Published : 09 May 2017 01:46 IST

మండే ఎండల్లో ఈ మొగ్గలను వాడనీకండి!

మండే ఎండల్లో ఈ మొగ్గలను వాడనీకండి!

గుండె లోపాల బిడ్డలను కాపాడుకుందాం రండి!

గుండె జబ్బులతో బాధపడుతున్న పసి మొగ్గలు ఎన్నో! మండుటెండల్లో ఈ లేలేత మొగ్గలు వడిలి, వాడిపోయే ప్రమాదం ఉంది. వేసవి ఎండల్లో ఈ బిడ్డలకు పెనుముప్పు ముంచుకురావచ్చు. కాబట్టి ఈ ఎండాకాలం అంతా వీరిని జాగ్రత్తగా కాపాడుకోవటం తక్షణావసరం!
మన సమాజంలో గుండెలో లోపాలు, రంధ్రాలతో పుట్టే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాగే పుట్టిన తర్వాత రకరకాల గుండె జబ్బుల బారినపడుతున్న చిన్నారులూ పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు. వీరందరినీ ఈ వేసవి ఎండల్లో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో, ఏమిటో, ఎలాగో వివరంగా చూద్దాం! గుండె లోపాలున్న పిల్లలను బీచ్‌ల వంటి ప్రదేశాలకు తీసుకు వెళ్లొద్దు

పుట్టుకతో గుండెలో రంధ్రాలతో పుట్టే బిడ్డలకు సమస్య తీవ్రతను బట్టి వైద్యులు కొన్నిసార్లు వెంటనే ఆపరేషన్‌ చేసి.. గుండెలోని రంధ్రాలను మూసివేస్తుంటారు. కొందరికి వేచి చూద్దామని చెప్పి, కొంతకాలం పాటు ఆపరేషన్‌ను వాయిదా వేస్తుంటారు. ఇలా గుండెలో లోపం ఉండి... ఆపరేషన్‌ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల సంఖ్య ఎక్కువే. వీరికి వేసవిలో ప్రత్యేక సంరక్షణ అవసరం. వీళ్లే కాదు... గుండె వైఫల్యం వంటి ఇతరత్రా గుండె జబ్బుల బారినపడిన చిన్నారుల విషయంలో కూడా వేసవికాలం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులంతా దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

‘బ్లూ బేబీ’లకు ముప్పు
పుట్టుకతో వచ్చే గుండె లోపాల్లో చాలా రకాలున్నాయిగానీ.. వీరిలో దాదాపు 20% వరకూ ‘బ్లూ బేబీ’లే ఉంటారు. అంటే ఈ బిడ్డలు తరచుగా నీలంగా మారిపోతుంటారు. గట్టిగా ఏడ్చినా కూడా పెదాలు, గోళ్లు, ముఖం వంటి శరీర భాగాలు నీలంగా మారిపోతుంటాయి. బిడ్డలు ఇలా నీలం రంగులోకి మారుతున్నారంటే వీరిలో గుండెలో లోపం ఏదైనా ఉందేమోనని అనుమానించటం, వైద్యులకు చూపించటం అవసరం. ఇలా నీలంగా తయారయ్యే బిడ్డలకు వేసవిలో ప్రత్యేక సంరక్షణ అవసరమవుతుంది.

ఏమిటీ నీలం?
పుట్టుకతోనే గుండెలో లోపం ఉండటం వల్ల ఈ బిడ్డల్లో మంచి రక్తం - చెడు రక్తం కలిసిపోతుంటాయి. దీంతో పెదాలు, గోళ్లు, ముఖం వంటి శరీర భాగాలన్నీ తరచూ నీలం రంగులోకి మారిపోతుంటాయి. దీన్నే వైద్య పరిభాషలో ‘సైనోటిక్‌ హార్ట్‌ డిసీజ్‌’ అంటారు.
* సాధారణ ఆరోగ్యవంతుల్లో గుండె మంచి రక్తాన్ని ఒళ్లంతా సరఫరా చేస్తుంది. ఆ మంచి రక్తం ఒంట్లోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను అందిస్తుంటుంది. ఆ ఆక్సిజన్‌ను కణాలు వాడేసుకున్న తర్వాత మిగిలే ‘చెడు’ రక్తం- తిరిగి మళ్లీ గుండెకు, అక్కడి నుంచి శుద్ధి కోసం వూపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇలా మంచి రక్తం, చెడు రక్తం ఒళ్లంతా ధమనుల్లో, సిరల్లో వేర్వేరుగానే ప్రవహిస్తుంటాయి, గుండెలో కూడా ఇవి కలిసిపోకుండా ప్రత్యేకంగా వేర్వేరు గదులున్నాయి.

అయితే గుండెలో లోపాలున్న ఈ బిడ్డల్లో.. ముఖ్యంగా గుండె గదుల మధ్య ఉండే గోడలకు రంధ్రాలున్న పిల్లల్లో.. ఈ మంచి-చెడు రక్తాలు రెండూ కలిసిపోతుంటాయి. దీనివల్ల సాధారణంగా మన రక్తంలో ఉండాల్సినంత ఆక్సిజన్‌ ఉండదు. దాని శాతం బాగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితినే ‘హైపాక్సియా’ అంటారు. ఇలా రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం వల్లనే- ఈ పిల్లల ఒళ్లు, ముఖ్యంగా నాలుక, పెదవులు, గోళ్లలో నీలం రంగు ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక చెడు రక్తం- మంచి రక్తంతో కలిసి శరీరమంతా ప్రవహించటం వల్ల ఒంట్లోని చాలా అవయవాలకు ఆక్సిజన్‌ తగినంతగా అందదు. దీంతో రక్తం సరిపోవటం లేదన్న ఉద్దేశంతో మన శరీరం వేగంగా స్పందిస్తూ.. రక్తం మరింత ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తంలోని ఎర్రకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి.. వాటి సంఖ్య చాలా ఎక్కువై.. రక్తం బాగా చిక్కగా తయారవుతుంది. వేసవిలో సమస్యలు తలెత్తటానికి ఇదే మూలం.

వేసవిలో ఏమవుతుంది?
1 వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. కాబట్టి ఒంట్లో నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకుపోయి సహజంగానే ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఫలితంగా వీరిలో రక్తం చిక్కబడే అవకాశాలు పెరుగుతాయి. దీనికి తోడు ఒకవేళ వీరికి విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు తలెత్తితే- ఒంట్లో నీరు ఇంకాఇంకా తగ్గిపోయి, రక్తం మరింతగా చిక్కబడుతుంది. ఇలా రక్తం ఎక్కువగా చిక్కబడటం వల్ల వీరిలో ముందు తలనొప్పి, తీవ్రమైన అలసట, మగతగా అనిపించటం వంటి లక్షణాలు కనబడతాయి. దీన్నే ‘హైపర్‌ విస్కాసిటీ సిండ్రోమ్‌’ అంటారు.
2 రక్తం బాగా చిక్కగా ఉన్నప్పుడు అది సిరల్లో గడ్డకట్టే అవకాశం కూడా పెరుగుతుంది. దీన్నే ‘వీనస్‌ థ్రాంబోసిస్‌’ అంటారు. ఇలా తలలోని సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడితే- మెదడులో చీముపట్టి పరిస్థితి తీవ్రతరమవుతుంది.
- కాబట్టి ఇలాంటి గుండె లోపాలతో పుట్టిన బిడ్డలకు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.

వేసవి జాగ్రత్తలివే!
* గుండె లోపాలున్న పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగనివ్వద్దు. అలాగే చెమట ఎక్కువగా పట్టే బీచ్‌ల వంటి ప్రదేశాలకు తీసుకువెళ్లటం మంచిది కాదు.
* ఈ పిల్లలకు ఎండా కాలంలో నీరు, ద్రవాహారం ఎక్కువగా తాగించటం అవసరం. పండ్ల రసాలు కూడా పట్టొచ్చు.
* ఒకవేళ వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి, అవసరమైతే సెలైన్‌ పెట్టించటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.
* గుండె లోపాలున్న బిడ్డలు- తలనొప్పిగా ఉందన్నా, రోజూ జ్వరం వస్తున్నా, కంటి చూపు సరిగా కనిపించటం లేదంటున్నా.. సత్వరమే వైద్యులకు చూపించి, అవసరాన్ని బట్టి సీటీస్కాన్‌ పరీక్ష చేయించి- మెదడులో చీముగానీ, మెదడు సిరల్లో గడ్డలుగానీ ఉన్నాయేమో చూడాలి. ఇలాంటివి ఉంటే తక్షణం చికిత్స ఇవ్వాలి.
* తలనొప్పి ఎక్కువగా ఉన్నా, మగత, అలసట, ఆయాసం వంటివి ఉన్నా తేలికపాటి రక్తపరీక్ష (హెమోగ్లోబిన్‌, ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌ - పీసీవీ) చేయించి, రక్తం చిక్కదనం పెరిగిందా? అన్నది తెలుసుకోవాలి. చిక్కదనం మరీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు కొంత రక్తం తీసెయ్యాల్సికూడా రావచ్చు.
* కొందరు ‘బ్లూ బేబీస్‌’కు చిన్నతనంలో షంట్‌ ఆపరేషన్‌ వంటివి చేసి, మరికొద్ది సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద ఆపరేషన్‌ చేస్తామని చెబుతారు. వీరి విషయంలో వేసవిలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ సీజన్లో రక్తం చిక్కబడి, షంట్‌ మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రక్తం పల్చగా ఉండేందుకు వైద్యుల సిఫార్సు మేరకు ‘ఆస్పిరిన్‌’ మాత్రల వంటివి క్రమం తప్పకుండా వాడుతుండాలి.
* రోజూ తగినంత ద్రవాహారం ఇస్తూ.. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూడాలి.

వీరందరికీ వేసవి ఇబ్బందే..
* పుట్టుకతోనే.. గుండెలో రంధ్రాలుండటం. వాటితో పాటు వూపిరితిత్తులకు పోయే రక్తనాళం మూసుకొని ఉండటం. బృహద్ధమని ఉండాల్సిన చోట కాకుండా వేరేచోట ఉండటం. జఠరిక గది ఒకటే ఉండటం

వీరే కాకుండా...
* పుట్టిన తర్వాత వచ్చే.. గుండె వైఫల్యం (కార్డియో మయోపతి). రుమాటిక్‌ గుండె జబ్బు. పల్మనరీ హైపర్‌టెన్షన్‌
- ఇలాంటి గుండె జబ్బులున్న పిల్లలందరికీ వేసవిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పుట్టిన తర్వాత గుండె జబ్బుల బారినపడిన వారికీ ప్రత్యేక శ్రద్ధ అవసరమే!
కార్డియో మయోపతి: రక్తాన్ని గుండె సమర్థంగా పంపింగ్‌ చెయ్యలేకపోవటం ఈ సమస్య ప్రధాన లక్షణం. దీన్నే ‘హార్ట్‌ఫెయిల్యూర్‌’ అంటారు. ఈ సమస్య ఉన్న బిడ్డలు.. పాలు సరిగా తాగరు. శ్వాస సమస్యలుంటాయి. కాళ్ల వాపులు కూడా రావచ్చు. వీళ్లకు సాధారణంగా దీర్ఘకాలం వైద్యం అందించాల్సి ఉంటుంది. ఇలాంటి బిడ్డలకు వైద్యులు సాధారణంగా ఒంట్లోంచి నీరు ఎక్కువగా బయటకుపోయేందుకు మందులిస్తుంటారు. ఇలాంటి మందులు తీసుకునే బిడ్డలకు- వేసవిలో ఒంట్లోంచి నీరు మరీ ఎక్కువగా బయటకుపోయి.. ఒంట్లో అసలుకే నీరు తగ్గిపోవచ్చు. దీంతో ఒంట్లో కీలక ఖనిజ లవణాలు తగ్గిపోయి.. వీళ్లు చాలా నీరసించి.. గుండె కొట్టుకునే లయ తప్పి.. చాలా సమస్యల్లోకి జారిపోతుంటారు. కాబట్టి ఈ బిడ్డలకు వేసవిలో వైద్యులు ఈ మందుల మోతాదును సగానికి తగ్గిస్తుంటారు. ఒకవేళ ఈ సీజన్లో వీరికి వాంతులు, విరేచనాల వంటివి అయితే ఈ మందులు పూర్తిగా ఆపెయ్యాల్సి ఉంటుంది కూడా. కాబట్టి ఈ రకం గుండె జబ్బులున్న పిల్లల విషయంలో ముందే వైద్యులను సంప్రదించి, మందుల మోతాదుల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలి.

పల్మనరీ హైపర్‌టెన్షన్‌: గుండె వైఫల్యం, రుమాటిక్‌ గుండె జబ్బుల వంటి ఇతరత్రా గుండె సమస్యలున్న పిల్లల్లో కొందరికి- వూపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తపోటు చాలా పెరిగిపోతుంటుంది. ఇలాంటి గుండెజబ్బులేవీ లేకుండానూ కొందరికి ఈ రకం రక్తపోటు రావొచ్చు. వీళ్లకు వైద్యులు దీర్ఘకాలం వైద్యం చేస్తుంటారు. ఇలాంటి సమస్య ఉన్న పిల్లలను కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే వీళ్లు ఎండలో ఎక్కువగా తిరిగితే ‘వేసోవేగల్‌ సింకోప్‌’ అనే సమస్య తలెత్తుతుంది. దీనిలో ఉన్నట్టుండి రక్తపోటు (బీపీ) బాగా తగ్గిపోయి, కింద పడిపోతారు. మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రకం గుండె సమస్యలున్న పిల్లలు వేసవి ఎండల్లో అస్సలు తిరగకూడదు. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు