Published : 17 Jan 2016 13:59 IST

పంజరాల్లో పెట్టొద్దు

పంజరాల్లో పెట్టొద్దు


తిండి యుద్ధాలు .. ‘మా వాడు తిండి తినటం లేదు’  ‘మా పాపకు తినిపించటం గగనమైపోతోంది’ ‘పిల్లల తిండి అంటేనే ఇల్లంతా రణరంగం అయిపోతోంది’  ‘ఓపిక పోయి మాకు ఏడుపొస్తుంది. వాడినీ ఏడిపిస్తున్నం. ఇంట్ల అందరం ఏడుస్తున్నం. దీనికి అంతం లేదా?’  - నేడు పిల్లల్ని డాక్టర్ల దగ్గరకు తీసుకొస్తున్న చాలామంది తల్లిదండ్రుల నోట వినిపిస్తున్న మాటలివి. అసలు పిల్లల తిండి వ్యవహారం ఎందుకింత కష్ట కార్యక్రమంగా మారిపోతోంది? ప్రతి ఇంటా ఈ యుద్ధాలెందుకు జరుగుతున్నాయి? లోపం ఎక్కడుంటోంది? దీన్ని చక్కదిద్దలేమా? ప్రకృతి సహజంగా ఉన్నంతకాలం... సాధారణంగా మన జీవితం సాఫీగానే సాగిపోతుంటుంది. దాన్ని మనమే.. రకరకాల భయాలు, అపోహలు, అభద్రతలు, అవగాహనా రాహిత్యాలతో ఎక్కడలేనంతగా క్లిష్టతరం చేసుకుంటుంటాం. పిల్లల తిండి వ్యవహారం కూడా అంతే!

  వెనకటికి పిల్లలు ఆయాసం లేకుండా తినేవారు. ముందుగా పిల్లలు అన్నం పెట్టమని ‘డిమాండ్‌’ చేసేవారు. ఆ తర్వాతే తల్లి వారికి ‘సప్లై’ చేసేది. అప్పట్లో తల్లులకు ఇంట్లో పుట్టెడు పనులుండేవి. వాటి మధ్య ఒక్కో పిల్లనూ పట్టించుకుని, ఎప్పటికప్పుడు వాళ్ల తిండి తిప్పల వంటివన్నీ తీరికగా చూసేంత సమయం వారికి ఉండేది కాదు. పిల్లలొచ్చి ‘అమ్మా.. ఆకలైతుంది’ అని అడిగితే.. ‘తిను బిడ్డా’ అని కంచంలో పెట్టేది. పిల్లలూ తమ తిండి తాము తినేసేవారు. ఇలా డిమాండును బట్టే సప్లై జరిగితే దానికి ఒక ‘విలువ’ ఉంటుంది. డిమాండు లేకుండా సప్లై చేస్తే విలువ ఉండదు. అందుకే పాప అన్నం అడగకపోయినా మనం ‘తిను తిను’ అని కుక్కితే.. తినదు! బలవంతంగా తినిపించే కష్టం ఒకప్పుడు లేదు. గత రెండు తరాల నుంచే మొదలైన సమస్య ఇది!

ఆహారం, నీరు, నిద్ర.. ప్రతి పిల్లాడికి, ఆ మాటకొస్తే ప్రతి జీవికీ అవసరం. ఒకపూట దొరక్కపోతే కచ్చితంగా రెండోపూట వీటి కోసం వెతుక్కోవాల్సిందే. ఈ విషయాన్ని అందరూ తప్పకుండా అర్థం చేసుకోవాలి. పిల్లలకు గానీ పెద్దలకు గానీ.. అందరికీ మెదడులో ‘ఆకలి కేంద్రం’ (అపిటైట్‌ సెంటర్‌) ఉంటుంది. మనకు శక్తి అవసరమైనప్పుడు, రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినపుడు ఈ ‘ఆకలి కేంద్రం’ ప్రేరేపితమవుతుంది. వెంటనే కడుపులో ఆకలి, ఆహారం కోసం వెతుకులాట మొదలవుతాయి. ఆకలి కేంద్రం మాదిరే మెదడులో తృప్తి కేంద్రం (సెటైటీ సెంటర్‌) కూడా ఉంటుంది. కడుపు నిండగానే.. ఇదింక చాలని చెబుతుంది. ఇవన్నీ జీవ ప్రక్రియలో భాగం. పిల్లలకు దైనందిన శారీరక అవసరాలకు ఖర్చయ్యే శక్తి కోసమే కాదు.. ఎదుగుదల కోసమూ ఆహారం ముఖ్యం. వాళ్లు వయసుకు తగినట్టుగా ఎదుగుతుంటే.. కడుపు నిండా ఆహారం అందుతుందని అర్థం. కాబట్టి పిల్లలు సరిగా తినటం లేదు, వాళ్లు బక్కచిక్కిపోతున్నారని బెంగపడే ముందు.. అసలు వాళ్లు వయసుకు తగ్గట్టుగా ఎదుగుతున్నారా? లేదా? అన్నది చూసుకోవటం ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగా తినటం లేదని డాక్టర్ల దగ్గరకు తీసుకొస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకవేళ బిడ్డ ఎదుగుదల బాగానే ఉన్నా.. తల్లిదండ్రుల, కుటుంబం ఆందోళనను విస్మరించకూడదు కాబట్టి మనం దీన్ని గురించి పట్టించుకోవాల్సిందే. తల్లిదండ్రులకు ఈ భయం, ఆందోళన ఎందుకొచ్చింది? పిల్లలు ఎందుకు తినటం లేదు? వాళ్ల తిండి అనేది ఇంట్లో పెద్ద విషయంగా ఎందుకు తయారయ్యిందన్నది ఆలోచించక తప్పదు.

కారణాలేమిటి? .. భావం ముఖ్యం : తల్లీబిడ్డల మధ్య అనుబంధం, ఆప్యాయత, అనురాగం.. ఇలాంటివన్నీ మిళితమై ఉంటాయి. పిల్లల ఆహారం విషయంలో అందులోని పదార్థాలు మాత్రమే కాదు.. వాటిని మనం ఏ భావంతో పెడుతున్నామన్నదీ కీలకమే. ఎదుగుదలకు ఆహారం ఒక్కటే కాదు, ప్రేమ కూడా కావాలి. చాలామంది టైముకి ఏదో ఇంత పెట్టేస్తే చాలని అనుకుంటారు. కానీ ప్రేమ అందకపోతే.. భావోద్వేగ లోపం (ఎమోషనల్‌ డిప్రవేషన్‌)లోకి జారిపోయి, దాని మూలంగా కూడా పిల్లలు తినరు, ఎదగరు. కాబట్టి ఆహారమేకాదు.. ప్రేమ కూడా కావాలని గుర్తించాలి.

స్వతంత్రం గుర్తించాలి : పసివయసు నుంచీ కూడా పిల్లలు ఎప్పుడూ కొత్తవాటిని అన్వేషిస్తుంటారు. కనిపించిన ప్రతిదీ ముట్టుకోవటానికి, లోపల ఏముందో చూడటానికి, కుదిరితే నోట్లో పెట్టుకుని రుచి చూడటానికి తహతహలాడుతుంటారు. ఇదంతా ఎదుగుదలలో భాగం.. స్పర్శ, రుచి ద్వారా ప్రపంచాన్ని శోధించే, తెలుసుకునే ప్రయత్నం! వాళ్లకు స్వతహాగా తమ చేతులతో తామే తీసుకుని తినాలనే కోరిక, కడుపు నింపుకోవాలనే తహతహ బలీయంగా ఉంటాయి. స్వతంత్రంగా ఉండాలనే తాపత్రయం ఎక్కువ. కానీ ఇప్పుడు చాలామంది తల్లులు దీన్ని అర్థం చేసుకోకుండా... పిల్లలు తమ మీద ఆధారపడి, తాము చెప్పింది చేయాలని అనుకుంటున్నారు. ‘పసివాడు.. వాడికేం తెలుసు. నేను పెడితే తింటాడు. నేనైతే దండిగా పెడతా, లేకపోతే కడుపు ఎండుతుంది’ అని భావిస్తుంటారు. ఎలాగోలా పిల్లల కడుపు నింపాలన్న తల్లి ప్రేమ..వీళ్ల చేత అలా చేయిస్తుంది. కానీ ఇది సరికాదు. పిల్లల తిండి సమస్యలకు బీజాలు ఇక్కడే పడుతున్నాయి.

పాలతో నింపొద్దు : చాలామంది తల్లిదండ్రులు ‘ఘనాహారమైతే చాలా సమయం పడుతుంది. అదే ద్రవాలైతే గటగటా తాగుతారు, తేలికగా కడుపు నిండిపోతుందని’ భావిస్తూ పిల్లలకు పూటపూటా పాలు పట్టేస్తుంటారు. కానీ ఏడాది వయసు దాటిన తర్వాత ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకునే పిల్లలకు సరైన పోషణ లభించదన్న విషయం అందరూ గుర్తించాలి. 6 నెలలు నిండే వరకూ పిల్లలకు తల్లిపాలు తప్పించి మంచినీళ్లు కూడా పట్టించక్కర్లేదు. 7 నుంచి 12 నెలల వరకూ సగం పాలు, సగం ఘనాహారం ఇవ్వాలి. ఏడాది దాటిన తర్వాత 20-30% పాలు, 80-70% ఘనాహారం పెట్టాలి. ఇక 2 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లిదండ్రులు తామేం తింటారో అవన్నీ పిల్లలకు పెట్టాలి. తాము తినే వాటినే వాళ్లతో పంచుకోవటమన్నది ఏడాది నుంచే ఆరంభించి, రెండేళ్లు వచ్చే సరికి పూర్తిగా అమల్లోకి తేవాలి. అయితే చాలామంది తల్లులు చేసే పని.. పిల్లలు బడి నుంచో, బయటి నుంచో రాగానే ముందు కడుపు నిండా పాలు ఇచ్చేస్తారు. పాలు తాగిన తర్వాత తినమంటే వాళ్లు ఎలా తింటారు? రెండేళ్ల తర్వాత కూడా పాల మీద ఆధారపడుతుంటే పిల్లలు బక్కగా అయిపోతారు. ఎందుకంటే 100 గ్రాముల పాల నుంచి 65 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. అదే 100 గ్రాముల ఘనాహారంతో దాదాపు 350-400 క్యాలరీలు లభిస్తాయి. పాలు తాగితే కడుపు నిండొచ్చు. ఆకలి తీరొచ్చు. కానీ శక్తి చాలదు. ముఖ్యంగా ఎదిగే పిల్లల శరీరానికి అవసరమైనంత శక్తి అందదు. ఆవు/గేదె పాలలో మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉండవు. ముఖ్యంగా ఇనుము ఉండదు. అందుకే పాల మీద ఎక్కువగా ఆధారపడే పిల్లలకు రక్తహీనత వస్తుంది. బక్కగానూ అవుతారు. కాబట్టి- ‘అరె.. పిల్లాడికి పాలు బాగా తాగిస్తున్న. అయినా ఎదగటం లేదు’ అని చింతించటం వృథా. ఘనాహారం కన్నా పాలు ఎక్కువగా ఇస్తే పిల్లలు సరిగా ఎదగరని అందరూ గుర్తించాలి.

మందుల్లేవు!: పిల్లలకు ఆకలి పుట్టేందుకు టానిక్కులు రాయమని చాలామంది వైద్యులను ప్రాధేయపడుతుంటారు. కానీ నిజానికి ఆకలి పుట్టించే టానిక్కులేవీ ఉండవు. చాలాసార్లు వైద్యులు సరిగా తినని పిల్లలకు ఎలాగూ పోషకాహార లోపం ఉండొచ్చని విటమిన్‌ మాత్రలు, టానిక్కుల వంటివి ఇస్తుంటారు. అంతేగానీ ఆకలి కోసమంటూ మందులుండవు.

పదేళ్లకు పదింతలు!
పుట్టిన పిల్లలు 5 నెలలకు వచ్చేసరికి రెట్టింపు బరువు పెరుగుతారు. ఒక సంవత్సరం నిండే సరికి మూడింతలు.. రెండు-రెండున్నరేళ్ల కల్లా నాలుగింతలు.. పదేళ్లు వచ్చే సరికి పదింతలు అవుతారు. అంటే పుట్టినపుడు 3 కిలోలున్న పిల్లలు పదేళ్లు వచ్చేసరికి 30 కిలోలకు పెరుగుతారు. ఇది సహజం. పిల్లల ఎదుగుదల ఇలా ఉన్నంత వరకూ.. వాళ్లు సరిపడా ఆహారం తింటున్నారనే అనుకోవాలి.

పిల్లలు పసివయసులో బరువు ఎక్కువగా పెరుగుతారు. రెండుమూడేళ్ల తర్వాత పెరుగుదలలో అంత వేగం ఉండదు. తల్లిదండ్రులు ఈ విషయం తెలియక- ‘ఒకప్పుడు నెలకు కిలో పెరిగేది, ఇప్పుడు ఆర్నెల్లైనా కిలో పెరగటం లేదే. తిండి సరిపోవటం లేదేమో’ అని చింతిస్తుంటారు. నిజానికి తొలి 3 నెలల్లో కిలో చొప్పున, 6 నెలలప్పుడు 600 గ్రాముల చొప్పున పెరిగిన పిల్లలే- 2, 3 ఏళ్ల తర్వాత ఏటా 2.5 కిలోలు మాత్రమే పెరుగుతారు. అంటే నెలకు సుమారు 200 గ్రాములు పెరుగుతారన్నమాట. తల్లిదండ్రులకు ఈ అవగాహన ముఖ్యం. పిల్లల ఎదుగుదల బాగుందో లేదో తెలుసుకునేందుకు ‘గ్రోత్‌ చార్ట్‌’ ఉపయోగపడుతుంది. ఇది బాగుంటే పిల్లలు సరిగా తింటున్నట్టే!

‘ఒక పని’లా చూడొద్దు! : అతిశయోక్తి కాదుగానీ.. కొందరు ఉదయం అరగంట, గంట.. మధ్యాహ్నం గంట.. రాత్రి గంట, గంటన్నర.. ఇలా పిల్లలకు తిండి పెడుతూ సమయాన్ని గడుపుతున్నారు. కాస్త కలిగిన కుటుంబాల్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంది. మరోవైపు- ఉద్యోగాలు చేసుకునే మహిళలేమో తొందర తొందరగా పిల్లలకు ఏదో కాస్త తినిపించెయ్యాలని ఒత్తిడి పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు అనుకున్న వెంటనే పిల్లలు.. ఇష్టం ఉన్నాలేకున్నా.. ఆకలి వేసినా లేకున్నా.. గబగబా తినాల్సిందే, లేకపోతే తినిపించాల్సిందే! ఇక్కడా పిల్లల స్వేచ్ఛ పోతుంది. ఈ రెండు ధోరణుల్లోనూ కూడా- పిల్లలకు అన్నం పెట్టటాన్ని ఒక పనిగా చూస్తున్నారు. ఇది సరికాదు. పిల్లల ఎదుగుదల, తిండి గురించి పట్టించుకోవటం (కన్‌సర్న్‌) అవసరం. కానీ ఇది ఆందోళన (ఆంగ్జైటీ), అతి ధోరణి (అబ్‌సెషన్‌) స్థాయికి వెళ్లకూడదు. ఎప్పుడూ పిల్లల తిండి మీదే ధ్యాస పెట్టటం సరికాదు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి. అందుకే ఇంట్లో తిననని మారాం చేసిన వాళ్లే పక్కింట్లో ఇష్టంగా తింటారు. అక్కడ బలవంతం ఉండదు, తామే తింటారు కాబట్టి వాళ్లకు కావాల్సిన స్వేచ్ఛ అక్కడ లభిస్తోందని గుర్తించాలి.

మాయలతో నష్టం: చాలామంది తల్లిదండ్రులు తిండిపెట్టేప్పుడు పిల్లలకు మాయ మాటలు చెప్పటం లేదంటే టీవీలూ, సెల్‌ఫోన్లూ, కార్టూన్ల వంటివి చూపిస్తూ.. ధ్యాస మళ్లించి.. కుక్కేయాలని చూస్తుంటారు. కొన్నిసార్లు ‘ప్లీజ్‌రా.. ప్లీజ్‌రా.. నా కన్నవురా.. తినురా..’ అని ప్రాధేయ పడుతుంటారు. ‘తింటే అదిస్తా, ఇదిస్తా’ అని ఆశలు పెడుతుంటారు. ఇవన్నీ పిల్లల్లో విపరీత ధోరణి పెంచే వ్యవహారాలు. ‘ఓహో.. తినకపోతే నాకు ఇవన్నీ లభిస్తాయి. తింటే ఏమీ రావు’ అనే భావనకు దారితీస్తాయి. తినకపోతే బతిమిలాడుతారు, కోరినవన్నీ ఇస్తారనే ఆలోచన (అటెన్షన్‌ డ్రాయింగ్‌) పిల్లల్లో తలెత్తుతుంది. కొన్నిసార్లు ఈ మాయలేవీ పని చెయ్యకపోతే చివరికి తల్లిదండ్రులే నోట్లో కుక్కటం మొదలుపెడతారు. కుక్కిన కొద్దీ పిల్లలూ మొండిగా తయారై కక్కటం ఆరంభిస్తారు. తల్లిదండ్రులు శారీరకంగా బలవంతులైతే అయ్యుండొచ్చు గానీ.. భావోద్వేగ పరంగా మాత్రం (ఎమోషనల్‌) పిల్లలే చాలా బలవంతులు. దాని ముందు తల్లిదండ్రులు ఓడిపోవాల్సిందే. కక్కటమనేది పిల్లల దగ్గరున్న బ్రహ్మాస్త్రం! దీన్ని ప్రయోగిస్తూ ఒత్తిడి పెట్టటం ద్వారా తమను గెలవలేరని నిరూపిస్తారు. దీంతో బిడ్డ తిండి అనేది ఇంట్లో పెద్ద చికాకు వ్యవహారంగా తయారైపోతుంది. అమ్మ ఒక పక్క అన్నం కలుపుతుంటేనే ‘అమ్మో.. ఇంక నన్ను సతాయిస్తది’ అనుకుంటూ పిల్లలు దూరం ఉరుకుతుంటారు. ఆ సమయంలో తల్లి పిల్లలకు ఒక ‘జైలర్‌’లాగా కనిపిస్తుంది. ఈ మొత్తం ధోరణే తప్పు. పిల్లలు తాము చెప్పినట్టే వినాలని అనుకోకూడదు. వాళ్లకు స్వేచ్ఛ కావాలనే విషయాన్ని గుర్తించాలి.

ఇవి చూడటం తప్పనిసరి!
పిల్లలు ఆహారం సరిగా తినకపోవటానికి చాలా సందర్భాల్లో కుటుంబం, పెంపకం వ్యవహారాలే కారణం అవుతుంటాయి. అయితే ఆ నిర్ణయానికి వచ్చే ముందు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలున్నాయేమో చూడటం తప్పనిసరి. దీర్ఘకాలిక సమస్యలున్న పిల్లలు బరువు పెరగరు. కాబట్టి పిల్లలు ఏదైనా వ్యాధి మూలంగా తినటం లేదా? పరిస్థితుల మూలంగా తినటం లేదా? అనేది తెలుసుకోవటం ముఖ్యం. వారికి ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? జ్వరం వస్తోందా? అన్నవాహికలో, ముద్ద కిందికి దిగటంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? కాలేయం, కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయా? మలబద్ధకం ఉందా? కడుపులోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని (అసిడిటీ) వస్తోందా? హార్మోన్ల సమస్యలు, ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్‌ తగ్గటం వంటి సమస్యలున్నాయా? ఇలా అన్నీ పరిశీలించటం అవసరం. ఇవే కాదు.. భయం, ఆందోళన, కుంగుబాటు, ఆత్మ న్యూనతా భావం, ఒత్తిడి వంటివి కూడా పిల్లలు ఆహారం సరిగా తినకుండా చేస్తాయి. ఇలాంటి మానసిక చికాకులు ఉన్నప్పుడు పెద్దలకూ తిండి సరిగా లోపలికి పోదు. మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే నాలుగు ముద్దలు హాయిగా తింటాం. పెద్దల్లాగే పిల్లలకూ మానసిక ఆందోళనలు, భయాలు, ఒత్తిళ్ల వంటివి ఉంటాయని గుర్తించాలి. అలాగే పెద్దల్లాగే పిల్లలకూ ఇష్టాయిష్టాలుంటాయి. మనం సాధ్యమైనంత వరకూ వాళ్ల ఇష్టానికి అనుగుణంగానే సంపూర్ణమైన, సమతులమైన ఆహారం అందుబాటులో ఉంచాలి. అప్పుడు బలవంతంగా కుక్కాల్సిన పరిస్థితే రాదు, వచ్చినా ఆ పని మాత్రం చెయ్యకూడదు.

రాణివాసంలో చిలుకను బంగారు పంజరంలో పెట్టి.. దానికి గంట గంటకూ పెసలు, శెనగలు, బఠాణీలు, జామపండ్లు పెడుతూ.. ఇష్టమైనవన్నీ పెడుతున్నా తినటం లేదు, దీనికేం రోగమొచ్చిందని రుసరుసలాడుతుంటుంది మహరాణి!
కానీ లోపలున్న చిలుక ఏమనుకుంటుందో తెలుసా?
‘పంజరంలో పెట్టింతర్వాత ఇంక నువ్వు నాకేం పెడితే ఏమిటి? నాక్కావాల్సింది.. రెక్కలాడించుకుంటూ జామచెట్టు మీద వాలి, ముక్కుతో పండును పొడచుకొని తినటం. ఆ స్వేచ్ఛలో ఉంది బ్రహ్మనందం’ అనుకుంటుంది!
మనం పిల్లలకు బలవంతంగా తిండిపెట్టాలని చూడటం కూడా ఇంతే. తన తిండిని, తన చేతులతో తాను తినాలనే కోరిక పిల్లలకుంటుంది. అందుకే తిండి విషయంలో వాళ్లు స్వేచ్ఛ కోరుకుంటారు. పక్కింట్లో తింటారు, పెండ్లి పేరంటాల్లో తింటారు, మిగతా పిల్లలతో కలిసి కూచొని తింటారు.. ఇంట్లోకి రాగానే మాత్రం తినరు! ఈ విషయం తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకోవాలి.

పరిష్కారాలేమిటి? : * ఈ ప్రకృతిలో పిల్లి, కుక్క, కోతి.. ఏ జంతువూ తన బిడ్డకు కలిపి నోట్లో తిండి పెట్టే కార్యక్రమం పెట్టుకోదు! ప్రతి జీవికీ తన ఆకలి తనకు తెలుస్తుంది, దాని ప్రకారమే తను తింటుంది. ఇది మన పిల్లలకూ వర్తిస్తుంది. మనం కుక్కటం కాదు.. పిల్లలు తమకు కావాల్సిన ఆహారాన్ని తాము అడిగి తినే వాతావరణం కల్పించటం అవసరం. పిల్లలు ‘నాకోసం కాదు, అమ్మకోసం తింటున్నాం’ అనుకున్నప్పుడే సమస్యలన్నీ బయల్దేరతాయి. ఇంట్లో ఆహారం అందుబాటులో ఉంచాలి. ఇష్టమైనప్పుడు పిల్లలు వచ్చి అడిగి తినే అవకాశం కల్పించాలి. తల్లిదండ్రులుగా మనం ఈ పని చేస్తే చాలు. నోట్లో పెట్టటం వంటి పనులు సరికాదు.

* అమెరికా వంటి దేశాల్లో మొదటి పుట్టిన రోజు గడిచిన తర్వాత ఏ పిల్లకూ తల్లి నోట్లో పెట్టటమనే కార్యక్రమం ఉండదు. ఏడాది నిండుతూనే పిల్లలను ఎత్తు కుర్చీలో కూర్చోబెట్టి గిన్నె ముందు పెడతారు. చెంచా చేతికిస్తారు. అంతే! మొదట్లో తంటాలు పడినా క్రమేపీ పిల్లలే తీసుకుని తినటం అలవాటు చేసేసుకుంటారు. తొమ్మిది నెలలకల్లా పిల్లలకు ఎంత చిన్నవస్తువునైనా పట్టుకుని పైకి తీసుకునే సామర్థ్యం (పిన్సర్‌ గ్రాస్ప్‌) వచ్చేస్తుంది. అందుకే ఏడాది దాటుతూనే చెంచా చేతికిస్తారు. ఇది ఉత్తమం. మంచి ఏ సంస్కృతిలో ఉన్నా గ్రహించటం అవసరం.

* ఆహారం పెట్టేటప్పుడు తల్లి ఆందోళన, ఒత్తిడి, చికాకులేమీ పెట్టుకోకూడదు. భావోద్వేగాలు ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. తల్లి ఆందోళనలో ఉంటే పిల్లా అంతే. అన్నం ముందు పెడుతూనే ‘తిను తిను’ అని సతాయించటం, ‘నోరు లేదా? చేతుల్లేవా?’ అంటూ విసుక్కోవటం ఇవన్నీ పిల్లల్లో విముఖతను పెంచుతాయి. కాబట్టి ప్రశాంతంగా, స్థిరంగా ఉండటం ముఖ్యం. దానివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, తమ మీద తమకు శ్రద్ధ పెరుగుతాయి.

* పెట్టినా పిల్లలు తినలేదంటే వాళ్లను అలాగే వదిలెయ్యాలిగానీ.. తిండి తినలేదు కదా అని చిరుతిండ్లు పెట్టే ప్రయత్నం చెయ్యకూడదు. తిండి తినకపోతే.. ఆ తర్వాత మూడు నాలుగు గంటల వరకూ ఏమీ పెట్టొద్దు. ‘తింటే తిను, లేకపోతే అలాగ కూర్చో. నేను మాత్రం చాక్లెట్లు, చిప్స్‌ ఇవ్వను’ అని స్థిరంగా ఉండటం ముఖ్యం. ప్రధాన ఆహారం బదులుగా కూడా చిరుతిండ్లు పెడుతుంటే వాటికి అలవాటుపడిపోయి.. తిండి తినరు. కాబట్టి ఈ ధోరణి సరికాదు. పొద్దున్నే టిఫిన్‌ తింటే.. టిఫిన్‌కూ, మధ్యాహ్న భోజనానికీ మధ్యన చిరుతిండ్లు పెట్టొచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం చిరుతిండ్లు (ఇన్‌ బిట్వీన్‌ స్నాక్స్‌) పెట్టొచ్చు. కానీ టిఫిన్‌ మానేసి, భోజనం మానేసి చిరుతిండ్లు తింటామంటే మాత్రం కచ్చితంగా కుదరదని చెప్పాలి.

* తిన్నందుకు పొగడొద్దు. అలాగే వాళ్లు తిననప్పుడు మనం కలతకు గురైనట్లు వాళ్లకు తెలియనివ్వకూడదు. తినకపోతే దృష్టి అంతా తమ మీదే ఉంటుందన్న భావన వాళ్లకు కలగనివ్వకూడదు. అప్పుడే పిల్లలకు తమ కోసం తాము తినాలన్న భావన కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు