అలసట ‘కణాలు’!

తీవ్రమైన అలసట, నిస్సత్తువ, రోజువారీ పనులు పూర్తిచేయలేకపోవటం. ఇలాంటివి తరచుగా చూస్తూనే ఉంటాం. ఇవి వృద్ధుల్లో, మహిళల్లో మరి కాస్త ఎక్కువగా కనబడుతుంటాయి. కొందరికి పగటిపూట మత్తుగానూ అనిపిస్తుంటుంది.

Published : 03 Apr 2018 01:46 IST

అలసట ‘కణాలు’!

తీవ్రమైన అలసట, నిస్సత్తువ, రోజువారీ పనులు పూర్తిచేయలేకపోవటం. ఇలాంటివి తరచుగా చూస్తూనే ఉంటాం. ఇవి  వృద్ధుల్లో, మహిళల్లో మరి కాస్త ఎక్కువగా కనబడుతుంటాయి. కొందరికి పగటిపూట మత్తుగానూ అనిపిస్తుంటుంది. ఇదమిత్థమైన కారణమేదీ లేని ఈ రకం అలసటను తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. వయసుతో పాటు వచ్చేదని అనుకోవటానికి లేదు. కుంగుబాటు వంటి మానసిక సమస్యలు కూడా ఇందుకు దోహదం చేస్తుండొచ్చు. కొద్దిమందిలో తేలికపాటి ఫ్లూ కూడా నెలల పాటు వేధించే నిస్సత్తువకు దారితీయొచ్చు. ఇలాంటిది 40-60 ఏళ్ల వారిలో.. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. చాలాకాలం వరకూ వైద్యరంగం పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇప్పుడు దీన్ని ‘క్రానిక్‌ ఫేటిగ్‌ సిండ్రోమ్‌’గా గుర్తించింది. దీర్ఘకాలం.. అంటే 6 నెలలు, అంతకన్నా ఎక్కువకాలంగా విడవకుండా వేధించే నిస్సత్తువ అన్నమాట. కాస్త పనిచేసినా దీని లక్షణాలు ఉద్ధృతమవుతుంటాయి. ఒకింత ఎక్కువసేపు పడుకున్నా కూడా ఇవి తగ్గవు. ఎరుపు, వాపు వంటివేవీ లేకపోయినా కండరాలు, కీళ్లు నొప్పి పెడుతుంటాయి. కొందరిలో తలనొప్పి, లింఫ్‌ గ్రంథుల వాపూ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలకు రోగనిరోధకవ్యవస్థ పనితీరు గతి తప్పటమేనని ఇప్పుడిప్పుడు పరిశోధకులు భావిస్తున్నారు. చాలాసార్లు ఇది తేలికపాటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తర్వాతే మొదలవుతుంటుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి అవసరమైన సైటోకైన్లనే టి కణాలు అస్తవ్యస్తంగా పనిచేయటమే ఇందుకు కారణం. దీర్ఘకాల నిస్సత్తువ అంత త్వరగా తగ్గేదేమీ కాదు. కొందరిలో ఏడాది కూడా పట్టొచ్చు. దీనికి ఆయా వ్యక్తులను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే నొప్పి, ఆందోళన, కుంగుబాటు వంటి వాటికీ మందులు తీసుకోవాల్సి రావొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, విటమిన్‌ మాత్రలు, నిద్ర సరిగా పట్టేలా చూసుకోవటం వంటివీ ఉపయోగపడతాయి. అలాగే వ్యాయామం కూడా ఎంతో మేలు చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని