అదృశ్య కొవ్వూ ప్రమాదమే

చర్మం కిందే కాదు.. అవయవాల చుట్టూ కొవ్వు పోగుపడుతుంది. ఇది మన కంటికి కనిపించదు గానీ బోలెడన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. నిజానికి అవయవాల చుట్టూ ఎంతో కొంత కొవ్వు ఉండటం మంచిదే.

Published : 23 Apr 2024 00:08 IST

చర్మం కిందే కాదు.. అవయవాల చుట్టూ కొవ్వు పోగుపడుతుంది. ఇది మన కంటికి కనిపించదు గానీ బోలెడన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. నిజానికి అవయవాల చుట్టూ ఎంతో కొంత కొవ్వు ఉండటం మంచిదే. ఇది గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు దన్నుగా నిలుస్తుంది. కానీ ఎక్కువైతేనే ఇబ్బంది. ఇది సైటోకైన్ల (అడిపోకైన్స్‌) వంటి వాపు కారకాలను రక్తంలోకి ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బు, మదుమేహం, క్యాన్సర్ల వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు అవయవాల చుట్టూ పోగుపడే కొవ్వును జబ్బుగానూ పరిగణిస్తున్నారు.

అవయవాల చుట్టూరా కొవ్వుతో దుష్ప్రభావాలు ఉంటున్నట్టు తెలిసినా దీన్ని కొలవటం అంత తేలిక కాదు. ఇందుకు సమర్థమైన సాధనాలేవీ లేవు. కానీ శరీరంలోని మొత్తం కొవ్వులో సుమారు 10% అవయవాల చుట్టూ పోగుపడినదేనని నిపుణుల భావన. అంటే ఎంత ఎక్కువ బరువు పెరిగితే అంత ఎక్కువగా అవయవాల చుట్టూ కొవ్వు పోగవుతుందన్నమాట. సాధారణంగా శరీర ఎత్తు, బరువు నిష్పత్తి(బీఎంఐ)తో అధిక బరువు, ఊబకాయాన్ని నిర్ధరిస్తుంటారు. అయితే ఇది అవయవాల చుట్టూరా కొవ్వు ముప్పును కచ్చితంగా తెలియజేయదు. బీఎంఐ తక్కువగా ఉన్న వృద్ధుల్లో  ఇలాంటి కొవ్వు చాలా ఎక్కువగా ఉండొచ్చు. అలాగే బీఎంఐ ఎక్కువగా ఉన్నా చిన్నవయసులో కొవ్వు తక్కువగా ఉండొచ్చు. అందువల్ల కేవలం బీఎంఐతోనే దీన్ని అంచనా వేయటం కష్టం. దీని విషయంలో బొజ్జ చుట్టుకొలత కొంతవరకూ ఉపయోగపడుతుంది. అవయవాల చుట్టూరా పోగుపడిన కొవ్వుతో తలెత్తే సమస్యలు బొజ్జతోనూ ముడిపడి ఉంటుండటం గమనార్హం. నడుం చుట్టుకొలత (బొజ్జ వద్ద) మగవారిలో 40 అంగుళాలు, ఆడవారిలో 35 అంగుళాలు మించితే ప్రమాదం పొంచి ఉన్నట్టే. అవయవాల చుట్టూరా కొవ్వుతో అధిక రక్తపోటు, గుండెజబ్బు, ముందస్తు మధుమేహం, కాలేయానికి కొవ్వు పట్టటం వంటి సమస్యల ముప్పులు పెరుగుతాయి. నిద్రకు భంగం కలిగించే గురకకూ దారితీయొచ్చు. ఏదేమైనా కంటికి కనిపించకపోయినా అవయవాల చుట్టూ పోగుపడే కొవ్వును తగ్గించుకోవటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, అవసరాన్ని బట్టి మందులు వాడుకోవటం వంటి మామూలు కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడే పద్ధతులతోనే దీన్ని కూడా తగ్గించుకోవచ్చు. కొందరికి బేరియాట్రిక్‌ సర్జరీ ఉపయోగపడుతుంది. ఇది ఊబకాయంతో ముడిపడిన క్యాన్సర్లు, వీటితో మరణించే ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని