మూత్రం మీద పట్టు

మూత్రం వస్తున్నట్టు అనిపించిన వెంటనే బాత్రూమ్‌కు పరుగెడుతున్నారా? మూత్రం ధార సన్నబడిందా? పూర్తిగా మూత్రం పోసినట్టు అనిపించటం లేదా? ఇవన్నీ కింది మూత్రకోశ సమస్యల లక్షణాలు.

Published : 30 Apr 2024 00:04 IST

మూత్రం వస్తున్నట్టు అనిపించిన వెంటనే బాత్రూమ్‌కు పరుగెడుతున్నారా? మూత్రం ధార సన్నబడిందా? పూర్తిగా మూత్రం పోసినట్టు అనిపించటం లేదా? ఇవన్నీ కింది మూత్రకోశ సమస్యల లక్షణాలు. మగవారిలో 72% కన్నా ఎక్కువ మంది ఎప్పుడో ఒకప్పుడు వీటిల్లో ఒక ఇబ్బందినైనా ఎదుర్కొని ఉంటారంటే అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం మూత్రమార్గానికి చుట్టూ కరచుకొనే ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటం, మూత్రాశయం అతిగా స్పందించటం. సాధారణంగా 40 ఏళ్లు దాటిన మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథి వేగంగా ఉబ్బుతూ వస్తుంటుంది. ఇది కింది మూత్రకోశ లక్షణాలకు దారితీస్తుంది. వీటిని నివారించుకోవటానికి కటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. కటి భాగం అడుగున మూత్రాశయం, మలాశయం వంటి అవయవాలకు దన్నుగా నిలిచే కండరాలుంటాయి. వీటిని ఉత్తేజితం, బలోపేతం చేయటానికి కటి వ్యాయామాలు ఉపయోగపడతాయి. వెంటనే మూత్రానికి వెళ్లటం, మూత్రం చుక్కలుగా పడటం తగ్గటానికి తోడ్పడతాయి. నిద్ర పోతున్నప్పుడు మూత్రాశయం స్పందించకుండా చూసుకోవచ్చు. మూత్రాన్ని పట్టి ఉంచేలా, సరైన సమయంలో విసర్జించేలా చేసుకోవచ్చు. అయితే మూత్ర విసర్జనను నియంత్రించే కండరాలను కచ్చితంగా గుర్తించటం అవసరం. ఇదేమంత కష్టమైన పని కాదు. మూత్రం పోస్తున్నప్పుడు దీన్ని తేలికగానే గుర్తించొచ్చు.

ఎలా గుర్తించాలి?

 మూత్రం పోస్తున్నప్పుడు మధ్యలో ఆపటానికి లేదా ధారను సన్నం చేయటానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో పిరుదులు, కాళ్లు, కడుపు కండరాలను బిగుతుగా చేయొద్దు. శ్వాసనూ ఆపొద్దు. మూత్రం ధారను సన్నగా చేసినా, ఆపినా ఆ కండరాలను సరిగా గుర్తించినట్టే. కొందరు కింది నుంచి పోతున్న గ్యాస్‌ను ఆపటానికి ప్రయత్నిస్తున్నామని ఊహించుకోవటం ద్వారానూ వీటిని గుర్తిస్తుంటారు. ఈ కండరాలను బిగపట్టినప్పుడు ఏదో లాగుతున్న భావన కలుగుతుంది. కటి వ్యాయామాలకు ఇవే సరైనవి. అయితే వీటిని చేసేటప్పుడు ఇతర కండరాలను బిగపట్టొద్దని గుర్తించాలి.

 ఎలా చేయాలి?

  • ఒకసారి కండరాలను గుర్తించాక.. వాటిని బిగపట్టి నెమ్మదిగా 1 నుంచి 5 వరకూ లెక్కించాలి.
  • తర్వాత నెమ్మదిగా 1 నుంచి 5 వరకూ లెక్కిస్తూ వదులు చేయాలి.
  • ఇలా 10 సార్లు చేయాలి.
  • దీన్ని రోజుకు మూడు సార్లు చేస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని