గురకతో మూర్ఛ!

మూర్ఛ చాలావరకూ చిన్న వయసులోనే మొదలవు తుంటుంది. కానీ ఇది జీవితంలో ఎప్పుడైనా తలెత్తొచ్చు. కొందరికి 60 ఏళ్ల తర్వాతా తొలిసారిగా వస్తుంటుంది.

Published : 14 May 2024 00:09 IST

మూర్ఛ చాలావరకూ చిన్న వయసులోనే మొదలవు తుంటుంది. కానీ ఇది జీవితంలో ఎప్పుడైనా తలెత్తొచ్చు. కొందరికి 60 ఏళ్ల తర్వాతా తొలిసారిగా వస్తుంటుంది. అందుకే దీన్ని ఆలస్యంగా మొదలయ్యే మూర్ఛగా భావిస్తుంటారు. పక్షవాతం, అధిక రక్తపోటు, మెదడులో కణితి వంటి రకరకాల అంశాలు దీనికి దోహదం చేస్తుంటాయి. అయితే గురకనూ తక్కువగా తీసుకోవటానికి వీల్లేదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. అరవై ఏళ్ల తర్వాత తొలిసారి మూర్ఛ రావటానికీ.. నిద్ర పోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆడకపోవటం (స్లీప్‌ అప్నియా), రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు తేలటమే దీనికి కారణం. నిద్రలో కొందరికి గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుతగులుతుంది. దీంతో శ్వాస ఆగుతుంది. అప్పుడు రక్తంలో ఆక్సిజన్‌ తగ్గటం వల్ల ఉక్కిరిబిక్కిరై బిగ్గరగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటుంటారు. నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ విషయం మనకు తెలియదు. కానీ రాత్రంతా చాలాసార్లు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. వృద్ధాప్యంలో మూర్ఛకూ కారణమవుతున్నట్టు ఇప్పుడు బయటపడింది. నిద్ర పోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగిపోయేవారికి రెండింతలు ముప్పు పెరుగుతున్నట్టు వెల్లడైంది. అదే రక్తంలో ఆక్సిజన్‌ 80% కన్నా తక్కువకు పడిపోయిన వారికైతే మూడింతలు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటున్నట్టు తేలింది. దీర్ఘకాలంగా నిద్రలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతూ వస్తుంటే మెదడులో మార్పులు తలెత్తే అవకాశముందని, ఇది మూర్ఛ ముప్పు పెరిగేలా చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. స్లీప్‌ అప్నియా చికిత్స లేదా నివారణతో మూర్ఛ వచ్చే అవకాశం తగ్గుతుందో లేదో అనేది అధ్యయనంలో నిర్ధరణ కాలేదు. కానీ మూర్ఛ ముప్పును తగ్గించుకోవటానికి దీన్ని ముఖ్యమైన అంశంగా పరిగణించొచ్చని సూచిస్తోంది. నిద్ర సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే మూర్ఛకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడ గలవని.. మెరుగైన చికిత్సల రూపకల్పనకు దారి తీయగలవని ఆశిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరంభమయ్యే మూర్ఛ సమస్య ఇటీవల ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు కల్పిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు