొన్నిసార్లు శస్త్రచికిత్స చేసేటప్పుడే కత్తిరించిన భాగాన్ని ఫ్రీజ్‌ చేసి, పరీక్షించాల్సి ఉంటుంది. దీన్ని తక్షణ బయాప్సీ అనుకోవచ్చు. క్యాన్సర్‌ కణాలున్నట్టయితే ఇందులో బయట పడుతుంది. క్యాన్సర్‌ ఉన్నట్టయితే ఇంకొంత ఎక్కువ భాగాన్ని కత్తిరించాల్సి వస్తుంది. కీలకమైన భాగాల్లో క్యాన్సర్‌ ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- దవడ ఎముక తీయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డప్పుడు సరైన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. మూడో దశలో శస్త్రచికిత్సతో పాటు రేడియేషన్‌ అవసరమవుతుంది. నాలుగో దశలో సర్జరీ, రేడియేషన్‌తో పాటు కొందరికి కీమో కూడా చేయాల్సి ఉంటుంది.


నిర్ధరణ ఎలా?

ముందుగా టార్చిలైటు వేసి నోటిని నిశితంగా పరిశీలిస్తారు. గ్లవుజు ధరించిన వేళ్లతో నోటి లోపల తడిమి చూస్తారు. క్యాన్సర్‌ కావొచ్చని అనుమానిస్తే అక్కడి నుంచి చిన్న ముక్కను కత్తిరించి, పరీక్షిస్తారు (బయాప్సీ). దీని ఫలితాలు రావటానికి రెండు, మూడు రోజులు పడుతుంది. ఇందులో క్యాన్సర్‌ ఉందో, లేదో నిర్ధరణ అవుతుంది. పుండు తీరును బట్టి దశలను  నిర్ణయిస్తారు. పుండు 2 సెం.మీ. కన్నా చిన్నగా ఉంటే తొలి దశగా.. 2 నుంచి 4 సెం.మీ. ఉంటే రెండో దశగా భావిస్తారు. పుండు అక్కడే ఉందా? లోపలికి ఎంతవరకు విస్తరించింది? మెడ వద్ద లింఫ్‌ గ్రంథులకు పాకిందా? అనే వాటిని బట్టి మూడు, నాలుగు దశలను నిర్ణయిస్తారు. పుండు 4 సెం.మీ. కన్నా పెద్దగా ఉండటం, క్యాన్సర్‌ మెడలోని ఒక లింఫ్‌ గ్రంథికి పాకితే మూడో దశగా భావిస్తారు. దవడ ఎముక క్షీణించటం, పై చర్మం వరకూ పుండు విస్తరించటం, నోరు తెరవటానికి తోడ్పడే కండరాలు బిగుసుకుపోవటం వంటి వాటిని బట్టి నాలుగో దశగా నిర్ణయిస్తారు. పుండు తీవ్రమైతే బుగ్గ మీద రంధ్రమూ పడొచ్చు. దురదృష్టవశాత్తూ మనదగ్గర చాలామంది ఇలాంటి దశలోనే వస్తుంటారు. తొలి రెండు దశల క్యాన్సర్లలో అవసరాన్ని బట్టి సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ వంటి పరీక్షలు చేస్తారు. మూడు, నాలుగు దశలకైతే ఇవి తప్పనిసరి. వీటితో క్యాన్సర్‌ తీవ్రత, ఎక్కడెక్కిడికి పాకిందనే వివరాలు తెలుస్తాయి.


ముప్పు కారకాలు ఇవీ..

పొగాకు వాడకం: అతి ముఖ్యమైన కారణం ఇదే. మనదగ్గర సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి కాల్చటమే కాకుండా పొగాకు, పొగాకు కట్టెలు, జర్దా, గుట్కాలనూ నమలుతుంటారు. ఇలాంటి అలవాటు భారత ఉపఖండంలోనే చూస్తుంటాం. పొగాకులో వందలాది క్యాన్సర్‌ కారకాలుంటాయి. జర్దా, గుట్కాల వంటి వాటిల్లో కలిపే రసాయనాలూ క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి. గత 20 ఏళ్లలో నోటి క్యాన్సర్లు పెరగటానికి ఇదీ ఒక కారణమే.

వక్కలు నమలటం: ఇదీ ప్రమాదమే. వక్కల్లో ఉండే పలు రసాయనాలు క్యాన్సర్‌ ముప్పును తెచ్చిపెడతాయి. మరోవైపు వీటిని అదేపనిగా నమలటం వల్ల నోట్లో అతి సూక్ష్మంగా పగుళ్లు ఏర్పడతాయి. ఇవి నయమయ్యే క్రమంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. ఇది నిరంతరం ఇలాగే కొనసాగుతూ వస్తుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. వక్కలతో మరో ప్రమాదం నోట్లోని జిగురు పొరలు గట్టిపడటం (సబ్‌ మ్యూకోజల్‌ ఫైబ్రోసిస్‌). దీంతో నోరు సరిగా తెరచుకోదు. దీన్ని క్యాన్సర్‌కు ముందస్తు దశగానూ చెప్పుకోవచ్చు.

మద్యం: ఇది మామూలుగానే నోట్లో చికాకును కలిగిస్తుంది. మరోవైపు శరీరంలోకి వెళ్లిన తర్వాత మద్యం ఎసిటాల్‌డిహైడ్‌గానూ మారుతుంది. ఇది బలమైన క్యాన్సర్‌ కారకం. మద్యానికి పొగ అలవాటూ తోడైతే ప్రమాదం రెట్టింపవుతుంది.

క్యాన్సర్‌ ముందు జబ్బులు: నోట్లో తెల్లటి, ఎర్రటి మచ్చలుగా కనిపించే లూకోప్లేకియా, ఎరిత్రోప్లేకియా, లైకన్‌ ప్లానస్‌.. అలాగే నోటి కణజాలం గట్టిపడటం (ఓరల్‌ సబ్‌ మ్యూకోజల్‌ ఫైబ్రోసిస్‌) వంటివి కొందరిలో క్యాన్సర్‌గా మారే అవకాశముంది.

పంటి గాయాలు: కృత్రిమ దంతాలు, కట్టుడు పళ్లు స్థిరంగా లేకపోతే తరచూ బుగ్గలకు తాకొచ్చు. పళ్ల మధ్య చర్మం పడి, పుండు ఏర్పడొచ్చు. పళ్లు మరీ వాడిగా ఉన్నవారిలోనూ తరచూ పుండ్లు పడుతుంటాయి. ఇవి మానకుండా పెద్దగా అయ్యి, క్యాన్సర్‌గా మారొచ్చు. ఎలాంటి దురలవాట్లూ లేని వారిలోనూ.. ముఖ్యంగా మహిళల్లో నోటి క్యాన్సర్‌ రావటానికి ఇదొక ముఖ్య కారణం.

నోటి శుభ్రత లోపించటం: నోరు పరిశుభ్రంగా లేకపోయినా ప్రమాదమే. ఇది దీర్ఘకాలంగా నోట్లో వాపు ప్రక్రియకు  (ఇన్‌ఫ్లమేషన్‌) దారితీయొచ్చు. ఇలా క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేయొచ్చు.

హెచ్‌పీవీ: హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కే కాదు.. నోటి క్యాన్సర్‌కూ కారణమే. సుమారు 18-20% నోటి క్యాన్సర్లు దీని మూలంగానే వస్తున్నాయి. ఇటీవల ఎలాంటి దురలవాట్లు లేని 18-25 ఏళ్ల యువతుల్లోనూ నోటి క్యాన్సర్‌ కనిపిస్తుండటానికి ఇదొక కారణం కావొచ్చని భావిస్తున్నారు.

పర్యావరణ కాలుష్యం: మన శరీరంలో క్యాన్సర్‌ను అడ్డుకునే, క్యాన్సర్‌ను ప్రోత్సహించే జన్యువులు రెండూ ఉంటాయి. ఏదైనా భాగంలో ప్రోత్సహించే జన్యువులు ఉత్తేజితమైతే క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. ఇలాంటి ప్రక్రియ ఎక్కడ, ఎందుకు జరుగుతుందనేది కచ్చితంగా తెలియదు, కానీ రకరకాల కాలుష్య కారకాలు దీనికి దోహదం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు. కలుషిత గాలి, నీరు ద్వారా శరీరంలోకి వెళ్లే రసా యనాలు జన్యువుల పనితీరును దెబ్బతీసే ప్రమాదముంది. ప్లాస్టిక్‌ వినియోగం పెరగటమూ ముప్పును తెచ్చిపెడుతోంది.

వయసు: వయసు మీద పడుతున్నకొద్దీ క్యాన్సర్‌ను అడ్డుకునే కణాల పనితీరు మందగిస్తుంటుంది. అందుకే వృద్ధాప్యంతోనూ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది.

పోషణలేమి: రక్తహీనత, విటమిన్‌ బి12 లోపం, విటమిన్‌ డి లోపం గలవారికీ కొంతవరకూ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది. జన్యువులు ఎప్పుడైనా దెబ్బతింటే అవి తిరిగి కుదురుకునే ప్రయత్నం చేస్తాయి. విటమిన్లు, ఖనిజాల లోపం గలవారిలో ఈ స్వభావం తగ్గుతుంది. దీంతో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా పెదవులు, స్వరపేటిక వెనకాల భాగంలో క్యాన్సర్లు వచ్చే అవకాశముంది.

రోగనిరోధకశక్తి క్షీణించటం: రోగనిరోధక వ్యవస్థ మందగించినవారికి, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారికి కూడా నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది.


లక్షణాలేంటి?

పుండు: చాలావరకూ నోటి క్యాన్సర్‌ పుండుగానే మొదలవుతుంది. కణితి రూపంలో ఏర్పడటం చాలా అరుదు. పెదవులు, నాలుక, అంగిలి, నాలుక కింద, బుగ్గల్లో ఎక్కడైనా పుండు ఏర్పడొచ్చు. సాధారణంగా నోట్లో పుండ్లు రెండు, మూడు వారాల్లో నయమవుతాయి. కనీసం మానే స్థితికైనా చేరుకుంటాయి. కానీ క్యాన్సర్‌ పుండు మానదు. అందువల్ల మూడు వారాలు దాటినా పుండు మానకపోయినా, మానుతున్న లక్షణాలు కనిపించకపోయినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నొప్పి లేకపోవటం: పుండు అనగానే నొప్పి గుర్తుకొస్తుంది. అయితే క్యాన్సర్‌ ఏర్పడుతున్నప్పుడు దగ్గర్లోని నాడులు క్షీణిస్తాయి కాబట్టి తొలిదశలో నొప్పి తెలియదు. కానీ క్యాన్సర్‌ ముదురు తున్నకొద్దీ నొప్పి మొదలవుతుంది. మొదట్లో ఆహారాన్ని నములుతున్నప్పుడు, మింగుతున్నప్పుడు నొప్పి పుట్టొచ్చు. తీవ్రమవుతున్నకొద్దీ ఆహారం తినటమూ కష్టమవుతుంది.

లాలాజలం ఊరటం: పుండు మూలంగానో, నొప్పి మూలంగానో సరిగా మింగలేక పోవటం వల్ల లాలాజలం ఊరొచ్చు.

నోరు సరిగా తెరచుకోకపోవటం: క్యాన్సర్‌ తీవ్రమైతే నోటి కండరాలూ క్షీణిస్తాయి. దీంతో నోరు తెరవటం కష్టమవుతుంది. పెద్దగా నోరు తెరవలేకపోతున్నారంటే క్యాన్సర్‌ ముదిరిందనే అర్థం.

మొద్దుబారటం: నోట్లో నాడులు దెబ్బతింటే నాలుక, దవడ వంటి భాగాల్లో సర్శ తగ్గొచ్చు. ఫలితంగా మొద్దుబారినట్టు అనిపించొచ్చు. రుచి తెలియకపోవచ్చు. నాలుకకు ఒకవైపు నాడులు దెబ్బతింటే కదలికలూ అస్తవ్యస్తం కావొచ్చు.

చెవి నొప్పి, దిబ్బడ: గొంతు వెనకాల, పైభాగంలో క్యాన్సర్‌ తలెత్తితే చెవి దిబ్బడ, నొప్పి కలుగుతుంది. సమస్య తీవ్రమైతే శ్వాసకూ ఇబ్బంది కలగొచ్చు. నోట్లోనూ నాలుక వెనకాల మరీ పెద్దగా పుండు పడితే చెవిలో నొప్పి రావొచ్చు.

బరువు తగ్గటం: తీవ్రమైన దశలో తినటం కష్టం కావటం, మెత్తటి పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల బరువు తగ్గొచ్చు.

దుర్వాసన: క్యాన్సర్‌ పుండు మరో లక్షణం ఎనరోబిక్‌ ఇన్‌ఫెక్షన్‌. దీంతో రకరకాల రసాయనాలు పుట్టుకొస్తాయి. దీంతో ముదిరిన దశలో నోటి దుర్వాసన రావొచ్చు. రక్తం సరఫరా కాకపోవటం వల్ల కొంత క్యాన్సర్‌ కణజాలం చచ్చుబడుతుంది. దీంతోనూ నోటి నుంచి చెడు వాసన రావొచ్చు.

దంతం కదలటం: ఇదో ప్రత్యేక లక్షణం. చిగుళ్ల భాగంలో క్యాన్సర్‌ ఉన్నట్టయితే పన్ను వదులై, కదిలిపోవచ్చు. అందువల్ల అకారణంగా.. అంటే దెబ్బలేవీ తగలకపోయినా దంతం దానంతటదే కదులుతుంటే నిర్లక్ష్యం చేయొద్దు.


నివారణ ఉత్తమం

నదేశంలో వచ్చే నోటి క్యాన్సర్లలో 85-90% దురలవాట్లతో ముడిపడినవే. వీటిల్లో ముఖ్యమైనవి పొగాకు, మద్యం అలవాట్లు. కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా చూసుకోవటం ముఖ్యం. ఇందుకు ఎవరికివారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవటంతో పాటు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటూ అవసరం. పొగ తాగటం, పొగాకు నమలటం చాలావరకూ 14-20 ఏళ్ల వయసులోనే అలవడతాయి. ఉత్సుకతతో రుచి చూడటంతో మొదలై.. క్రమంగా అలవాటుగా మారుతుంది. పొగాకులోని నికొటిన్‌ దాన్ని వదలనీయకుండా చేసి, వ్యసనంగా మార్చేస్తుంది. కాబట్టి బడుల్లోనే పొగాకు అనర్థాల మీద బోధించటం మంచిది. పిల్లల మీద ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఎక్కువ. చిన్న వయసులోనే అవగాహన కలిగితే పిల్లలను పొగాకు జోలికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. అలాగే పాఠశాలలకు చుట్టుపక్కల 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదనే నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. స్వచ్ఛంద సంస్థలూ పొగాకు అనర్థాల మీద మరింత ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. డాక్టర్లు కూడా రోగులు ఏ కారణంతో వచ్చినా ఒకసారి దురలవాట్లు ఏవైనా ఉన్నాయా అనీ అడగాలి. పొగాకు, మద్యం అలవాట్లుంటే నోట్లో టార్చిలైటు వేసి, పరీక్షించాలి. దీంతో క్యాన్సర్‌ ముందస్తు సమస్యలు, లక్షణాలుంటే తేలికగా గుర్తించొచ్చు.

ముందస్తు పరీక్షలు (స్క్రీనింగ్‌): సమాజంలో దురలవాట్లు గలవారికి తరచూ ముందస్తు పరీక్షలు చేయటం వల్ల నోటి క్యాన్సర్‌తో సంభవించే మరణాలు 30% వరకూ తగ్గుతున్నట్టు కేరళలో నిర్వహించిన ఒక భారీ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు.. చాలామందిలో తొలిదశలోనే జబ్బును గుర్తించటమూ సాధ్యమైంది. కాబట్టి ముందస్తు నోటి పరీక్షలు చాలా ముఖ్యం.

పోషకాహారం: తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, గింజపప్పులు (నట్స్‌) ఎక్కువగా తినాలి. డబ్బాల్లో నిల్వచేసే పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

  • కంటి నిండా నిద్రపోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో ఆరోగ్యం, పుండ్లు నయమయ్యే సామర్థ్యం ఇనుమడిస్తాయి. ఇవి క్యాన్సర్‌ నివారణకు తోడ్పడతాయి. ఒకవేళ క్యాన్సర్‌ వచ్చినా త్వరగా నయమయ్యే అవకాశముంటుంది.
  • మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  • లూకోప్లేకియా, లైకన్‌ ప్లానస్‌ వంటి క్యాన్సర్‌ ముందస్తు సమస్యలు గలవారు మూడు, నాలుగు నెలలకోసారి తప్పనిసరిగా నోటి పరీక్ష చేయించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు