కాన్పయ్యాక జుట్టూడటమా?

బిడ్డ ఆలనలో పాలనలో తల్లి గడిపే ప్రతి క్షణమూ మధురానుభూతే. బిడ్డ కేరింతలు కొడుతుంటే ఇల్లంతా సంతోష సాగరంలో తేలియాడుతుంది. ఒకపక్క ఇలాంటి ఆనందానుభూతులు మనసును ఉక్కిరిబిక్కిరి చేసే మాట నిజమే అయినా మరోపక్క తల్లికి కాసింత ...

Published : 06 Mar 2018 01:13 IST

కాన్పయ్యాక జుట్టూడటమా?

బిడ్డ ఆలనలో పాలనలో తల్లి గడిపే ప్రతి క్షణమూ మధురానుభూతే. బిడ్డ కేరింతలు కొడుతుంటే ఇల్లంతా సంతోష సాగరంలో తేలియాడుతుంది. ఒకపక్క ఇలాంటి ఆనందానుభూతులు మనసును ఉక్కిరిబిక్కిరి చేసే మాట నిజమే అయినా మరోపక్క తల్లికి కాసింత విచారాన్ని కలిగించే అంశాలు ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు. ముఖ్యంగా పట్టుకుచ్చులాంటి జుట్టు రోజురోజుకీ ఊడిపోతుంటే కలుక్కుమనిపించదూ? నిజమే.. ప్రసవం తర్వాత కొన్ని నెలల పాటు తల్లికి జుట్టు ఊడిపోవటమనేది సహజమే. దీనికి కారణం గర్భధారణ సమయంలో ఒంట్లో పెరిగిన ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్ల స్థాయులతో పాటు రక్తం పరిమాణం కూడా తగ్గిపోవటమే. సాధారణంగా వెంట్రుకల్లో 85-95% వేగంగా ఎదిగే దశలో ఉంటాయి. మిగతావి విశ్రాంతి దశలో ఉండిపోతుంటాయి. విశ్రాంతి దశ తర్వాత ఈ వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తుంటుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల వెంట్రుకలు చాలాకాలం ఎదిగేదశలోనే కొనసాగుతాయి. పైగా రక్తప్రసరణ ఎక్కువగా జరగటం వల్ల జుట్టుకు పోషకాలు కూడా దండిగానే లభిస్తాయి. అందువల్ల వెంట్రుకలు ఊడిపోవటమనేది తక్కువ. అయితే కాన్పు తర్వాత హార్మోన్ల స్థాయులు తగ్గటం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవటం మొదలవుతుంది. దీనికి పెద్దగా గాబరా పడిపోవాల్సిన పనేమీ లేదు. ఐదారు నెలల తర్వాత జుట్టు తిరిగి సాధారణ స్థాయికి వచ్చేస్తుంటుంది. కానీ కొందరిలో కొందరికి కుచ్చులుకుచ్చులుగానూ ఊడివస్తుంటుంది. పైగా ఎక్కువకాలమూ కొనసాగుతుంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
* జుట్టును నెమ్మదిగా, మృదువుగా దువ్వుకోవటానికి ప్రయత్నించాలి. చిక్కులు పడినప్పుడు గట్టిగా దువ్వితే మరింత ఎక్కువగా రాలిపోవటానికి అవకాశముంది. రోజుకు ఒకటి కన్నా ఎక్కువసార్లు దువ్వకుండా చూసుకోవట మేలు. అలాగే జుట్టు ఆరబెట్టుకోవటానికి, వంకర్లు తిప్పటానికి డ్రయర్లు లేదా కర్లింగ్‌ ఐరన్‌ వంటివి వాడటం మానెయ్యాలి.
* ఆకుకూరలు, క్యారట్లు, చిలగడదుంప, గుడ్లు, చేపల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లోని విటమిన్లు, ఒమేగా కొవ్వు ఆమ్లాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.
* జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ఆయుర్వేద ఔషధాలతో కూడిన తైలాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు నిగనిగలాడుతూ కనిపించేలా కూడా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని