Published : 17 Jan 2016 13:44 IST

ఉదర వేదన

ఉద‌ర వేద‌న‌


  ‘సమదోషః సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః
ప్రసన్నాత్మేంద్రియమనాః స్వస్థయిత్యభిదీయతే’’

వాతపిత్తకఫములు సమస్థితిలో స్వస్థానములలో ఉండటం.. జఠరాగ్ని హెచ్చుతగ్గులు లేకుండా ఉండటం.. రసం, రక్తం, మొదలైన సప్త ధాతువులు సరైన స్థితిలో ఉండటం.. మలమూత్రాదులు సక్రమంగా బయటకు పోతుండటం.. ఆత్మ, ఇంద్రియాలు, మనసు ప్రసన్నమైన స్థితిలో ఉండటమే ‘చక్కటి ఆరోగ్యం’ కోటి విద్యలూ.. శతకోటి తిప్పలూ.. జానెడు పొట్ట కోసమే అంటుంటాం. నిజమే!! ఆ జానెడు పొట్ట బాగున్నంత కాలం ఏదో తంటాలు పడుతుంటాం.. అంతా బాగానే నడిచిపోతుంటుంది. కానీ అది మొండికేసిన నాడు తెలుస్తుంది మనకు.. దాని ప్రాముఖ్యం ఏమిటో!  

అజీర్ణం, అసిడిటీ, కడుపుబ్బరం.. ఈ ఉదర బాధలకు అంతు లేదు! అసలు తినాలనే అనిపించక పోవటం నుంచి ఏమి తిన్నా విరేచనాల వరకూ.. ఈ ఉదర సంబంధ సమస్యల చిట్టా అనంతం. అందుకే నేడు కడుపు చేతబట్టుకుని వైద్యుల చుట్టూ తిరుగుతున్న వారికీ అంతుండటం లేదు. ఉదర బాధల్లో చాలాభాగం మన స్వయంకృతాలు. ఆధునికత మన 

హారాన్నీ, అలవాట్లనూ, మొత్తం జీవనశైలినే మార్చివేస్తోంది. విపరీతమైన మానసిక ఒత్తిడి నుంచి వింతవింత విరుద్ధాహారాల సేవనం వరకూ.. అవాంఛనీయమైనవే ఎక్కువ. మన ఆహారపుటలవాట్లు, జీవనశైలిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవటం తక్షణావసరం. నిత్యం వేధించే జీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలున్నాయి. ఈ చిన్నాచితకా సమస్యలకు తొలిదశలోనే మందులు వాడుకుంటే ఫలితాలూ బాగుంటాయి. అందుకే తరచూ ఎదురయ్యే కొన్నిరకాల జీర్ణ సమస్యలకు ఆయుర్వేదపరంగా విరుగుడు ఏమిటో సవివరంగా మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!

చక్కటి ఆరోగ్యానికి ఆహారం, విహారం రెండూ కీలకమైనవే! ఆహారం అంటే రోజూ తినే పదార్థాలు. విహారం అంటే నిద్రలేచింది మొదలు పడుకునే వరకు మనం నిత్యం చేస్తుండే పనులు. ఆయుర్వేదం ప్రకారం మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం... రెండూ కూడా మనం తీసుకునే ఆహారం, మనం అనుసరించే విహారాదుల మీదనే ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి మనం తినేదంతా ‘ఆహారం’ అనుకోలేం. తిన్న తర్వాత పూర్తిగా జీర్ణమయ్యేదే ‘ఆహారం’ అని నొక్కి చెబుతోంది ఆయుర్వేదం. అలాంటి ఆహారమే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది సరిగా లేకపోతే జీర్ణక్రియ దెబ్బతింటుంది. మనం తిన్న ఆహారం.. జఠరాగ్నితో పచనమవుతుంది. అనంతరం ఇది రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే సప్త ధాతువులుగా మారుతుంది. ఈ ధాతువులే మన శరీరాన్ని పోషిస్తాయి. ఇవి సరైన మోతాదులో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఆరోగ్యానికి మూలమైన సప్తధాతువులు సరిగ్గా ఉండాలంటే తిన్న ఆహారం పూర్తిగా పచనం కావటం అత్యవసరం. సంపూర్ణ ఆహారం, హితమైన ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

ఆయుర్వేదంలో ఆహారానికి విశిష్టమైన స్థానం ఉంది. ఆహారం ఎలా తయారు చేయాలి? ఏ రకంగా తీసుకోవాలి? ఏ ఆహారం పనికి వస్తుంది? ఏది పనికి రాదు? ఏది హితమైనది? ఏది కాదు? వంటి విషయాలను ఆయుర్వేదం ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. శరీరానికి ఉపయోగపడేదే హితమైన ఆహారం. ఒక దానితో మరోటి పొసగని పదార్ధాలను ‘విరుద్ధాహారం’ అంటారు. వీటిని గురించి తెలుసుకోవటం చాలా అవసరం. తెలిసో తెలియకో ఈ ఆధునిక కాలంలో విరుద్ధాహారాలను తీసుకోవటం ఎక్కువ అవుతోంది. ఉదాహరణకు ‘రాత్రౌ దధీ న భుంజీత’అని చెప్పారు. అంటే రాత్రిపూట పెరుగు తినరాదు. అలాగే ‘సర్వంచ ఆమ్లం పయసా సహ విరుద్ధం’.. అంటే పుల్లగా ఉండే పదార్థాలను పాలతో కలిసి తీసుకోరాదు. ‘కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్‌’.. ఒకసారి వండిన అన్నం, కూరలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినరాదు. ‘ఘృతం తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్‌’.. ఒకసారి వేడిచేసిన నూనె, నెయ్యిలను మళ్లీ కాచి ఉపయోగించరాదు. అలాగే విపరీతమైన ఉష్ణోగ్రతల్లో.. మంటల మీద.. కాల్చిన, వండిన ఆహారాన్నివిదగ్ధ ఆహారం అంటారు. ఇటువంటి వాటిని తీసుకోవటం తగదు. ఈ విరుద్ధ, విదగ్ధ ఆహారాలను తీసుకుంటే ఎనిమిది మహా వ్యాధులు వస్తాయని చెబుతోంది ఆయుర్వేదం. ఉదర వ్యాధులూ ఈ మహా వ్యాధుల్లో భాగమే. ఉదరానికి సంబంధించి ఏడు రకాల వ్యాధులు చాలా తరచుగా వేధిస్తుంటాయి. 1. ఆకలి లేకపోవటం (అగ్నిమాంద్యం) 2. అజీర్ణం 3. ఆమ్లపిత్తం 4. కడుపు నొప్పి (ఉదర శూల) 5. మలబద్ధకం 6. అతిసారం 7. గ్రహణి. వీటి గురించి వివరంగా చూద్దాం.

 ఆకలి లేమి (అగ్నిమాంద్యం)

మనం తిన్న ఆహారాన్ని పచనం చేసేది జఠరాగ్ని. అది మందగించి, చేయాల్సిన పనిని సరిగా చేయకపోవటాన్నే ‘అగ్నిమాంద్యం’ అంటారు. ఈ జఠరాగ్ని వికారాలు తీక్ష్ణాగ్ని, మందాగ్ని, విషమాగ్ని అని మూడు రకాలు. తీక్ష్ణాగ్నిలో ఎంత తిన్నా ఆహారం వెంటనే జీర్ణమైపోతుంటుంది. మందాగ్నిలో కొంచెం తిన్నా అరగదు. విషమాగ్నిలో ఒకప్పుడు జీర్ణమవుతుంది, మరోసారి అసలే కాదు. ఇవి కాకుండా సమాగ్ని అనేది మరో రకం. ఇందులో అన్నం సరైన క్రమంలో జీర్ణమవుతుంది. ఇది ఆరోగ్యకారకం. కఫ దోషంతో కూడుకొని ఉండే మందాగ్ని 20 రకాల వ్యాధులకు కారణమవుతుంది. పిత్తదోషంతో కూడిన తీక్ష్ణాగ్ని 40, వాతదోషంతో నిండిన విషమాగ్ని 80 వ్యాధులకు దోహదం చేస్తాయి. ఈ 140 వ్యాధులకు జఠరాగ్ని వికారమే కారణం కావటం గమనార్హం. ఇదే ఇతరత్రా వ్యాధులకూ దోహదం చేస్తుంది.
లక్షణాలు
అగ్నిమాంద్యం అజీర్ణం లక్షణాలు దాదాపు ఒకలాగే ఉంటాయి. అగ్నిమాంద్యమే చివరికి అజీర్ణానికి దారి తీస్తుంది కూడా.
*ఆకలి లేకపోవటం  *తిన్నది జీర్ణం కాకపోవటం  *కడుపులో బరువుగా ఉండటం
*బడలికగా అనిపించటం  *పొట్ట ఉబ్బరం
* మందు: శొంఠి చూర్ణం
* ఎలా: గోరువెచ్చని నీటిలో రెండు గ్రాముల చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
* మందు: చిత్రకాది వటి
* ఎలా: ఉదయం, సాయంత్రం భోజనానంతరం 2 మాత్రలు చొప్పున తీసుకోవాలి.

అజీర్ణం

ఇది మూడు రకాలుగా.. ఆహారం, విహారం, మానసిక పరంగా... వస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగటం, మితి మీరి ఆహారం తినటం, లేదా తక్కువగా తినటం, వేళకు భోజనం చేయకపోవటం, శరీరానికి పడని ఆహారం తీసుకోవటం, అధికంగా మద్యపానం వంటివి ఆహారపరంగా అజీర్ణానికి దోహదం చేస్తాయి. మల మూత్రాలను ఆపుకోవటం, పగటి నిద్ర వంటివి విహారపరంగా అజీర్ణాన్ని కలగజేస్తాయి. ఈర్ష్య, కోపం, అసూయ, భయం, ఆందోళన వంటి మానసిక అంశాలూ అజీర్ణాన్ని తెచ్చిపెడతాయి. దీనికి చికిత్స తప్పనిసరి.

లక్షణాలు
తీవ్రతను బట్టి అజీర్ణాన్ని నాలుగు స్థాయుల్లో విభజించొచ్చు. వీటిల్లో కనిపించే లక్షణాలు.
*శరీరం బరువుగా అనిపించటం, నోట్లో నీరూరుతుండటం  *ఏమి తింటే అవే త్రేన్పులు వస్తుండటం
*అధికంగా దాహం, ఒళ్లు తిరగటం, ఒళ్లు నొప్పులు  *ఎక్కువగా చెమట పోయటం  *కడుపులో నొప్పి, కడుపుబ్బరం 

*మలం, మూత్రం, అపానవాయువులు సరిగా బయటకు వెళ్లకపోవటం
*తీవ్రమైన దశలో అన్నద్వేషం (ఆహారాన్ని చూసినా సరే వికారం పుడుతుంది)
అజీర్ణం, అగ్నిమాంద్యానికి.. ఉదయం, సాయంత్రం 5 మిల్లీలీటర్ల అల్లపు రసాన్ని సరిసమానమైన నీటితో కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. సగం చెంచా జీలకర్ర బాగా నమిలి మింగినా మంచిదే.
మందు: సౌభాగ్య శొంఠి లేహ్యం
ఎలా: ఉదయం, సాయంత్రం భోజనానంతరం 5 గ్రాములు తీసుకోవాలి.
మందు: జీరకాద్యారిష్ట
ఎలా: ఉదయం, సాయంత్రం భోజనం చేశాక 30 ఎంఎల్‌ తీసుకోవాలి.
పెరుగు వద్దు. మజ్జిగ మేలు.

గ్రహణి

ప్రస్తుతం ఎంతోమంది గ్రహణితో బాధపడుతున్నారు. విరేచనం కొన్నిసార్లు గట్టిగా, కొన్నిసార్లు నీళ్లరూపంలో (ముహుర్‌బద్ధం ముహుర్‌ద్రవం) రావటం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. కడుపులో నొప్పితో పాటు విరేచనం సాఫీగా అయిన భావన లేకపోవటం కూడా ఉంటుంది. దీనికి కూడా ఆహారమే దోహదం చేసినప్పటికీ ఇందులో ‘సందూషితో వహ్ని’ అంటే.. జఠరాగ్ని అధికంగా దూషితమవుతుంది. కాబట్టి దీనికి చికిత్స చేయటం కొంచెం కష్టమే అనుకోవచ్చు. యవ్వనంలో ఉండేవారిలోనే ఇది ఎక్కువ.
మందు: బిల్వాది వటి
ఎలా: రెండు మాత్రల చొప్పున రోజూ మూడు పూటలా తీసుకోవాలి.
మందు: కుటజఘనవటి
ఎలా: రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం
- వీటిని క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు వాడాల్సి ఉంటుంది. మజ్జిగ తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.
* మారేడుకాయ గుజ్జును 5 గ్రాముల చొప్పున మజ్జిగతో కలిపి రోజుకి రెండు పూటలా తాగితే గ్రహణి చాలావరకూ నయమవుతుంది.

మలబద్ధకం

మలబద్ధకం కారణంగా మలం బయటకు రాకుండా లోపలే ఉండటం వల్ల ఇతర వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీనిని సరిదిద్దుకోవటం ఎంతో అవసరం.
*ఎండు ఖర్జూరం గానీ ఎండుద్రాక్ష గానీ 5 పండ్లను కప్పు నీటిలో నానబెట్టుకుని తిన్నా ఫలితం ఉంటుంది. వీటిని ఉదయం నానేస్తే సాయంత్రం, రాత్రి నానేస్తే ఉదయం తినాలి. పండ్లను నానేసిన నీటిని కూడా తాగాలి. వీటితో శరీరానికి బలం కూడా చేకూరుతుంది.
*రెండు గ్లాసుల నీటిలో 15 సునాముఖి ఆకులు వేసి గ్లాసు నీరు మిగిలేంత వరకు కాచాలి. ఈ కషాయాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే మలబద్ధకాన్ని బాగా వదిలిస్తుంది.
* మందు: స్వాదిష్ట విరేచన చూర్ణం లేదా అవిపత్తికర చూర్ణం
* ఎలా: రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వీటిలో ఏదో ఒక దానిని గోరువెచ్చని నీటిలో 10 గ్రాములు కలిపి తాగాలి.
*రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే కూడా సామాన్యమైన మలబద్ధకం తగ్గిపోతుంది.

ఆమ్లపిత్తం (అసిడిటీ)

చాలామంది దీన్నే గ్యాస్‌, ఎసిడిటీ అంటారు. విరుద్ధాహారం.. ఎండిపోయిన, చెడిపోయిన, నిల్వ ఉన్న ఆహారం.. ఎక్కువగా పుల్లగా ఉన్న ఆహారం.. మంట పుట్టించే ‘విదాహి’ ఆహారం (కారం, మసాలాల వంటివి) తింటే ఆమ్లపిత్తం వస్తుంది. దీనిని తొలిదశలో పూర్తిగా తగ్గించొచ్చు. దీర్ఘకాలంగా ఉంటే కొద్దిగా కష్టం.
ఆమ్లపిత్తం: ఒక చెంచా ధనియాలను నోట్లో వేసుకొని నములుతూ రసాన్ని మింగాలి. తర్వాత పిప్పి కూడా మింగేయాలి.
లక్షణాలు: ఆమ్లపిత్తం ఇది రెండు రకాలుగా ఉంటుంది. వీటిల్లో కనిపించే లక్షణాలు...
చేదుగా, పుల్లగా త్రేన్పులు రావటం (ఆమ్లోద్గారం)
ఆహారం జీర్ణం కాకపోవటం, బడలిక, వికారం, రుచి లేకపోవటం
అగ్నిమాంద్యం.. ఛాతీలో, గొంతులో మంట  *మనసు చంచలంగా ఉండటం, నోట్లో నీరూరటం
దాహం, చెమట ఎక్కువగా ఉండటం  *రోమాలు నిక్కబొడుచుకోవటం  *తలనొప్పి, అరికాళ్లలో మంట  *దురద, పొడలు, బొబ్బలు
* మందు: లఘు సూర్యావర్తి
* ఎలా: 250 మి.గ్రా. మాత్రలు ఉదయం రెండు, సాయంత్రం రెండు. భోజనానికి ముందు.
* మందు: శతావరి చూర్ణం
* ఎలా: ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 2 గ్రాముల చొప్పున పాలల్లో వేసుకొని తాగాలి
* పెరుగు నిషేధం. మజ్జిగ సేవ్యం

అతిసారం

అతీవ సరణం అతీసారం.. అంటే శరీరం నుంచి ద్రవాలు అధికంగా బయటకు పోవటం అన్నమాట. ఆహారం సరిగా పచనం కాకపోవటంతో అది విషతుల్యంగా మారి అతిసారం తలెత్తుతుంది. కలుషిత నీరు, ఆహారం.. అధిక వేడి, చల్లటి పదార్థాలు తినటం.. విరుద్ధాహారం తీసుకోవటం, ఎక్కువగా నీరు తాగటం.. మితిమీరిన మద్యపానం.. క్రిముల వంటివి దీనికి కారణమవుతాయి. నీరు ఎక్కువగా బయటకు పోవటం వల్ల శరీరం వేగంగా శుష్కించిపోతుంది. కాబట్టి దీనిని వెంటనే మందులతో అరికట్టాలి. లేకపోతే ప్రాణాపాయం సంభవించొచ్చు.
* అతిసారం: చెంచా మెంతులను మూడు చెంచాల పెరుగులో నానేసి తినాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే అతిసారం కడుతుంది.
* మందు: జాతీ ఫలాది చూర్ణం
* ఎలా: ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత 3 గ్రాముల చొప్పున మజ్జిగతో తీసుకోవాలి.
* మందు: కుటజారిష్ట
* ఎలా: ఉదయం సాయంత్రం భోజనం తర్వాత 20 ఎం.ఎల్‌ మందు నీరు లేదా మజ్జిగతో కలిపి తీసుకోవాలి.

నొప్పి (శూల)

ఉదరశూల మూడు భాగాల్లో కనిపిస్తుంది. వ్యాయామం, సంభోగం, ప్రయాణం, ఆహారం, చల్లటి నీళ్లు, ఉపవాసం, నవ్వటం.. ఇలాంటివి మితి మీరితే ఉదరశూలకు దారి తీస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ తినటం కూడా కారణమే. ఇలాంటి సందర్భాల్లో ఛాతీలో, ఛాతీ రెండు పక్కలా నొప్పి వస్తుంది. కారం, పులుపు, వేయించిన, వేడిచేసే పదార్థాలు ఎక్కువగా తినటం.. ఎండలో అధికంగా తిరగటం వల్ల నాభి దగ్గర నొప్పి వస్తుంది. పాలతో చేసిన పదార్థాలు, చెరుకు రసం, పిండితో, నువ్వులతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల బొడ్డు కింద ఆమాశయంలో నొప్పి వస్తుంది.
ఇవి కాకుండా నొప్పితో పాటు కడుపులో గుడగుడ శబ్దం, వికారం, వాంతి రావటమూ మరో రకం శూలలో కనిపిస్తాయి.

లక్షణాలు
* తిన్న ఆహారం జీర్ణమయ్యే సమయంలో నొప్పి (పరిణామ శూల -భుక్తే జీర్యతే యత్‌ శూలం పరిణామ శూల)
*అన్నం జీర్ణమయినా కాకపోయినా ఎప్పుడూ (అన్నద్రవ శూల) నొప్పి కలగటం
* ఉదరశూల: అరకప్పు నీటిలో చెంచా ఆవు నెయ్యి, పావు చెంచా కన్నా తక్కువ రాళ్ల ఉప్పు కలిపి తాగాలి.
* మందు: శంఖవటి
* ఎలా: ఉదయం, సాయంత్రం ఆహారం తిన్న తర్వాత గోరువెచ్చని నీటితో రెండు మాత్రల చొప్పున వేసుకోవాలి.
* మందు: భాస్కర లవణ చూర్ణం
* ఎలా: ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత 5 గ్రాముల చూర్ణం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు