చిగురంత ఆశ!

అల్జీమర్స్‌, డిమెన్షియా.. ఈ పేర్లు వింటేనే వృద్ధ ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఎందుకంటే ఇవి మన జ్ఞాపకాలన్నింటినీ ఒక్కొక్కటిగా తుడిచేసి.. ఆత్మీయులను సైతం గుర్తుపట్టలేనంతగా మార్చేసి.. చివరికి మనం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలోకి నెట్టేస్తాయి. వీటితో మరో...

Published : 19 Sep 2017 02:11 IST

ఎల్లుండి ప్రపంచ అల్జీమర్స్‌ దినం
చిగురంత ఆశ!


నిషంటేనే జ్ఞాపకాల గని. మనం మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు.. ఒక్కటేమిటి చేసే పనులన్నీ జ్ఞాపకాలతో ముడిపడినవే. ఇవి తుడిచిపెట్టుకుపోతే మనిషి ఉన్నా లేనట్టే. ఏదీ గుర్తుండదు. ఎవరినీ పోల్చుకోలేం. చివరికి మనల్ని మనమే మరచిపోతాం! డిమెన్షియా, అల్జీమర్స్‌ సరిగ్గా ఈ జ్ఞాపకాల మీదే దాడి చేస్తాయి. మన ఆలోచన, ప్రవర్తనలనూ దెబ్బతీస్తాయి. రోజువారీ పనులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. డిమెన్షియా రకాల్లో తరచుగా కనబడేది అల్జీమర్సే. ఇది సాధారణంగా 65 ఏళ్ల తర్వాత వస్తుంటుంది. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు దీని ముప్పు రెట్టింపు అవుతుంది. అయితే ఇది చిన్న వయసులోనూ రావొచ్చు. మనదేశంలో సుమారు 41 లక్షల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారని అంచనా. వీరిని చాలావరకు కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. అవసరమైన పనులన్నీ వారే చూసుకుంటున్నారు. దీంతో కనిపెట్టుకునేవారిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. విపరీత భావోద్వేగాలకూ దారితీస్తోంది. ఇది కేవలం మానసికంగానే కాదు.. శారీరకంగా, ఆర్థికంగానూ కుంగదీస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా- బాధితులకు మనం సరైన సంరక్షణ ఇస్తున్నామా? లేదా? ఇంతకంటే మంచి సరంక్షణ కోసం ఏం చేయొచ్చన్న సంశయం, ఆందోళన నిరంతరం వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సంరక్షణలో డిమెన్షియా బాధితులను కనిపెట్టుకుని చూసే కేంద్రాల అవసరం పెరుగుతోంది. దీంతో కుటుంబసభ్యులు కొంత నిశ్చింతగా ఉండటంతో పాటు రోజులో కొంత సేపయినా తమ పనులు చేసుకోవటానికి వెసులుబాటు లభిస్తుంది.
అల్జీమర్స్‌ సంకేతాలు
* రోజూ చేసే పనుల విషయంలోనూ తడబడి పోతుండటం, మతిమరుపు
* నిర్ణయాలను తీసుకోవటంలో ఇబ్బంది పడటం
* సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కొరవడటం
* చేయాల్సిన పనులను విడమరచుకోలేకపోవటం
* ఆఫీసులో, ఇంట్లో పనులను పూర్తి చేయలేకపోవటం
* ప్రాంతాలను, సమయాన్ని గుర్తించటంలో తికమక
* మాట్లాడటంలో, రాయటంలో పదాల కోసం వెతుక్కోవటం
* పనిపై ఆసక్తి తగ్గటం, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం
* మూడ్‌, వ్యక్తిత్వం మారిపోవటం


పెద్దవాళ్ల ప్లే స్కూల్‌!

డిమెన్షియా డే కేర్‌ సెంటర్‌ను ఒకరకంగా పెద్దవాళ్ల ‘ప్లే స్కూల్‌’ అని అనుకోవచ్చు. ప్లే స్కూల్‌లో పిల్లల మానసిక వికాసానికి ఆటబొమ్మలు.. అక్షరాలు, బొమ్మలతో కూడిన చిన్న చిన్న పజిల్స్‌ చేతికిస్తుంటారు కదా. డిమెన్షియా కేంద్రంలోనూ ఇలాంటివే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొత్త విద్యలు నేర్వటానికి కాదు- ఉన్న విద్యలు పోకుండా కాపాడటానికి. డిమెన్షియాను నయం చేసే చికిత్సలేవీ లేవు. దాన్ని ముదరకుండా చూసుకోవటం ఒక్కటే మనం చేయగలిగింది. ఇందుకు పజిల్స్‌ వంటివి తోడ్పడతాయి. వీటితో జ్ఞాపకశక్తి మరింత తగ్గిపోకుండా చూసుకోవచ్చు. జబ్బు ముదరటాన్ని నెమ్మదింప జేసుకోవచ్చు. ఈ కేంద్రంలో చేర్చుకోవటానికి ముందు జ్ఞాపకశక్తి తీరుతెన్నులను తెలుసుకోవటానికి చిన్న పరీక్ష పెడతారు. పెన్ను, కాగితం చేతికిచ్చి కొన్ని పదాలను రాయమంటారు. చెప్పిన పదాన్ని వెంటనే రాస్తున్నారా లేదా? స్వల్పకాలిక జ్ఞాపకశక్తి, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఎలా ఉన్నాయి? అనేవి అంచనా వేస్తారు. దీని ఆధారంగా ఎవరికి ఎలాంటి పద్ధతులు ఉపయోగపడతాయో నిర్ణయిస్తారు. డిమెన్షియా స్వల్పంగా ఉన్నవారితో కాస్త క్లిష్టమైన పనులు, తీవ్రంగా ఉంటే తేలికైన పనులను చేయిస్తారు.
తేలికపాటి వ్యాయామం: అల్జీమర్స్‌ బాధితులకు కండరాలు క్షీణిస్తుంటాయి. అవయవాల, కండరాల కదలికల్లో సమన్వయమూ లోపిస్తుంది. అందువల్ల కండరాల పనితీరు బాగుండేందుకు సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు చేయిస్తారు. అలాగే శరీరం కుదురుగా ఉండేందుకు అటూఇటూ పట్టుకొని నడిచేందుకు వీలైన గొట్టాలు ఏర్పాటుచేసి వాటి మధ్య నడిపిస్తారు. పాదాలు తడబడకుండా మధ్యలో కాస్త ఎత్తయిన పలక సైతం ఉంటుంది. దీంతో తూలి పడిపోయే ముప్పు తగ్గుతుంది.
ఆకృతుల అమరిక: డిమెన్షియా బాధితులు ఆకారాలను గుర్తించటంలో తికమకపడుతుంటారు. అందువల్ల వీరికి త్రికోణం, చతురస్రం, దీర్ఘచతురస్రం వంటి ఆకారాలను ఇచ్చి వాటిని ఒక క్రమంలో అమర్చాలని చెబుతారు. అలాగే జంతువులు, వస్తువుల బొమ్మలను చూపించి వాటి పేర్లను పలికిస్తారు. శరీర భాగాల బొమ్మలను చూపిస్తూ.. ముక్కు, చెవులు, పెదాల వంటి వాటిని తాకిస్తారు. ఇవి జ్ఞాపకశక్తి మరింత తగ్గకుండా చూస్తాయి.
ప్రత్యేక గడియారం: ఇది సమయాన్ని గుర్తించటానికి తోడ్పడుతుంది. ఇందులో 1-12 వరకు అంకెలే కాదు.. ఏ అంకె ఎన్ని నిమిషాలు సూచిస్తుందో కూడా రాసి ఉంటుంది. దీంతో ఎన్ని గంటల ఎన్ని నిమిషాలనేది సులువుగా గుర్తించటానికి వీలవుతుంది. డిమెన్షియా స్వల్పంగా ఉండి.. టైమ్‌ చూసుకోవటం మరిచిపోయినా కూడా దీంతో తిరిగి మెరుగవ్వొచ్చు.
పూసల దండ: కొందరు ఎప్పుడూ చేతులను కదుపుతుండటం, దుస్తులను నలపుతుండటం వంటివి చేస్తుంటారు. వీరికి పూసలను గుది గుచ్చటం వంటి పనులతో మంచి ఉపశమనం కలుగుతుంది. అనివార్యంగా చేసే పనుల నుంచి దృష్టి మళ్లుతుంది. అలాగే బంతిని విసురుతూ.. దాన్ని పట్టుకోవాలని చెబుతారు. ఇది బంతి ఎంత దూరం నుంచి వస్తోంది? ఎంత వేగంతో వస్తోంది? చేతులను ఎక్కడ పెడితే పట్టుకోవచ్చు? అనే అంశాలను మనసులో గణించుకునే సామర్థ్యం పెరుగుతుంది.
మెట్ల వ్యాయామం: డిమెన్షియా తీవ్రమైతే ఎత్తును సరిగా గుర్తించలేరు. దీంతో మెట్లు ఎక్కాలంటేనే చాలా భయపడిపోతుంటారు. అందుకని వీరికి మెట్లు ఎక్కటంలో తర్ఫీదు ఇస్తారు. ఈ మెట్లు కూడా కొన్ని తక్కువ, ఎక్కువ ఎత్తులో ఉంటాయి. దీంతో ఎత్తును సరిగా గుర్తించి, అడుగు వేయటం సాధ్యమవుతుంది. కనీసం ఈ భయం రాకుండానైనా ఉంటుంది.
పాటలు: కొందరికి సంగీతంతోనూ మంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఇష్టమైన పాటలు వినిపించటం, అప్పుడప్పుడు సినిమాలు చూపించటం వంటివీ చేస్తారు.
రిపోర్టులు: డిమెన్షియాకు చికిత్స తీసుకుంటుంటే.. వారి పరిస్థితిపై డాక్టర్లకు రిపోర్టులు కూడా ఇస్తారు. మాట్లాడటం, ముద్ద మింగటంలో ఇబ్బందులు పడేవారికి చికిత్స చేయటానికి స్పీచ్‌ థెరపిస్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్టు వంటి నిపుణులూ అందుబాటులో ఉంటారు.


అమ్మ వేదన వర్ణనాతీతం

బాధను తనలో దాచుకోవటమే కాదు.. తనలా మరెవరూ బాధపడకూడదని కోరుకుంటే? దాన్ని సానుభూతి.. మంచితనం.. నిస్వార్థం.. ఇలా రకరకాలుగా పిలుచుకోవచ్చు. అవన్నీ అకున్‌ సబర్వాల్‌కు అతికినట్టు సరిపోతాయి. అల్జీమర్స్‌తో కన్నతల్లి ఆరోగ్యం దినదినం దిగజారిపోతుంటే.. ఆయన మనసు తల్లడిల్లిపోయింది. ఆమెకు సపర్యలు చేయటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతలో తండ్రి కూరుకుపోతుంటే బాధతో విలవిల్లాడిపోయింది. అంతటి విపత్కర పరిస్థితిలోనూ ఆయన ఆలోచించింది ఒక్కటే. తమలాగా మరెవరూ బాధపడకూడదని. తన తల్లిలాంటివారిని జాగ్రత్తగా కనిపెట్టుకునే ఏర్పాటు గురించే. ఆ ఆలోచన ఫలితమే హైదరాబాద్‌లో ఆరంభమైన ‘రెడ్‌క్రాస్‌-నైటింగేల్స్‌ ట్రస్ట్‌ డిమెన్షియా డే కేర్‌ సెంటర్‌’. తన తల్లి పడ్డ వేదన, ఆమెతోనే ముడిపడిపోయిన తన తండ్రి జీవితం, కేంద్రం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు.. అన్నీ ఆయన మాటల్లోనే..
మా పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నాం. అమ్మా నాన్న పంజాబ్‌లోనే ఉంటున్నారు. వాళ్లకు బోలెడంత సమయం లభించింది. ముప్పయి ఏళ్ల వారి దాంపత్య జీవితం మరింత అన్యోన్యంగా, హాయిగా సాగుతుందని ఆనందిస్తున్న తరుణంలో మా ఇంట్లో ‘అల్జీమర్స్‌’ అలజడి మొదలైంది. నేను వైజాగ్‌లో ఎస్పీగా పని చేస్తున్న సమయంలో ఫోన్‌ చేసినప్పుడల్లా అమ్మ వంటల్లో చక్కెరకు బదులు ఉప్పు వేస్తోందని, వస్తువులు ఎక్కడో పెట్టి మరచిపోతోందని నాన్న చెబుతుండేవారు. పరీక్ష చేయిస్తే అల్జీమర్స్‌ లక్షణాలు మొదలైనట్టు బయటపడింది. ఒక ప్రముఖ పాఠశాలలో 11, 12 తరగతి విద్యార్థులకు చరిత్ర పాఠాలు బోధించే అమ్మ పరిస్థితి అప్పట్నుంచీ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఉదయం పూట నడకకు వెళ్లినపుడు నేరుగా ఇంటికి తిరిగి వచ్చేది కాదు. ఇతరుల ఇళ్లకు వెళ్తుండేది. ఎందుకు వెళ్లావంటే ‘నీళ్ల కోసం’ అని కప్పి పుచ్చటానికి ప్రయత్నించేది. ఇంట్లోనూ గాజుల వంటివి ఎక్కడో పెట్టి మరచిపోయేది. ఏమిటంటే- కోడలు స్మిత ఇంటికి వచ్చినపుడు ఇద్దామని జాగ్రత్తగా దాచానులెమ్మని చెబుతుండేది. నాన్నగారు ఇచ్చిన డబ్బులనూ ఎక్కడో పెట్టి గుర్తుకు రాక సతమతమయ్యేది. అప్పుడే ఇచ్చేశాను కదా అనీ అంటుండేది. ఇలా అమ్మకు మతిమరుపు లక్షణాలు మొదలయ్యాయి. అప్పటికి ఆమె వయసు 55 ఏళ్లు. జ్ఞాపకశక్తి తగ్గుతున్న కొద్దీ నోట్‌ పుస్తకాలు దిద్దటంలో తడబడటం ఎక్కువైంది. చెప్పాల్సిన పాఠాలు మరచిపోతుండటంతో చిన్న తరగతులకు బోధించటం ఆరంభించారు. తర్వాత అమ్మను నా దగ్గరే ఉంచుకుందామని వైజాగ్‌కు తీసుకొచ్చాను. దగ్గర్లోని ఆసుపత్రిలో చూపించాం. అప్పటికి అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండేది. తన పనులు తాను చేసుకునేది. కానీ రాన్రానూ జ్ఞాపకాలన్నీ క్షీణిస్తూ వచ్చాయి.


చాలామంది తమ ఇంట్లో ఎవరికైనా అల్జీమర్స్‌ లక్షణాలున్నా బయటకు చెప్పుకోవటానికి జంకుతున్నారు. మౌనంగా తమలో తామే సతమతమవుతున్నారు. అమ్మ గురించి, మా అనుభవాల గురించి నేను పైకి మాట్లాడుతుంటే ఇప్పుడు ఎంతోమంది బయటపడుతున్నారు. కాబట్టి వీటిపై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరముందని ఇది సూచిస్తోంది.


అమ్మకు పాత సంగతులు బాగానే గుర్తుండేవి గానీ కొత్త విషయాలు జ్ఞాపకముండేవి కావు. కొంతకాలానికి ఆ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతూ వచ్చింది. నేను హైద్రాబాద్‌కు బదిలీ అయ్యాక అమ్మా నాన్న తిరిగి పంజాబ్‌కు వెళ్లిపోయారు. అనంతరం అమ్మకు బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్స్‌(నిమ్‌హాన్స్‌)లో చికిత్స ఇప్పించాం. నెల, రెండు నెలలకోసారి చండీగఢ్‌ నుంచి తీసుకొచ్చేవాళ్లం. విమానం ఎక్కాలంటే అమ్మ బెంబేలెత్తిపోయేది. మెట్లు చూడగానే కూచుండిపోయేది. ఇంట్లో గడప దాటాలన్నా భయమే. దీంతో బెంగుళూరుకు మకాం మార్చేశాం. తమ్ముడు కూడా అక్కడికే వచ్చేశాడు. అప్పుడే ‘నైటింగేల్స్‌ సెంటర్‌ ఫర్‌ ఏజింగ్‌ అండ్‌ అల్జీమర్స్‌’ గురించి తెలిసింది. కొద్దిరోజుల పాటు ఉదయం పూట తీసుకెళ్లి, సాయంత్రం తిరిగి తీసుకొచ్చేవాళ్లం. అనంతరం అమ్మ శారీరక పరిస్థితి కూడా క్షీణించటం మొదలైంది. 2015 డిసెంబరులో అనుకుంటా.. ఒకరోజు అమ్మ ఇంట్లో తూలి కింద పడిపోయి, తుంటిఎముక విరిగింది. ఆపరేషన్‌ చేయించినా కోలుకోలేదు. పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది. దీంతో నైటింగేల్స్‌ కేంద్రంలో చేర్పించాం. నాన్న ఉదయాన్నే అక్కడికి వెళ్లి సాయంత్రం వరకు అమ్మతోనే ఉండి వచ్చేవారు. నేను ప్రతి పదిహేను రోజులకు వెళ్లి, చూసి వస్తుండేవాణ్ని. ఇలా 15 నెలలు గడిచాయి. చివరికి గత ఏప్రిల్‌ 8న ఆమ్మ మమ్మల్ని శాశ్వతంగా వదిలివెళ్లారు. అప్పటికి ఆమె వయసు 64 ఏళ్లే! నాన్న వైమానికదళ అధికారిగా ఎక్కువ సమయం డ్యూటీల్లోనే ఉండటం వల్ల మా ఆలనా పాలనా చాలావరకు అమ్మే చూసేది. అందువల్ల అమ్మతోనే నాకు అనుబంధం ఎక్కువ. కానీ ఆమెను బతికించుకోలేకపోయాననే బాధ, చివరి రోజుల్లో పూర్తి సంతృప్తిగా ఆమెతో గడపలేక పోయానన్న ఆవేదన ఎప్పటికీ కుంగదీస్తూనే ఉంటుంది.
చనిపోవటానికి ఏడాది ముందు అమ్మకు మాట కూడా పోయింది. ముద్ద మింగటమూ కష్టమైంది. గొట్టం ద్వారానే ఆహారం ఇస్తుండేవారు. ఏ కొద్దిసేపో కళ్లు తెరచి చూసేది. గమనించాల్సిన విషయమేంటంటే.. అల్జీమర్స్‌ బాధితులను కనిపెట్టుకోవటం చాలా కష్టం. ఇది తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఇందుకు నాన్నే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మ అల్జీమర్స్‌ బారినపడ్డాక ఆయన లోకం పూర్తిగా ఆమెతోనే ముడిపడిపోయింది. అమ్మ పనులన్నీ నాన్నగారే చూసుకునేవారు. ఆయనకంటూ సమయమే ఉండేది కాదు. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆయనకూ బీపీ వంటి సమస్యలు మొదలయ్యాయి. ఇది నన్ను బాగా కలచివేసింది. అల్జీమర్స్‌ బాధితులను కనిపెట్టుకోవటానికి బెంగళూరులో ఉన్న నైటింగేల్స్‌ ట్రస్ట్‌ కేంద్రం వంటిది మనం నివసించే ప్రాంతంలోనే ఉంటే ఎంత బాగుండేది? అప్పుడు మేమూ ఆమెను రోజూ చూసుకునేవాళ్లం, నాన్న కూడా ఆరోగ్యంగా ఉండేవారు కదా? అని అనిపించింది. అందుకే మాలాగా ఎవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో హైద్రాబాద్‌లోనూ ఒక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొగ్గతొడిగింది. అమ్మ చనిపోకముందే ప్రయత్నాలు మొదలెట్టాను. గవర్నర్‌ నరసింహన్‌ గారిని, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలగాణ రాష్ట్ర శాఖ ఛైర్మన్‌ పాపారావు గారిని కలిసి నా ఆలోచన గురించి చెప్పాను. వాళ్లు వెంటనే అంగీకరించారు. ఇలాంటి కేంద్రాల అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు సైతం ప్రోత్సహించారు. రెడ్‌క్రాస్‌ ఉచితంగా భవన సదుపాయం కల్పించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ఎస్‌బీహెచ్‌ నిధులు అందించింది. ఇలా అధికార యంత్రాంగం, సంస్థల సహాయంతో మార్చి 31న హైద్రాబాద్‌లో డిమెన్షియా డే కేర్‌ సెంటర్‌ స్వప్నం సాకారమైంది. డిమెన్షియా బాధితులకు పగటిపూట ఇక్కడ చక్కటి సంరక్షణ లభిస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్‌ తరహాలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికీ ప్రయత్నిస్తున్నాం’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని