మలేరియా పని పట్టండి!

అనాదిగా మలేరియా మానవాళిని పీడిస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- ఇప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షలకు పైగా మందిని కబళిస్తోంది.

Updated : 23 Apr 2024 01:27 IST

ఎల్లుండి వరల్డ్‌ మలేరియా డే

 

అనాదిగా మలేరియా మానవాళిని పీడిస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- ఇప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షలకు పైగా మందిని కబళిస్తోంది. మనదేశంలో మలేరియా కేసులు, మరణాల సంఖ్య ఒకింత తగ్గుముఖం పడుతున్నట్టు వరల్డ్‌ మలేరియా రిపోర్టు చెబుతున్నప్పటికీ ఇంకా కొరకరాని కొయ్యగానే మిగిలి పోయింది. నిజానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే మలేరియాను నివారించుకోవటం అసాధ్యమేమీ కాదు. జబ్బు బారినపడ్డా సరైన చికిత్స తీసుకుంటే తీవ్రం కాకుండా, ప్రాణాలకు అపాయం కలగకుండా చూసు కోవచ్చు. అయినా కూడా జబ్బుపై అవగాహన లేకపోవటమో, మారుమూల ప్రాంతాల్లో తగు చికిత్సలు అందుబాటులో లేకపోవటమో.. కారణమేదైనా మలేరియా మరణాలను పూర్తిగా ఆపటం సాధ్యం కావటం లేదు. అందుకే ‘మరింత సమానత్వ ప్రపంచం కోసం మలేరియాతో పోరాటాన్ని ఉద్ధృతం చేయాలి’ అని వరల్డ్‌ మలేరియా డే నినదిస్తోంది. సరైన అవగాహనతోనే దీన్ని సాధించగలం. మనదగ్గర సుమారు 95% జనాభా మలేరియా ప్రబలే ప్రాంతాల్లోనే నివసిస్తున్న నేపథ్యంలో ఇది తక్షణావసరం కూడా.

మలేరియా జ్వరానికి మూలం ‘ప్లాస్మోడియం’ అనే పరాన్నజీవి. ఇది దోమలతో.. ముఖ్యంగా ఆడ అనాఫిలస్‌ దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దోమలకు తమ గుడ్లను వృద్ధి చేసుకోవటానికి రక్తం కావాలి. అందుకే మనుషులను కుడుతుంటాయి. అప్పటికే మలేరియాతో బాధ పడుతున్న వ్యక్తిని దోమ కుట్టిందనుకోండి. దానికీ పరాన్నజీవి సోకుతుంది. ఆ దోమ మరొకరిని కుట్టినప్పుడు లాలాజలం ద్వారా వ్యక్తి రక్తంలోకి పరాన్నజీవి ప్రవేశిస్తుంది. ఇది కాలేయంలోకి చేరుకొని పరిపక్వమై, వృద్ధి చెందుతుంది. కాలేయ కణాలను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుంది. ఆ కణాలు విచ్ఛిన్నం కావటం వల్ల పరాన్నజీవులు రక్తంలోకి, తర్వాత ఎర్ర రక్తకణాలకు చేరుకుంటాయి. ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తాయి. ఇలాంటి వ్యక్తులను దోమలు కుట్టటం, అవి మరొకరిని కుట్టటం.. వారిలో ఇన్‌ఫెక్షన్‌ కలగజేయటం.. ఇలా ఒక చట్రంలా కొనసాగుతూ వస్తుంటుంది.

నాలుగు రకాలు

మలేరియా కారక పరాన్నజీవిలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌, ఒవేల్‌, మలేరియే అని నాలుగు రకాలు ఉన్నాయి. ఒవేల్‌లోనూ మరో రెండు రకాలు కనిపిస్తాయి. కోతులకు పరిమితమయ్యే నోవలేసే అనే మరో రకమూ ఉంది. ఇదిప్పుడు మనుషులకూ విస్తరిస్తుండటం ఆందోళనకరం. ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకాలతో వచ్చే మలేరియానే ఎక్కువ. అందులోనూ ఫాల్సిఫారమ్‌ మలేరియా మరింత అధికం. ఒకప్పుడు ఫాల్సిఫారమ్‌ పరాన్నజీవి గిరిజన ప్రాంతాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకూ విస్తరించింది. ప్రస్తుతం పట్టణాల్లో ఫాల్సిఫారమ్‌ రకమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది వైవాక్స్‌ రకం కన్నా ప్రమాదకరమైంది. దీంతో దుష్ప్రభావాలూ ఎక్కువే.

ఒకేసారి ఎక్కువ రకాలు

ఒకేసారి రెండు, మూడు రకాల ప్లాస్మోడియం రకాలు దాడి చేస్తుండటమూ కనిపిస్తోంది. దీన్ని ‘మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌’గా భావిస్తున్నారు. ఇలాంటి సమస్య అరుదని భావించేవారు. అయితే ఇప్పుడు తరచూ కనిపిస్తుండటం గమనార్హం. ఒక దోమలో ఒకే రకం పరాన్నజీవి ఉండాలనేమీ లేదు. కొన్నిసార్లు ఒకే దోమలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ వంటి రకరకాల పరాన్నజీవులూ ఉండొచ్చు. ఇలాంటి దోమలు కుట్టినప్పుడు ఒకే సమయంలో అవీ సంక్రమించొచ్చు. సాధారణంగా చికిత్స తీసుకున్నాక ఫాల్సిఫారమ్‌ రకం మలేరియా తిరగబెట్టటం అరుదు. కొందరిలో ఇది మళ్లీ మళ్లీ ఎందుకొస్తుందోనని తెలుసుకునే ప్రయత్నంలో ఓ కొత్త విషయం బయట పడింది. మొదటిసారి దోమ కుట్టినపుడే ఒకటి కన్నా ఎక్కువ రకాల పరాన్నజీవులు ఒంట్లోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడైంది. వీటిల్లో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకాలు కలగలసి ఉండటమే ఎక్కువగా కనిపిస్తోంది. తీవ్ర మలేరియా బారిన పడుతున్న వారిలో సుమారు 5% మందిలో ఇలాంటి మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది.

నివారణ మన చేతుల్లో

మలేరియా వచ్చాక బాధపడటం కన్నా దీని బారినపడకుండా చూసుకోవటమే ఉత్తమం. అన్నింటికన్నా ముఖ్యమైంది దోమలు కుట్టకుండా చూసుకోవటం.

  • చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ మంచాలకు దోమ తెరలు కట్టుకోవాలి.
  • ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు బిగించుకోవాలి. తలుపులకు తెరలు వేలాడదీయాలి.
  • ప్యాంట్లు, పొడవు చేతుల చొక్కాలు ధరించాలి. బయటకు వెళ్లినప్పుడు సాక్సు వేసుకోవాలి. చర్మానికి దోమలను వికర్షించే పూత మందులు రాసుకోవాలి.
  • ఇప్పుడు దోమలను చంపే మందు పూత పూసిన దోమ తెరలు కూడా ఉన్నాయి. మలేరియా ప్రబలంగా ఉండే ప్రాంతాల్లో వీటిని వాడుకోవటం మంచిది. దీర్ఘకాలంగా పనిచేసే మందు పూత తెరలు దాదాపు మూడేళ్ల వరకూ ప్రభావం చూపుతాయి.
  • దోమలను చంపటానికి ఇంట్లో స్ప్రేలతో మందు కూడా చల్లుకోవచ్చు. ఇది మలేరియా వ్యాప్తి నివారణకు బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా మలేరియాను వ్యాప్తి చేసే దోమలు- మనుషులను కుట్టిన తర్వాత ఇంటి గోడలపై, కప్పులపై వాలతాయి. దోమల మందులను చల్లితే మలేరియా బారినపడకుండా చూసుకోవచ్చు. వీటిని ఒకసారి చల్లితే 3-6 నెలల వరకూ పనిచేస్తాయి.
  • టి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరి చిప్పలు, పాత టైర్ల వంటివి ఉంటే వెంటనే దూరంగా పారేయ్యాలి. వాడనప్పుడు కూలర్లలో నీరు లేకుండా చూసుకోవాలి.

​​​​​​మొండిగా మార్చొద్దు

 మలేరియాను త్వరగా గుర్తించి, చికిత్స ఆరంభించటం చాలా చాలా ముఖ్యం. అలాగే డాక్టర్‌ను సంప్రదించకుండా అనవసరంగా, విచక్షణా రహితంగా మందులు వాడొద్దు. లేకపోతే మలేరియా పరాన్నజీవి మొండిగా మారుతుంది. మందులకు లొంగని విధంగా తయారవుతుంది. ఇప్పటికే మనదేశంలో ఇలాంటి ధోరణి కనిపిస్తుండటం ఆందోళనకరం.

లక్షణాలపై కన్నేయండి

మలేరియాలో ప్రధానమైన లక్షణం చలి, వణుకుతో కూడిన తీవ్ర జ్వరం. మలేరియా కారక పరాన్నజీవి రక్తకణాలను విచ్ఛిన్నం చేయటం వల్ల విషతుల్యాలు పుట్టుకొస్తాయి. దీంతో చలి, వణుకు వంటివి తలెత్తుతాయి. కొందరికి తలనొప్పి, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కూడా ఉండొచ్చు. చిన్నపిల్లలకు నీళ్ల విరేచనాలూ కావొచ్చు. రక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ కామెర్లు కూడా వేధిస్తాయి. ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు వస్తే మూత్రం నల్లగా కనిపించొచ్చు. సమస్య తీవ్రమైతే కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినొచ్చు. కొందరిలో ఫాల్సిఫారమ్‌ పరాన్నజీవులు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెంది, సూక్ష్మ రక్తనాళికల్లో చిక్కుకపోవచ్చు. అప్పుడు అవయవాలకు తగినంత రక్తం సరఫరా కాదు. ఆయా భాగాలకు ఆక్సిజన్‌ అందటం తగ్గుతుంది. దీంతో మూర్ఛ రావొచ్చు, స్పృహ కోల్పోవచ్చు కూడా. కొన్నిసార్లు ఊపిరితిత్తులు దెబ్బతిని ఏఆర్‌డీఎస్‌ తలెత్తొచ్చు. ఫలితంగా పలు అవయవాలు పనిచేయలేని స్థితికి చేరుకోవచ్చు. దీన్ని గుర్తించి, సరైన చికిత్స అందించకపోతే ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదముంది. వైవాక్స్‌ రకం మలేరియా మందులతో తగ్గినా కొంతకాలం తర్వాత మళ్లీ రావొచ్చు. కొన్ని పరాన్నజీవులు కాలేయంలో నిద్రాణంగా ఉండిపోయి, ఉన్నట్టుండి విజృంభించొచ్చు.

  • గర్భిణులకు మలేరియా వస్తే తల్లికీ, పిండానికీ ప్రమాదమే. పుట్టిన తర్వాత శిశువుకూ ఇబ్బందులు తలెత్తొచ్చు. గర్భిణుల్లో మలేరియాతో పోరాడే శక్తి సన్నగిల్లినప్పుడు, లేదా జబ్బు నుంచి త్వరగా కోలుకోనప్పుడు పిండం మీద విపరీత ప్రభావం పడుతుంది.

త్వరగా గుర్తించాలి

మలేరియాను కచ్చితంగా, త్వరగా గుర్తించటం ముఖ్యం. ఇందుకు సమర్థమైన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ర్యాపిడ్‌ డయాగ్నొస్టిక్‌ టెస్ట్‌ (ఆర్‌డీటీ) ప్యారాసైట్‌ ఎఫ్‌, వి ద్వారా ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకం మలేరియాలను నిర్ధరించొచ్చు. మలేరియా పరాన్నజీవికి చెందిన ప్రత్యేక ప్రొటీన్‌ ఆధారంగా ఇది సమస్యను గుర్తిస్తుంది. రెండు కన్నా ఎక్కువ రకాల పరాన్నజీవులను గుర్తించటానికి ‘పారామ్యాక్స్‌ కిట్‌’ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్షను ఎవరైనా, ఎక్కడైనా చేయొచ్చు. పెద్దగా నైపుణ్యం అవసరం లేదు. ఖర్చు కూడా తక్కువ.

చికిత్స ఏంటి?

ఫాల్సిఫారమ్‌ రకం మలేరియాకు ఆర్టీమినిసిన్‌ మందు బాగా ఉపయోగపడుతుంది. లూమిఫాంటిన్‌, మెఫ్లోక్విన్‌, సల్ఫాడాక్సిన్‌/పైరిమెథమైన్‌ వంటి మందులూ అవసరమవుతాయి. వీటితో ఫాల్సిఫారమ్‌ మలేరియా పూర్తిగా తగ్గుతుంది. వైవాక్స్‌ రకం మలేరియా క్లోరోక్విన్‌ మాత్రలతో తగ్గినా కొన్నాళ్లకు తిరగబెట్టొచ్చు. అందుకే రెండు వారాల పాటు ‘ప్రైమాక్విన్‌’ మందునూ వాడుకోవాల్సి ఉంటుంది. మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టయితే ఆయా రకాలను బట్టి చికిత్స అవసరమవుతుంది. అయితే ప్రైమాక్విన్‌ మూలంగా జీ6పీడీ ఎంజైమ్‌ లోపం గలవారికి రక్తం విచ్ఛినం కావొచ్చు. అందువల్ల ముందుగా జీ6పీడీ లోపాన్ని గుర్తించే రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. గర్భిణులు, పిల్లలకు ప్రైమాక్విన్‌ ఇచ్చేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

 రెండు, మూడు కలిస్తే ప్రమాదమే..

రెండు, మూడు పరాన్న జీవులతో వచ్చే మలేరియాలో జ్వరం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దీని తీరుతెన్నులను అంచనా వేయటమూ కష్టమే. సాధారణంగా వైవాక్స్‌ మలేరియాలో జ్వరం రోజు విడిచి రోజు వస్తుంటుంది. ఫాల్సిఫారమ్‌లో రోజూ జ్వరం, జ్వరంతో పాటు విపరీతమైన చలి కూడా ఉంటుంది. అదే రెండూ కలిసి ఉన్నప్పుడు జ్వరం మరింత తీవ్రంగా వస్తుంది. జ్వరం రావటం, విడవటంలో ఒక పద్ధతి ఉండదు. చలి, వణుకు వంటివీ తీవ్రంగానే ఉంటాయి. కామెర్లు, రక్తహీనత, కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు కూడా మరింత త్వరగా రావొచ్చు. చికిత్సతో ఫాల్సిఫారమ్‌ రకం తగినప్పటికీ.. వైవాక్స్‌ కారణంగా మళ్లీ మలేరియా తలెత్తొచ్చు. అప్పటికే బలహీనంగా ఉండటం వల్ల మరింత హాని చేస్తుంది. జ్వరం ఇంకాస్త ఉద్ధృతంగానూ ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని