ముప్పు తక్కువైనా ఎక్కువకాలం నిఘా

మగవారిలో తలెత్తే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కొన్నిసార్లు గ్రంథికి మాత్రమే పరిమితమవుతుంటుంది. అదీ చాలా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంటుంది. కొందరిలో అసలు కణితి వృద్ధి చెందకపోవచ్చు కూడా.

Published : 23 Apr 2024 00:14 IST

మగవారిలో తలెత్తే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కొన్నిసార్లు గ్రంథికి మాత్రమే పరిమితమవుతుంటుంది. అదీ చాలా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంటుంది. కొందరిలో అసలు కణితి వృద్ధి చెందకపోవచ్చు కూడా. దీన్ని తక్కువ ముప్పు గల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌గా భావిస్తుంటారు. ఇలాంటివారికి చికిత్స చేయటం కన్నా తరచూ పరీక్షిస్తుంటారు. ఇలా 15 ఏళ్ల పాటు నిశితంగా గమనిస్తూ, క్యాన్సర్‌ తీరుతెన్నులను పరిశీలిస్తే సరిపోతుందని చెబుతుంటారు. అయితే వీరిపై ఇంకా ఎక్కువ కాలం నిఘా వేయాల్సిన అవసరముందని తాజాగా బయటపడింది. తక్కువ ముప్పు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ గలవారిపై 15 ఏళ్ల పాటు నిఘా వేసినవారిలో 65% మంది బతికి బట్టకట్టొచ్చని 2016లో నిర్వహించిన అధ్యయనం ఒకటి అంచనా వేసింది. కానీ ఇదిప్పుడు 31 శాతానికి పడిపోయింది. మరణాలూ నాలుగు రెట్లు పెరగటం గమనార్హం. దీన్ని విస్మరించటానికి వీల్లేదని, తక్కువ ముప్పు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ గలవారిని మరింత ఎక్కువ కాలం నిశితంగా గమనించాల్సి ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. వీరిలో క్యాన్సర్‌ను నయం చేసే అవకాశం చేజారిపోకుండా చూసుకోవటానికిది బాగా తోడ్పడుతుందని చెబుతున్నారు. జీవనకాలం పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇది చాలా కీలకమైన అంశమని గుర్తుచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని