గుండె లయ తప్పుతోంది!

గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తమయ్యే (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) ముప్పు పెరుగుతూ వస్తోందని డెన్మార్క్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ప్రతి నలుగురిలో ఒకరిలో కనిపించే ఇది ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరికి వస్తోందని పేర్కొంది.

Published : 23 Apr 2024 00:18 IST

గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తమయ్యే (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) ముప్పు పెరుగుతూ వస్తోందని డెన్మార్క్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ప్రతి నలుగురిలో ఒకరిలో కనిపించే ఇది ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరికి వస్తోందని పేర్కొంది. వీరిలోనూ ప్రతి ఐదుగురిలో ఇద్దరు తమ జీవితకాలంలో గుండె వైఫల్యం బారినపడుతుండగా.. ప్రతి ఐదుగురిలో ఒకరు పక్షవాతానికి గురవుతుండటం గమనార్హం. సాధారణంగా గుండె లయ తప్పినవారిలో పక్షవాతం మీదే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. వీరిలో గుండె వైఫల్యం, గుండె పోటు వంటి ఇతర ముప్పుల గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ నేపథ్యంలో పరిశోధకులు డెన్మార్క్‌కు చెందిన 35 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని క్షుణ్నంగా విశ్లేషించారు. ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ లేని 45 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారిని ఎంచుకొని 23 ఏళ్ల పాటు పరిశీలించారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె వైఫల్యం, దీర్ఘకాల ఊపిరితిత్తి జబ్బు, కిడ్నీ జబ్బు, కుటుంబ ఆర్థిక స్థితి, విద్య వంటి వాటినీ పరిగణనలోకి తీసుకున్నారు. వీరికి పదేళ్ల కాలంలో గుండె లయ తప్పే ముప్పు 24% నుంచి 31 శాతానికి పెరిగినట్టు గుర్తించారు. దీని మూలంగా గుండె వైఫల్యం ముప్పు 41%, పక్షవాతం ముప్పు 21%, గుండెపోటు ముప్పు 12% వరకూ ఉంటున్నట్టు తేల్చారు. అందువల్ల గుండె లయ తప్పినవారిలో ఈ సమస్యల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు