గుండెను కోపగించుకోవద్దు!

గతంలో ఎదురైన చేదు అనుభవాలను తలచుకొని కోపం తెచ్చుకుంటున్నారా? అయితే వెంటనే మానుకోండి.

Published : 07 May 2024 00:17 IST

గతంలో ఎదురైన చేదు అనుభవాలను తలచుకొని కోపం తెచ్చుకుంటున్నారా? అయితే వెంటనే మానుకోండి. పాత ఘటనలను జ్ఞాపకం చేసుకొని కొద్దిసేపు కోపం తెచ్చుకున్నా రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం కుంటుపడుతున్నట్టు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. రక్తనాళాలు సరిగా వ్యాకోచించకపోతే పూడికలు ఏర్పడే ప్రమాదముందని.. ఇది గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరగటానికి దారితీయగలదని ఇంతకుముందే వెల్లడైంది. అందువల్ల అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తాజా అధ్యయనంలో కోపంతోపాటు విచారం, ఆందోళన ప్రభావాల మీదా దృష్టి సారించారు. కొందరికి కోపం తెప్పించిన ఘటనలు, ఇంకొందరికి ఆందోళనకు గురిచేసిన సంఘటనలు గుర్తు చేసుకోవాలని సూచించారు. మరికొందరికి విచారం కలిగించే వాక్యాలను చదవాలని లేదా భావో ద్వేగాలను తటస్థం చేయటానికి 100 వరకూ అంకెలను లెక్కించాలని చెప్పారు. ఈ పనులు చేయటానికి ముందూ.. ఆ తర్వాత చాలాసార్లూ రక్తనాళాల వ్యాకోచం, కణాలు దెబ్బతినటం, కణాల మరమ్మతు సామర్థ్యం లోపించటం వంటి వాటిని నిశితంగా గమనించారు. కోపం తెప్పించిన ఘటనలను గుర్తుచేసుకున్నవారిలో 40 నిమిషాల వరకూ రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం తగ్గినట్టు తేలింది. ఆందోళన, విచారం వంటి వాటితో గణనీయమైన తేడా ఏమీ కనిపించలేదు. కోపం మూలంగా రక్తనాళాల పనితీరు ఎందుకు మారిపోతోందనేది తెలుసుకుంటే కొత్త చికిత్సల రూపకల్పనకు అవకాశముంటుందని, గుండెపోటు ముప్పు అధికంగా గలవారికివి బాగా ఉపయోగ పడగలవని ఆశిస్తున్నారు. మందుల మాటెలా ఉన్నా గతం గతః అని సరిపెట్టుకొని, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గుండెను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని