కంటికి తీపి సెగ

మధుమేహం కళ్లనూ దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రెటీనా దెబ్బతినటం (డయాబెటిక్‌ రెటినోపతీ) మూలంగా ఎంతోమంది చిన్న వయసులోనే చూపు కోల్పోతుండటం విచారకరం.

Updated : 15 May 2024 19:05 IST

మధుమేహం కళ్లనూ దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రెటీనా దెబ్బతినటం (డయాబెటిక్‌ రెటినోపతీ) మూలంగా ఎంతోమంది చిన్న వయసులోనే చూపు కోల్పోతుండటం విచారకరం. మధుమేహం బారినపడ్డ దాదాపు అందరిలోనూ దీర్ఘకాలంలో ఎంతో కొంత రెటీనా దెబ్బతినటం కనిపిస్తుంటుంది. ఇది నెమ్మదిగా ముదురుతూ వచ్చే సమస్య. ఒకసారి రెటీనా దెబ్బతింటే దాన్ని సరిచేయటం కష్టం. కాబట్టి ఇది తలెత్తకుండా చూసుకోవటమే మంచిది.

కనుగుడ్డు వెనకాల సున్నితమైన పొరలా ఉండే రెటీనా మన చూపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కంట్లోకి వచ్చే కాంతిని విద్యుత్‌ సంకేతాలుగా మారుస్తుంది. వీటిని దృశ్యనాడి గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. మెదడు వాటిని దృశ్యాలుగా మార్చి చూపిస్తుంది. రెటీనాలో అతి సూక్ష్మమైన రక్తకేశ నాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగినప్పుడు ఇవి దెబ్బతింటాయి. ఫలితంగా రకరకాల సమస్యలు తలెత్తి చూపు మందగించే ప్రమాదం ఏర్పడుతుంది. మరోవైపు గ్లూకోజు రక్తంలోని హిమోగ్లోబిన్‌లోకీ చేరుకుంటుంది. దీంతో ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయవు. అప్పుడు రెటీనా పొరకు తగినంత ఆక్సిజన్‌ అందక దెబ్బతినటం మొదలవుతుంది.

 లక్షణాలేంటి?

 డయాబెటిక్‌ రెటినోపతీలో మొదట్లో ఎలాంటి లక్షణాలూ ఉండవు. ముదురుతున్నకొద్దీ అక్షరాలు వంకరగా కనిపించటం, పక్కపదం కనిపించకపోవటం వంటివి పొడసూపుతాయి. నిజానికి ఈ లక్షణాలు మొదలయ్యే సరికే లోపల సమస్య తీవ్రమై ఉంటుందని గుర్తించాలి. అప్పటికీ జాగ్రత్త పడకపోతే చూపు పూర్తిగా పోయే పరిస్థితి తలెత్తొచ్చు. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు చూపులో ఎలాంటి తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. విధిగా రెటీనా పరీక్ష చేయించుకోవాలి.

రెండు దశల్లో..

డయాబెటిక్‌ రెటీనోపతీని రెండు దశలుగా చూడొచ్చు. తొలిదశలో రెటీనా పొర మీదుండే రక్తకేశ నాళికల గోడలు దెబ్బతిని, ఉబ్బుతాయి. అక్కడ రక్తంలోని కొవ్వులు, ద్రవాలు లీక్‌ అవుతాయి. ఈ దశలో చూపు నెమ్మదిగా మందగిస్తూ వస్తుంటుంది. తర్వాతి దశలో రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవచ్చు. దీంతో వాటిని భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తుంటాయి. వీటి నుంచి రక్తం స్రవించి పొర మీదికి చేరుకోవచ్చు. ఈ దశలో హఠాత్తుగా చూపు పోవటం గమనార్హం.

నిర్ధరణ ఎలా?

ఫండస్‌ ఎగ్జామినేషన్‌తో రెటీనా పొరను చూడటం ద్వారా సమస్యను గుర్తించొచ్చు. స్లిట్‌ల్యాంప్‌లో కటకాల సాయంతోనూ కంటి పాపను పెద్దదిగా చేసి చూడొచ్చు. దీంతో రెటీనా మధ్యభాగంలో ఉన్న సమస్యలు బయటపడతాయి. మధుమేహంతో బాధపడేవారు వీటిని తరచూ చేయించుకుంటే రెటీనా దెబ్బతినటాన్ని ముందే పసిగట్టొచ్చు.

  •  రెటీనా మీది రక్తనాళాలు ఉబ్బినవారికి ఫ్లోరోసిస్‌ యాంజియోగ్రఫీ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇందులో మోచేతి వద్ద రక్తనాళం నుంచి రంగు పదార్థాన్ని ఎక్కించి, అది కంటికి చేరుకున్నాక రెటీనాను ఫొటోలు తీస్తారు. దీంతో కేశరక్తనాళాల తీరుతెన్నులు తెలుస్తాయి. జబ్బు తీవ్రతా బయటపడుతుంది.
  • రెటీనా మధ్యభాగంలో వాపు, నీరు వంటివి తెలుసుకోవటానికి ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టొమోగ్రఫీ పరీక్ష తోడ్పడుతుంది.

చికిత్స రకరకాలు

రెటీనా పొర మీద వాపు, రక్తం లీక్‌ కావటం వంటివి లేకపోతే గ్లూకోజును నియంత్రణలో ఉంచుకుంటే చాలు. ప్రత్యేకంగా చికిత్సల అవసరమేమీ ఉండదు. కానీ సూక్ష్మ రక్తనాళాలు ఉబ్బటం.. వీటిల్లోంచి ద్రవాలు, కొవ్వులు లీకవటం వంటివి ఉంటే తప్పకుండా చికిత్స తీసుకోవాలి. లేజర్‌ చికిత్సతో లీకవుతున్న రక్తనాళం భాగాన్ని మూసేసే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా ఆక్సిజన్‌ తగ్గినచోటును గుర్తించి, లేజర్‌తో దాన్ని మాడ్చేయటమూ మేలు చేస్తుంది. పోయిన చూపు వీటితో తిరిగి రాకపోవచ్చు గానీ మున్ముందు చూపు మరింత తగ్గకుండా చూసుకోవచ్చు. కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా యాంటీ వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెటీనా నుంచి రక్తస్రావమై, అది కనుగుడ్డులోని ద్రవంలో గడ్డ కట్టినట్టయితే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది.

తస్మాత్‌ జాగ్రత్త

గమనించాల్సిన విషయం ఏంటంటే- రెటీనోపతీకి చేసే చికిత్సలన్నీ సమస్య మరింత ముదరకుండా చూసేవే గానీ పోయిన చూపును తిరిగి తెచ్చి పెట్టేవి కావు. మధుమేహం అలాగే కొనసాగుతూ రావటం వల్ల చికిత్స చేసిన చోట కాకుండా మరో చోట సమస్య ఆరంభం కావొచ్చు. అది ఇంకాస్త తీవ్రంగానూ ఉండొచ్చు. కాబట్టి మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవటం చాలా చాలా ముఖ్యం. తరచూ కంటి పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. మధుమేహం పూర్తిగా నయమయ్యేది కాదు కాబట్టి జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించాలి.


ముప్పు ఎవరికి?

దీర్ఘకాలంగా మధుమేహం గలవారికి, గ్లూకోజు నియంత్రణలో లేనివారికి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. సాధారణంగా మధుమేహం వచ్చిన పదేళ్ల తర్వాత దాని దుష్ప్రభావాలు మొదలవుతుంటాయి. కానీ గ్లూకోజు నియంత్రణలో లేకపోతే చాలా ముందుగానే ఇవి ఆరంభమవుతాయి. చిన్న వయసులోనే చూపు పోతే ఉద్యోగాలు, పనులు చేసుకోవటం కష్టమైపోతుంది. కుటుంబం మీద ఆర్థికంగా భారం పడుతుంది. కాబట్టి డయాబెటిక్‌ రెటీనోపతీని నిర్లక్ష్యం చేయటం తగదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు