గుండె లోపం పట్టుకోండి!

మన శరీరంలోని ఏ అవయవం పనిచేయాలన్నా తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అందాలి. వీటిని రక్తం ద్వారా సరఫరా అయ్యేలా చేసేది పిడికెడు గుండె. అలాంటి గుండె నిర్మాణమే అస్తవ్యస్తమైతే? పిండం దశ నుంచే గుండె లోపాలు మొదలవుతాయి.

Updated : 13 Feb 2024 09:30 IST

ఇది పుట్టు గుండె లోపాల అవగాహన వారం  

మన శరీరంలోని ఏ అవయవం పనిచేయాలన్నా తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అందాలి. వీటిని రక్తం ద్వారా సరఫరా అయ్యేలా చేసేది పిడికెడు గుండె. అలాంటి గుండె నిర్మాణమే అస్తవ్యస్తమైతే? పిండం దశ నుంచే గుండె లోపాలు మొదలవుతాయి. ఇవి ఆక్సిజన్‌తో కూడిన ‘మంచి’ రక్తం, కార్బన్‌ డయాక్సైడ్‌తో కూడిన ‘చెడు’ రక్తం కలిసిపోయేలా చేసి రకరకాల సమస్యలను తెచ్చిపెడతాయి. అదృష్టమేంటంటే- గుండె లోపాలన్నింటికీ చికిత్సలు అందుబాటులో ఉండటం. ముందుగానే గుర్తించే వీలుండటం. నివారించుకోవటమూ సాధ్యమే.

మనదేశంలో రోజూ ప్రతి వెయ్యి కాన్పుల్లో 10 మంది శిశువులు.. అంటే ఒక శాతం మంది గుండె లోపాలతో పుడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 20వేల మంది పిల్లల్లో ఇవి బయట పడుతున్నాయి. అయితే 20% మంది శిశువులకే సరైన సమయంలో చికిత్స అందుతోంది. దీనికి ప్రధాన కారణం గుండె లోపాల మీద సరైన అవగాహన లేకపోవటం. మనదగ్గర పిల్లల్లో ఏ గుండెజబ్బునైనా రంధ్రాలేనని అనుకోవటం, అవి వాటంతటవే పూడుకు పోతాయని భావించటం చాలామంది చేసే పొరపాటు. దీంతో జబ్బు బాగా ముదిరిపోయాక గానీ గుండె నిపుణులను సంప్రదించటం లేదు. మరోవైపు సంక్లిష్టమైన గుండె లోపాలకు చాలా చోట్ల తగు చికిత్స సదుపాయాలు లేకపోవటం.. పేదరికం వంటి కారణాలతోనూ ఎంతోమంది పిల్లలు శస్త్రచికిత్సలకు నోచుకోవటం లేదు. గుండె లోపాలను ముందుగానే గుర్తించి, వీలైనంత త్వరగా చికిత్స చేయిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి పుట్టు గుండె లోపాల (కంజెనిటల్‌ హార్ట్‌ డిఫెక్ట్స్‌) అవగాహన వారం సందర్భంగా వీటి గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉండటం అవసరం. గుండె లోపాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది గుండెలో రంధ్రాలు. నిజానికి ఇవొక్కటే కాదు.. చాలారకాల గుండె లోపాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైనవి, తరచూ చూసే సమస్యల గురించి తెలుసుకుందాం.


గుండెలో రంధ్రాలు (సెప్టల్‌ డిఫెక్ట్స్‌)

ప్రధాన గుండె లోపాలు ఇవే. మన గుండెలో నాలుగు గదులుంటాయి. పై రెండు గదులైన కర్ణికల మధ్యలో.. అలాగే కింది రెండు గదులైన జఠరికల మధ్యలో గోడలాంటి పొర (సెప్టమ్‌) ఉంటుంది. కర్ణికల మధ్య పొరను ఏట్రియల్‌ సెప్టమ్‌, జఠరికల మధ్య పొరను వెంట్రిక్యులార్‌ సెప్టమ్‌ అంటారు. ఇది మంచి, చెడు రక్తం కలిసిపోకుండా అడ్డుకుంటుంది. నిజానికి గుండె గదుల మధ్య రంధ్రం సహజమనే చెప్పుకోవాలి. పిండంలో చెడు రక్తాన్ని తల్లి శరీరమే శుద్ధి చేస్తుంది. ఈ రక్తం పిండానికి చేరుకోవటానికి పై రెండు గదుల మధ్య సహజంగా ఏర్పడే రంధ్రం (ఫొరామినా ఒవేల్‌) తోడ్పడుతుంది. బిడ్డ పుట్టి.. శ్వాస పీల్చుకొని, ఊపిరితిత్తులు పనిచేయటం మొదలెట్టాక దీని అవసరం ఉండదు. అందువల్ల క్రమంగా.. 4-6 వారాల్లో పూర్తిగా మూసుకుపోతుంది. కానీ కొందరిలో అలాగే తెరచుకునే ఉంటుంది. పుట్టు గుండె లోపాల్లో ఎక్కువగా. సుమారు 25% వరకూ కనిపించేవి జఠరికల మధ్య రంధ్రాలే. కొందరికి గుండె ప్రధాన రక్తనాళాల్లోనూ రంధ్రాలు ఏర్పడొచ్చు. ఎడమ జఠరిక నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమని, కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు పోయే పుపుస ధమని మొదట్లో ఒకటిగానే ఉంటాయి. పిండం ఏర్పడే క్రమంలో ఇవి రెండుగా విడిపోతాయి. వీటి మధ్యలోనూ ఒక గోడ (అయోర్టో పల్మనరీ సెప్టమ్‌) ఉంటుంది. సాధారణంగా ఇది రెండు మూడు దిశల నుంచి వచ్చి, దగ్గరకు అతుక్కుపోతుంది. ఈ పొర సరిగా కలవకపోయినా, పూర్తిగా ఏర్పడకపోయినా రంధ్రాలు (అయోర్టో పల్మనరీ విండో) ఏర్పడే ప్రమాదముంది. కొందరికి గుండె మధ్యలో నాలుగు గదుల పనితీరును దెబ్బతీసేలా పెద్ద రంధ్రమూ (ఏవీ కెనాల్‌ డిఫెక్ట్‌) ఉండొచ్చు. కొన్నిసార్లు బృహద్ధమనిని, పుపుస ధమనిని కలిపే గొట్టం మూసుకోకుండా ఉండొచ్చు (పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసస్‌). ఇలాంటి రంధ్రాలన్నీ పిల్లల్లో చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి, చిక్కులు తెచ్చిపెడతాయి.

గుర్తించేదెలా?

గుండెలో రంధ్రాల ఆనవాళ్లను తల్లిదండ్రులు తేలికగానే గుర్తించొచ్చు. ఇలాంటి శిశువులు పుట్టిన నెల తర్వాత డొక్కలు ఎగరేస్తుంటారు. శ్వాస చాలా వేగంగా తీసుకుంటారు. పాలు సరిగా తాగరు. కాసేపు పాలు తాగి, అలసిపోయి నిద్రపోతుంటారు. మళ్లీ నిద్రలేచి, పాలు తాగుతుంటారు. కొందరు పిల్లలకు పాలు తాగేటప్పుడు విపరీతంగా చెమటలు పడుతుంటాయి. పాలు బాగా తాగినా శిశువు సరిగా ఎదగకపోవచ్చు. తరచూ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లూ వస్తుండొచ్చు. గుండె గదులు, రక్తనాళాల మధ్య రంధ్రాలు ఉండటం వల్ల ఎడమ జఠరిక నుంచి కుడి జఠరికకు, ఎడమ కర్ణిక నుంచి కుడి కర్ణికకు, బృహద్ధమని నుంచి పుపుస ధమనికి రక్తం ప్రసారమవుతుంది. ఇది పెద్దమొత్తంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీంతో ఊపిరితిత్తులు బాగా తడిగా అవుతాయి. ఫలితంగా తరచూ న్యుమోనియా బారిన పడుతుంటారు. కొన్నిసార్లు ఈ న్యుమోనియా మూలంగానే పిల్లల్లో గుండె రంధ్రాలు బయటపడుతుండటం గమనార్హం.
నిర్ధరణ-చికిత్స: గుండె రంధ్రాలు గల పిల్లలను ముందు నిశితంగా పరిశీలించి ఎక్స్‌రే, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్‌ చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. మూడు నెలల్లోపు పిల్లలైతే ఒంట్లో నీటిని తగ్గించే మందులిస్తారు. నిజానికి గుండె గదుల మధ్య రంధ్రాలు దాదాపు 60% మందిలో వాటంతటవే పూడుకుపోతాయి. కానీ మనదగ్గర అన్ని రంధ్రాలూ అవే పూడుకుంటాయని అనుకొని, ఇంటిదగ్గరే ఉండిపోతుంటారు. ఇది తప్పు. కొందరికి రంధ్రాలు పెద్దగా ఉండొచ్చు. ఇవి సహజంగా పూడుకోవు. కొన్నిచోట్ల ఏర్పడే రంద్రాలు.. ముఖ్యంగా ఏపీ విండో, ఏవీ కెనాల్‌ లోపాలు మూసుకుపోవు. వీటిని శస్త్రచికిత్స చేసి సరిచేయాల్సిందే. ఛాతీని పూర్తిగా తెరచి గానీ తొడలోంచి వెళ్లి ట్రాన్స్‌కాథటార్‌ బటన్‌(కోనార్‌ ఎంఎఫ్‌)తో గానీ రంధ్రాన్ని మూసేయాల్సి ఉంటుంది. కాబట్టి గుండెలో రంధ్రం పూడుకుంటోందా? లేదా? అని తరచూ డాక్టర్‌ సంప్రదించి, పరీక్షించుకోవటం ముఖ్యం. మూసుకు పోనట్టయితే తగు చికిత్స చేయించాలి. గమనించాల్సిన విషయం ఏంటంటే- అన్ని రంధ్రాలను సరిదిద్దే  చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకోవటం. నిరాశ అవసరం లేదు.


కవాట సమస్యలు

గుండె గదుల్లో నాలుగు కవాటాలు (వాల్వ్‌) ఉంటాయి. ఇవి ఒక వైపునకే రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి. వీటిల్లో ఏవైనా సరిగా ఏర్పడక
పోయినా, పూర్తిగా బిగుసుకోకుండా రక్తం లీక్‌ అవుతున్నా సమస్య తలెత్తొచ్చు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం వెళ్లటాన్ని నియంత్రించే కవాటం (పల్మనరీ వాల్వ్‌) లోపాలు ఎక్కువగా చూస్తుంటాం. కొందరికి గుండె నుంచి శరీరానికి రక్తం పంప్‌ కావటానికి తోడ్పడే కవాటం సరిగా బిగుసుకోకపోవచ్చు (అయోర్టిక్‌ స్టెనోసిస్‌). కొందరికి పుట్టిన తర్వాత కొద్ది రోజులకు కవాటం సరిగా మూసుకుపోక రక్తం లీక్‌ కావొచ్చు.

గుర్తించేదెలా?

కవాట సమస్యలు గలవారిలో మామూలుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. లక్షణాలు మొదలయ్యాయంటే గుండె దెబ్బతిన్నదనే అర్థం. ఇలాంటి పిల్లలు శ్రమకు తట్టుకోలేరు. అలసట, నిస్సత్తువకు లోనవుతుంటారు. మంచి విషయం ఏంటంటే- స్టెతస్కోప్‌తో గుర్తించే అవకాశముండటం. వీరిలో గుండె శ్రావ్యంగా కాకుండా గొణుగుతున్నట్టు శబ్దం చేస్తుంది. గుండె చప్పుడు కరుకుగా వినిపిస్తుంది. స్కూళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టటం, ఏదైనా జబ్బుతో ఆసుపత్రికి వచ్చినప్పుడు స్టెతస్కోప్‌తో పరీక్షించినప్పుడు సమస్య బయటపడుతుంటుంది. ఏదైనా అనుమానం వస్తే ఎకో కార్డియోగ్రామ్‌ చేస్తే నిర్ధరణ అవుతుంది.
చికిత్స: కవాటం మూసుకుపోయినవారికి తొడ దగ్గరి నుంచి రక్తనాళం ద్వారా గుండెలోకి బెలూన్‌ను పంపించి, దాన్ని ఉబ్బిస్తారు. దీంతో కవాటాలు వెడల్పు అవుతాయి. కవాటం లీక్‌ అవుతున్నవారికి సర్జరీ చేసి, సరిచేయాల్సి ఉంటుంది. అప్పుడది బిగుతుగా మూసుకుంటుంది.


నీలంగా మారటం (బ్లూ బేబీస్‌)

దీనికి మూలం సైనోటిక్‌ కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌. ఇందులో ముఖ్యంగా మంచి, రక్తం చెడు రక్తం కలిసిపోతుంది. మామూలుగా ధమనుల ద్వారా శరీరమంతా ప్రవహించే మంచి రక్తంలో ఆక్సిజన్‌ 90 నుంచి 100 శాతం వరకూ ఉంటుంది. దీని మూలంగానే చేతులు, పెదవులు, నాలుక ఎర్రగా ఉంటాయి. శరీర భాగాలు ఆక్సిజన్‌ను గ్రహించాక సిరల ద్వారా గుండెకు చేరుకునే చెడు రక్తంలో ఆక్సిజన్‌ తక్కువగా, కార్బన్‌ డయాక్సైడ్‌ ఎక్కువగా ఉంటాయి. రెండూ కలిసిపోతే చర్మం నల్లబడుతుంది. సైనోటిక్‌ కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌లో చాలా రకాలున్నాయి. వీటిల్లో ప్రధానమైనవి మూడు.
1. టెట్రాలజీ ఆఫ్‌ ఫాలో: ఇందులో గుండె జఠరికల మధ్య రంధ్రం పెద్దగా ఉండటమే కాకుండా ఊపిరితిత్తులకు పోయే పుపుస ధమనిలో అడ్డంకీ ఏర్పడుతుంది. దీంతో కుడి జఠరిక నుంచి పుపుస ధమనిలోకి రక్తం సరిగా వెళ్లదు. అప్పుడు చెడు రక్తం రంధ్రం ద్వారా ఎడమ జఠరికకు, అక్కడి నుంచి బృహద్ధమని ద్వారా శరీరానికి సరఫరా అవుతుంది. దీంతో బిడ్డ చేతులు, పెదవులు, నాలుక, చర్మం నీలం రంగులోకి మారతాయి. కొందరికిది పుట్టిన నెలలోనే చాలా తీవ్రం కావొచ్చు (సైనోటిక్‌ స్పెల్‌). వీళ్లు నిద్రలోంచి హఠాత్తుగా లేచి, కళ్లు తేలేస్తారు. బాగా ఆయాస పడుతుంటారు. వేగంగా శ్వాస తీసుకుంటారు. శరీరమంతా నల్లగా అవుతుంది. చెడు రక్తం అంతగా కలవని వారిలో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారానే తెలుస్తుంది. ఒకవేళ పుపుస ధమని పూర్తిగా మూసుకుపోతే వెంటనే నీలంగా మారతారు. సత్వరం చికిత్స చేయాల్సి వస్తుంది.
చికిత్స: వీరికి ప్రాథమికంగా మందులతో సమస్యను నియంత్రిస్తారు. తర్వాత ఆపరేషన్‌ చేస్తారు. లేదా స్టెంటు అమరుస్తారు. మూడు నెలల పిల్లలు మరీ నీలంగా మారితే బీటీటీ షంట్‌ ఆపరేషన్‌ ఉపయోగపడుతుంది. ఇందులో బృహద్ధమని నుంచి అదనపు రక్తనాళాన్ని సృష్టించి, దాన్నుంచి ఊపిరితిత్తులకు నేరుగా రక్తాన్ని పంపిస్తారు. ఈ చికిత్స ప్రమాదమని భావిస్తే పుపుస ధమనిలో అడ్డంకి ఉన్నచోట స్టెంట్‌ అమరుస్తారు. అయితే ఇవి తాత్కాలికమే. తర్వాత వీలును బట్టి శాశ్వత శస్త్రచికిత్స చేస్తారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసులో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసి అడ్డుపడిన భాగాన్ని తొలగిస్తారు. అలాగే గుండె చుట్టూ ఉండే పొరను తీసుకొచ్చి, రంధ్రాన్ని మూసేస్తారు (ఇంట్రాకార్డియాక్‌ రిపేర్‌).
2. ట్రాన్స్‌పొజిషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ వెసల్స్‌: ఇందులో పుపుస, బృహద్ధమనులు మొదలయ్యే స్థానాలు అటూఇటూగా మారతాయి. సాధారణంగా బృహద్ధమని ఎడమ జఠరిక నుంచి, పుపుస ధమని కుడి జఠరిక నుంచి మొదలవుతాయి. కానీ కొందరిలో ఇవి తారుమారు కావొచ్చు. దీంతో మంచి రక్తం ఎడమ జఠరికకు చేరుకొని, అది తిరిగి ఊపిరితిత్తుల్లోకే వెళ్తుంది. అలాగే చెడు రక్తమేమో కుడి కర్ణిక, జఠరికలకు చేరుకొని, అది తిరిగి శరీరానికే సరఫరా అవతుంది. వీరు పుడుతూనే నీలంగా, నల్లగా ఉంటారు. ఆయాసం వస్తుంది. గుండె గదుల మధ్య రంధ్రాలుంటాయి కాబట్టి కొద్దిరోజులు బతికే అవకాశముంది. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఫీటల్‌ ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్షతో ఇలాంటి పిల్లలను తల్లి కడుపులో ఉండగానే గుర్తించొచ్చు.
చికిత్స: వీరికి శస్త్రచికిత్స చేసి పుపుస, బృహద్ధమనులను అటూ ఇటూ మార్చి, సరిచేస్తారు (ఆర్టిరియల్‌ స్విచ్‌). దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. చికిత్స అనంతరం వీళ్లు మామూలు పిల్లల కన్నా మరింత బాగుంటారు.
3. పల్మనరీ వీన్‌ అనామలస్‌ డ్రైనేజ్‌: ఊపిరితిత్తుల నుంచి గుండెకు నాలుగు సిరలు వస్తాయి. మామూలుగా ఇవి ఎడమ కర్ణికకు రావాలి. అలా కాకుండా కొందరికి ఎక్కడో సిరల్లోనో, కాలేయంలోనో, కుడి కర్ణికలోనో తెరచుకుంటాయి. అప్పుడు మంచి రక్తం చెడు రక్తం కలిసిపోయి, ఎక్కువ మొత్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, బిడ్డ నీలంగా అవుతుంది. ఆయాసం వస్తుంది. గుండె కూడా విఫలమవుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. పిల్లలు బాగా నీరసపడతారు. పుట్టిన రెండు, మూడు రోజుల నుంచే లక్షణాలు కనిపిస్తుంటాయి.
చికిత్స: ఎక్స్‌రే, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్షలు చేసి సమస్యను నిర్ధరిస్తారు. తర్వాత ఛాతీని తెరచి సర్జరీ చేస్తారు. ఊపిరితిత్తుల నుంచి వచ్చే సిరలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయో గుర్తించి, వాటిని అక్కడి నుంచి వేరుచేసి.. ఎడమ కర్ణికలోకి వచ్చేలా అమరుస్తారు. వీరికి సత్వర చికిత్స అవసరం. పుట్టిన తర్వాత ఎంత త్వరగా శస్త్రచికిత్స చేస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది.


నివారించుకోవచ్చా?

పుట్టు గుండె లోపాలకు కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. కానీ కొన్ని అంశాలు కారణం కావొచ్చని భావిస్తున్నారు. వీటిని సరిదిద్దుకుంటే శిశువులను గుండె లోపాల బారినపడకుండా చూసుకోవచ్చు.
పోషకాల లోపం: పిండంలో గుండె తొలి 8 వారాల్లోనే మొదలవుతుంది. ఈ సమయంలో తల్లిలో పోషకాలు లోపిస్తే.. ముఖ్యంగా ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12, విటమిన్‌ డి సరైన మోతాదుల్లో లేకపోతే గర్భస్థ శిశువు ఎదుగుదల కుంటుపడుతుంది. డీఎన్‌ఏ, అమైనో ఆమ్లాల్లో సమస్యలు మొదలై గుండె లోపాల వంటి వాటికి దారితీయొచ్చు. కాబట్టి గర్భధారణకు సిద్ధం అవుతున్న తరుణంలోనే మంచి పోషకాహారం తీసుకోవాలి.
గర్భధారణ సమయం: ఆడవారిలో 21 ఏళ్ల లోపు అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. శారీరకంగా, మానసికంగా గర్భధారణకు అనువుగా ఉండరు. అందువల్ల 21 ఏళ్ల లోపు గర్భం ధరించకుండా చూసుకోవాలి. అలాగే 35 ఏళ్ల తర్వాత గర్భం ధరించినా ఇబ్బందే. అండంలో క్రోమోజోముల మార్పులతో పుట్టుకతో లోపాలు సంభవించొచ్చు.
గర్భిణి ఇన్‌ఫెక్షన్లు: తొలి మూడు నెలల్లో గర్భిణికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు.. ముఖ్యంగా రుబెల్లా వస్తే గుండె లోపాలకు దారితీయొచ్చు.
మేనరిక వివాహాలు: మేనరిక పెళ్లి చేసుకున్నవారికి పుట్టే పిల్లల్లో ప్రతి వెయ్యిమందిలో 40-50 మందికి జన్యుపర కారణాలతో గుండె లోపాలు వచ్చే అవకాశముంది.
దురలవాట్లు: మద్యం, పొగ తాగటం వంటి దురలవాట్లూ పిండం ఎదుగుదల మీద ప్రభావం చూపుతాయి. పక్కవారు వదిలిన సిగరెట్‌ పొగను పీల్చినా ప్రమాదమే.
పురుగుమందులు, రేడియేషన్‌: గర్భం ధరించిన తొలివారాల్లో పంటలకు చల్లే పురుగు మందుల వాసన ప్రభావంతో గుండె లోపాలు తలెత్తొచ్చు. అలాగే రేడియేషన్‌, కొన్నిరకాల మందుల ప్రభావానికి గురైనా ప్రమాదమే.
- ఇలాంటి ముప్పు కారకాలు గలవారు గర్భం ధరిస్తే ఒకసారి ఫీటల్‌ ఎకో పరీక్ష చేయించుకోవటం మంచిది. సాధారణంగా దీన్ని 18-22 వారాల మధ్యలో చేస్తారు. గుండె లోపాలు చాలావరకు ఇందులో బయటపడతాయి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరీ తీవ్రమైన సమస్యలున్నా కూడా గర్భస్రావం చేయించుకోవాల్సిన అవసరం లేదు. అన్నిరకాల గుండె లోపాలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ముందే గుర్తిస్తే వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయటానికి అవకాశముంటుంది. ఇప్పుడు పేదవారికి కొన్ని సంస్థలూ అండగా నిలుస్తున్నాయి. పుట్టిన వెంటనే శస్త్రచికిత్స నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని