ధ్యానం ఎంతో మేలు!

రోజువారీ పనులతో విసుగెత్తిపోయినప్పుడు కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకుంటే కొత్త హుషారు పుట్టుకొస్తుంది.

Published : 08 Nov 2016 01:27 IST

ధ్యానం ఎంతో మేలు!

రోజువారీ పనులతో విసుగెత్తిపోయినప్పుడు కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకుంటే కొత్త హుషారు పుట్టుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అయితే యాత్రలతో లభించే ఇలాంటి ప్రయోజనాలు కొద్దిరోజులే ఉంటాయి. కానీ ధ్యానం, యోగాతో ఒనగూడే సానుకూల ప్రభావాలు చాలాకాలం వరకూ కొనసాగుతున్నట్టు తాజాగా బయటపడింది.

ధ్యానం, యోగా వంటి ఏకాగ్రతతో కూడిన పద్ధతులు శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, నొప్పి వంటివి తగ్గటానికి తోడ్పడతాయి. అంతేకాదు.. శరీరంలో వాపు ప్రక్రియను తగ్గించటంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించటానికీ దోహదం చేస్తాయి. ఈ విషయంలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. రిసార్ట్‌లకు వెళ్లి కేవలం విశ్రాంతిగా గడిపిన వారిలోనూ.. ధ్యానం, యోగా పద్ధతులను పాటించినవారిలోనూ ఒత్తిడి, కుంగుబాటు గణనీయంగా తగ్గినట్టు బయటపడింది. విచిత్రమేంటంటే.. ధ్యానం, యోగా చేసినవారిలో ఈ సానుకూల ప్రభావాలు 10 నెలల తర్వాత కూడా కనబడుతుండటం. విశ్రాంతిగా గడిపినవారిలో ఇవి కొద్దికాలం పాటే కొనసాగాయి. అంతేకాదు యోగా, ధ్యానంతో రోగనిరోధకశక్తి సైతం మరింత ఎక్కువగా మెరుగుపడింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించటానికి తోడ్పడే సంక్లిష్ట జన్యు మార్పులనూ ఇవి ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అందువల్ల విశ్రాంతి కోసం రిసార్ట్‌లకు, యాత్రలకు వెళ్లేవారు కాసేపు ధ్యానం, యోగా మీద కూడా దృష్టి పెట్టటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో దీర్ఘకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని