Published : 14 Aug 2018 01:48 IST

‘కనిపెట్టుకోవాల్సిన’ ఒత్తిడిది!

‘కనిపెట్టుకోవాల్సిన’ ఒత్తిడిది!

ఇంట్లో ఎవరైనా దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. సమయానికి అవసరమైన సపర్యలు చేయాల్సి ఉంటుంది. ఇది అత్యవసరమే గానీ ఇలాంటివారిని కనిపెట్టుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే తెలియకుండానే ఒత్తిడి మీద పడటం మొదలవుతుంది. ఒకరకంగా దీన్ని ‘సపర్యల ఒత్తిడి’ అనుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు దీనికి ఎక్కువగా గురవుతుంటారు. త్వరగా అలసిపోవటం, ఎప్పుడు చూసినా నిస్సత్తువగా అనిపించటం, నిద్ర లేచిన తర్వాత కూడా హుషారుగా లేకపోవటం, మాటిమాటికీ జలుబు వంటి జబ్బులు అంటుకోవటం, సమయం దొరక్కపోవటం వల్లనో నిర్లక్ష్యం మూలంగానో సొంత అవసరాలనూ పట్టించుకోకపోవటం, పనుల్లో సంతృప్తి దొరక్కపోవటం వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. చివరికి మనం కనిపెట్టుకునేవారిపైనా చీటికీ మాటికీ చిరాకు పడటం, నిస్సహాయతలో పడిపోవటం కూడా తలెత్తుతుంది. చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ దీన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. మనం బాగుంటేనే ఆప్తులను చక్కగా చూసుకోవటం వీలవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇలాంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందొచ్చు.

* అంగీకరించటం: ప్రేమతో సపర్యలు చేస్తున్నామే గానీ ఇదేమీ ‘తప్పనిసరి భారం’ కాదనే విషయాన్ని అంగీకరించటం అన్నింటికన్నా ముఖ్యం. ఇలాంటి భావనను అలవరచుకోవటం ఎంతో మంచిది. దీంతో మనసులో నిరుత్సాహం ఆవరించకుండా చూసుకోవచ్చు. ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపించినా కూడా ఇలాంటి ఆలోచన కొండంత అండగా నిలుస్తుంది. కొత్త శక్తిని సంతరించుకునేలా చేస్తుంది. చిరాకు పడటం, విసుక్కోవటం వంటివి తగ్గుముఖం పడతాయి.

* దక్కిన అవకాశం: మనకు ఎన్నో పనులు ఉండొచ్చు. నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉండొచ్చు. అయినా కూడా ఆత్మీయులను కనిపెట్టుకోవటాన్ని మనం తెలిసి ఎంచుకున్న అవకాశంగా గుర్తించాలి. సేవలు, సపర్యలు చేయటంతో ఒనగూడే ప్రయోజనాలపై, సంతృప్తిపై దృష్టి పెట్టటం మంచిది. చిన్నప్పట్నుంచీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తల్లిదండ్రులను కష్టకాలంలో కాపాడుకుంటున్నామని అనుకుంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇలా పెద్దలకు, ఆత్మీయులకు సేవ చేసే విషయంలో మనం పిల్లలకు ఆదర్శంగానూ నిలుస్తున్నామనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ఇది ఇబ్బందులను ఎదుర్కోవటానికి అవసరమైన మనో నిబ్బరాన్ని కలిగిస్తుంది.

* సొంత అవసరాలు: ఆపద సమయాల్లో పరిస్థితికి తగ్గట్టుగా మసలుకోవటం మంచిదే కావొచ్చు గానీ సొంత అవసరాలను, పనులను నిర్లక్ష్యం చేయాల్సిన పనిలేదు. మన అస్తిత్వాన్ని, ఉనికిని పోగోట్టుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమవకుండా సమయం దొరికినప్పుడల్లా బయటకు వెళ్లటం మంచిది. పెళ్లిళ్ల వంటి వేడుకులకు వెళితే నలుగురితో కలిసినట్టూ ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. పుస్తకాలు చదవటం వంటి హాబీలు మనసును చురుకుగా ఉంచుతాయి.

* ఇతరుల సాయం: కొందరు పెద్దరికంతోనో, మొహమాటంతోనో అన్ని పనులనూ తామే చేస్తుంటారు. దీని కన్నా వీలున్నప్పుడు కుటుంబ సభ్యుల, బంధువుల, స్నేహితుల సాయం తీసుకోవచ్చు. దీంతో కొంత వెసులుబాటు కలుగుతుంది. ఒత్తిడీ తగ్గుతుంది. ఇబ్బందులను, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకునే మార్గాలపై దృష్టి పెట్టటం ముఖ్యం.

చిన్న చిన్న ఆనందాలు: కొన్నిసార్లు.. ముఖ్యంగా నయం కాని జబ్బులతో బాధపడుతున్నవారికి సేవలు చేస్తున్నప్పుడు ఒకోసారి తీవ్ర నిరాశ, నిరుత్సాహం ముంచుకొస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అప్పటివరకు మనం చేసిన ప్రయత్నాలను గుర్తుకుతెచ్చుకుంటే ఎంతో ఉత్సాహం లభిస్తుంది. ఆత్మీయులు ఎదుర్కొంటున్న జబ్బులను నయం చేయలేకపోవచ్చు గానీ వారు ఆనందంగా, సంతోషంగా ఉండటానికి అవసరమైన పనులను చేస్తున్నామనే విషయం మనకూ ఆనందాన్ని కలగజేస్తుంది.

వ్యాయామం, ధ్యానం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. ఇది శారీరకంగానే మానసికంగానూ మనల్ని ఉత్తేజితం చేస్తుంది. అలాగే ధ్యానం, యోగా వంటివీ ఎంతో మేలు చేస్తాయి. ఆహారం విషయంలోనూ నిర్లక్ష్యం పనికిరాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు