మొలల వేదన

మలద్వారం నుంచి రక్తం పడితే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కానీ చాలామంది దీని గురించి చెప్పుకోవటానికి నామోషీ పడుతుంటారు.

Published : 07 May 2024 00:04 IST

మలద్వారం నుంచి రక్తం పడితే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కానీ చాలామంది దీని గురించి చెప్పుకోవటానికి నామోషీ పడుతుంటారు. లోలోపలే మథనపడుతుంటారు. తమకు తామే మొలల సమస్య (పైల్స్‌) అని నిర్ధరించు కుంటుంటారు. తోచిన ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. నాటు వైద్యాలను కూడా ఆశ్రయిస్తుంటారు. సమస్య తీవ్రమయ్యాక గానీ డాక్టర్‌ను సంప్రదించరు. ఇది తగదు.

ఆశ్చర్యంగా అనిపించినా ఏదో ఒక స్థాయిలో మొలలు అందరికీ ఉంటాయి. కాకపోతే అవి సమస్యాత్మకం కావు. నిజానికివి మలద్వారంలో ఉండే మెత్తటి పొరలు. ఇవి సాగటం, పెరగటం, జారటం, ముదరటం ద్వారా మొలలుగా మారతాయి. వీటినే పైల్స్‌, హెమరాయిడ్స్‌ అని పిలుచుకుంటారు. ఇవి మొలలుగా మారటానికి అతి ముఖ్యమైన కారణం మలబద్ధకం, విసర్జన సమయంలో గట్టిగా ముక్కటం. ముక్కినప్పుడు మలద్వారం వద్ద మెత్తటి పొరలతో కూడిన కండర బంధనం సాగుతుంది. తరచూ ఇలాగే జరిగితే కండర బంధనం పలుచగా అవుతుంది. మలం గట్టిగా వచ్చినప్పుడు ఆ భాగానికి రాసుకొని రక్తస్రావమవుతుంది. ముక్కినప్పుడు మలద్వారం వెనక భాగం పొడుచుకు రావటమూ మొదలవుతుంది. కొద్దికొద్దిగా కిందికి వస్తూ.. చివరికి మొత్తమంతా తోసుకొస్తుంది. పైల్స్‌ మొదటి దశ ఇదే. కొందరిలో ఇవి వంశపారంపర్యంగానూ రావొచ్చు. మలద్వారం వద్ద ఉండే కండర వలయాలను పట్టి ఉంచే కొలాజెన్‌ పొర బలహీనంగా ఉండటం దీనికి కారణం కావొచ్చు. కొందరికి విరేచనాల మూలంగానూ మొలలు తయారవ్వచ్చు. కాలేయం గట్టిపడటంతోనూ ఇవి రావొచ్చు.

కొన్ని లోపలే: మొలలు అనగానే బయటకు పొడుచుకొని రావటమే గుర్తుకొస్తుంది. నిజానికి తొలిదశలో పైకేమీ కనిపించవు. నొప్పి పుట్టకపోయినా రక్తం పడుతుంటుంది. కాస్త ముదిరినప్పుడు విసర్జన సమయంలో మొలలు చిన్న ద్రాక్ష గుత్తుల మాదిరిగా బయటకు పొడుచుకొస్తాయి. విసర్జన తర్వాత వాటంతటవే లోపలికి పోతాయి. అయినా అందరికీ రక్తస్రావం కాకపోవచ్చు. సమస్య ఇంకాస్త తీవ్రమైతే పొడుచుకొచ్చిన మొలలు లోపలికి పోవు. వేలితో లోపలికి నెట్టాల్సి రావొచ్చు. మరీ తీవ్రమైతే వేలితో నెట్టినా లోపలికి వెళ్లవు. బయటే ఉండిపోతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌కూ గురికావొచ్చు. దీంతో నొప్పితో పాటు దురద, జ్వరం కూడా రావొచ్చు.

 ఎక్కువగానూ..: కొన్నిసార్లు మొలలతో పెద్దఎత్తున రక్తస్రావం కావొచ్చు. దీంతో తూలిపోవచ్చు. కొందరికి నిరంతరం, కొద్దికొద్దిగా రక్తం చుక్కలు పడుతుండొచ్చు. క్రమంగా ఇది రక్తహీనతకు దారితీస్తుంది. కొందరిలో నిస్సత్తువ, రక్తహీనత తలెత్తిన తర్వాత గానీ మొలల సమస్య నిర్ధరణ కాకపోవటం గమనార్హం.

రక్తం తీరు వేర్వేరు: మలద్వారం నుంచి పడే రక్తం అంతా ఒకటి కాదు. బాగా ఎరుపు రంగులో ఉంటే అప్పుడే బయటకు వచ్చింది కావొచ్చు. పెద్దపేగు చివరి భాగమైన మలాశయం (రెక్టమ్‌) నుంచి రక్తస్రావమైనప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. ఒకవేళ రక్తం ముదురు ఎరుపు (మెరూన్‌) రంగులో ఉంటే అది పేగుల్లోంచి వచ్చింది అయ్యిండొచ్చు. అదే నల్లగా, తారులా ఉంటే జీర్ణాశయంలో రక్తస్రావానికి సంకేతం కావొచ్చు.

ఒక్క మొలలతోనే కాదు..:  ఒక్క మొలల మూలంగానే రక్తం పడుతుందని చాలామంది అపోహ పడుతుంటారు. ఇదొక్కటే కాదు.. రకరకాల సమస్యలూ దీనికి దోహదం చేయొచ్చు. మలం గట్టిగా వచ్చినప్పుడు మలద్వారం వద్ద జిగురుపొరలు చీలిపోవచ్చు (ఫిషర్‌). ఇందులోనూ రక్తస్రావమవుతుంది. దీన్ని చాలామంది మొలలుగానూ పొరపడుతుంటారు. బ్యాక్టీరియా, అమీబా ఇన్‌ఫెక్షన్లతోనూ మలంలో రక్తం పడొచ్చు. వీటిల్లో సాధారణంగా నొప్పితో పాటు జ్వరమూ వస్తుంటుంది. పేగు పూత (ఐబీఎస్‌), పాలు పడకపోవటం, పెద్దపేగులో బుడిపెలు (పాలిప్స్‌) మూలంగానూ రక్తం పడొచ్చు.

నిర్ధరణ కచ్చితంగా: మలద్వారం నుంచి రక్తం పడుతుంటే నిర్లక్ష్యం చేయరాదు. డాక్టర్‌ను సంప్రదించి మొలలు అవునో కాదో కచ్చితంగా నిర్ధరణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలేవైనా ఉంటే బయటపడుతుంది. కొన్నిసార్లు పెద్దపేగు క్యాన్సర్‌లోనూ మలద్వారం నుంచి రక్తం పడుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.

మామూలువైతే..: మొలలు మామూలువైతే ఆహారం, జీవనశైలి మార్పులతోనే చాలావరకూ నయమవుతాయి. ముఖ్యంగా మల విసర్జన మృదువుగా, సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆహారంలో పీచు పదార్థం పెంచుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే మాంసం తగ్గించుకోవాలి. పెద్ద పాత్రలో గోరువెచ్చటి నీరు పోసి కాసేపు అందులో కూర్చోవటమూ మేలు చేస్తుంది. నొప్పి తెలియకుండా చేసే మలాములను విసర్జనకు ముందు, తర్వాత రాసుకోవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నా, ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా నొప్పి మాత్రలు, యాంటీబయాటిక్‌ మందులు అవసరమవుతాయి.
సమస్య తీవ్రమైతే, ఇతర చికిత్సలతో ఫలితం కనిపించకపోతే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లైగేషన్‌ వంటి రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

పిల్లల్లోనూ..: మొలలు పెద్దవారిలోనే ఎక్కువగా కనిపించినప్పటికీ పిల్లలకూ రావొచ్చు. మల విసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తినని పిల్లలకు వీటి ముప్పు ఎక్కువ. చాలామంది పిల్లలు రోజూ మల విసర్జన చేయరు. రెండు మూడు రోజులకోసారి వెళ్తుంటారు. దీంతో ముక్కటం మొదలెడతారు. ఇది మొలలకు దారితీస్తుంది.

నివారణ ముఖ్యం: మొలలు రాకుండా నివారించుకోవటం కష్టమేమీ కాదు. విరేచనం మృదువుగా, సాఫీగా అయ్యేలా చూసుకుంటే చాలు. విసర్జన సమయంలో బలంగా, గంటల కొద్దీ ప్రయత్నించొద్దు, ముక్కొదు. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలు రోజూ తినాలి. నీళ్లు తగినంత తాగటం చాలా ముఖ్యం. ఇప్పటికే మొలలతో బాధపడుతున్నవారికి, సర్జరీల వంటి చికిత్సలు చేయించుకున్నవారికి కూడా ఇలాంటి జీవనశైలి మార్పులు ఎంతగానో మేలు చేస్తాయి. మళ్లీ మొలల బారినపడకుండా కాపాడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని