SS Rajamouli: ఎప్పటికైనా పూర్తి యానిమేషన్‌ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి

ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

Published : 08 May 2024 00:03 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ ప్రపంచాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో యానిమేషన్‌ సిరీస్‌ను తీసుకొస్తున్నామని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) అన్నారు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌’ (Baahubali: Crown of Blood) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా మే 17వ తేదీ నుంచి ఈ యానిమేషన్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈక్రమంలో హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళితో పాటు, నిర్మాత శోభు యార్లగడ్డ, హెడ్‌ కంటెంట్‌ డిస్నీ+హాట్‌ స్టార్‌ గౌరవ్‌ బెనర్జీ, గ్రాఫిక్‌ ఇండియా సీఈవో శరత్‌ దేవరాజన్‌, నటుడు శరద్‌ ఖేల్కర్‌లు పాల్గొన్నారు.

అందరినీ అలరిస్తుంది..

ఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. యానిమేషన్‌ సిరీస్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘బాహుబలి’ని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను వేరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలి ప్రపంచాన్ని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్‌ మాకు దొరికింది. యానిమేషన్‌ సిరీస్‌ గురించి వాళ్లు మాతో పంచుకున్న ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. పిల్లలనే కాదు, అందరినీ అలరించేలా యానిమేషన్‌ సిరీస్‌ తీయొచ్చని వివరించారు. ఈ ఫార్మాట్‌లో సిరీస్‌ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి’ మొత్తాన్ని సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలను పరిశీలించాం. బాహుబలి ప్రపంచాన్ని వేరే వేదిక ద్వారా తీసుకొస్తున్నప్పుడు కథను ఎన్ని రకాలుగానైనా రాయొచ్చు. కానీ, ఆత్మ మాత్రం చెడిపోకుండా చూడాలి. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. స్టోరీ, పాత్రలు చాలా చక్కగా క్రియేట్‌ చేశారు. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది’’

థియేటర్‌లో ‘బాహుబలి’ చూసింది 10 కోట్ల మందే!

‘‘బాహుబలి’ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే, 120 కోట్ల మంది సినిమాలు చూస్తారనుకుందాం. కానీ, బాహుబలిని థియేటర్‌లో చూసింది దాదాపు 10 కోట్ల మంది మాత్రమే. అంటే 10 కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దానర్థం 110 కోట్ల మంది థియేటర్‌లో చూడలేదు. బహుశా, టెలివిజన్‌, ఓటీటీలో చూసి ఉంటారు. ప్రతిఒక్కరూ సినిమాను ఏదో ఒక మాధ్యమం ద్వారా చూస్తారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా నచ్చుతుంది. అందరూ రెగ్యులర్‌ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్‌ మూవీలను మాత్రమే ఆస్వాదించేవాళ్లూ ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. డైలాగ్స్‌, ఫైట్స్‌, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్‌లో అది వర్కవుట్‌ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్‌ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతారు. ముఖ్యంగా బాహుబలి, కట్టప్ప పోటీ పడే సీన్స్‌ అలరిస్తాయి. ఇది బాహుబలి ప్రీక్వెల్‌ కాదు. సీక్వెల్‌ కాదు. బాహుబలి కథ మధ్యలో ఏం జరిగిందా? అన్నది మీరు చూస్తారు. సినిమాలో కొన్ని చోట్ల కథను పెంచే అవకాశం ఉంటుంది. కానీ, నిడివి, ఇతర కారణాల వల్ల అది తెరపై చూపించలేం. ఆ మధ్యలో ఏం జరిగిందా? అన్న దానిని ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’లో చూపించబోతున్నాం’’

వాళ్లూ ధోనీ అభిమానులై ఉంటారు

‘‘యానిమేషన్‌ సిరీస్‌లో ‘బాహుబలి’ పాత్రలో ధోనీ పోలికలు కనిపిస్తున్నాయని అన్నారు. అది కావాలని చేయలేదు. క్రియేట్‌ చేసిన వాళ్లు నాలాగా ధోనీ అభిమానులై ఉంటారు (నవ్వులు) మన కథ మరింత ముందుకు వెళ్లాంటే, దానిపై మనకున్న ఈగోను, ప్రేమను తగ్గించుకోవాలి. అన్నీ మనమే చేయలేం కదా. అందుకే ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. డబ్బింగ్‌, దర్శకత్వం, కథా రచనను క్రియేటర్స్‌ సృజన మేరకు వదిలేయాలి. కథలోని ఆత్మ తప్ప ఇతర విషయాలను పట్టించుకోకూడదు’’

పూర్తి యానిమేషన్‌ మూవీ చేయాలని ఉంది

‘‘హాలీవుడ్‌ దర్శకుల్లా నాకూ యానిమేషన్‌ మూవీ చేయాలని ఉంది. ‘ఈగ’ అందులోని భాగమే. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్‌ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయి. నన్ను నేను ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో చూపుకోను. అలాగే తక్కువ చేసి చూసుకోను. నా నుంచి ఒక ప్రాజెక్ట్‌ వస్తుందంటే, అందరూ దానికోసమే ఎదురుచూస్తున్నారని నేను భావించను. అదే సమయంలో నా సినిమా కోసం ఎవరు ఎదురు చూస్తారు? అని అనుకోను. నేను చేయబోయే ఏ ప్రాజెక్ట్‌ అయినా, కొత్త ఆడియన్స్‌కు ఎలా దగ్గర చేయాలా? అన్నది ఆలోచిస్తా. ‘బాహుబలి’ విషయంలో ఇలాగే ఆలోచించాం. ఆ సినిమా ప్రచారానికి కొత్త మార్గాలను అన్వేషించాం. డిజిటల్‌ పోస్టర్లు, పాత్రల పరిచయం, మేకింగ్‌ వీడియోలు ఇలా ప్రతీ మార్గంలోనూ ప్రయాణించాం. ఇప్పుడు కూడా యానిమేషన్‌తో వస్తున్నాం. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తాం’’   అని రాజమౌళి అన్నారు.

ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన బాహుబలి పాత్రలతో యానిమేషన్‌ సిరీస్‌ చేయడం చాలా రిస్క్‌ అయినా, ‘ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌’ ఇచ్చిన ధైర్యంతో కథలను చెప్పేందుకు కొత్త వేదికను తీసుకొచ్చామని గ్రాఫిక్‌ ఇండియా సీఈవో శరత్‌ దేవ రాజన్‌ అన్నారు. ‘‘బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. వాటిలో సినిమా ఒక భాగం మాత్రమే. గేమ్స్‌, బుక్స్‌, యానిమేషన్‌ ఇలా చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. పెద్దలకూ నచ్చేలా యానిమేషన్‌ చిత్రాలను బాహుబలి ఫిల్మ్స్‌ను తీసుకొస్తున్నాం. డిస్నీ+హాట్‌స్టార్‌ ఇందులో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు నిర్మాత శోభూ యార్లగడ్డ, హిందీలో ‘బాహుబలి’ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం చాలా సంతోషంగా ఉందని నటుడు శరత్‌ ఖేల్కర్‌ సంతోషం వ్యక్తంచేశారు. భారతీయ కథలు యానిమేషన్‌ చేయడం ఒక విప్లవాత్మక మార్పు అని హెడ్‌ కంటెంట్‌ డిస్నీ+హాట్‌ స్టార్‌ గౌరవ్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు