చుక్‌ చుక్‌ బస్సు వస్తోంది!

అదేంటి? చుక్‌..చుక్‌ రైలు అనాలి కదా! బస్సేంటి? అంటారా! కానీ ఈ బస్సు గురించి తెలిస్తే మీరూ అదే మాట అంటారు. ఆ వివరాలన్నీ తెలుసుకునేందుకు పదండి మరి!

Published : 23 Jan 2022 04:19 IST

అదేంటి? చుక్‌..చుక్‌ రైలు అనాలి కదా! బస్సేంటి? అంటారా! కానీ ఈ బస్సు గురించి తెలిస్తే మీరూ అదే మాట అంటారు. ఆ వివరాలన్నీ తెలుసుకునేందుకు పదండి మరి!

ఎక్కడన్నా బస్‌.. రోడ్డు మీద వెళుతుంది. రైలు.. పట్టాల మీద నడుస్తుంది కదా! కానీ ఈ బండిని చూడండి. పట్టాలమీద ఉన్నప్పుడేమో రైలులా వెళుతుంది. రోడ్డు మీదకు రాగానే బస్సులా మారిపోతుంది. అంటే ఇంటినుంచి బస్సు ఎక్కితే రైల్వే స్టేషన్లో దిగాల్సిన పనిలేదు. సరాసరి వెళ్లిపోయేలా ఇదే రెండింటిలా ఉపయోగపడుతుంది. భలే కదా!

ఎక్కడుంది?

దీన్ని జపాన్‌లోని కైయో పట్టణంలో వాహన తయారీదారులు తయారుచేశారు. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి డ్యుయల్‌ మోడ్‌ వెహికల్‌ అట. ఇది డీజిల్‌తో నడుస్తుంది. ఇందులో సుమారు 21 మంది ప్రయాణించవచ్చట.

బస్సు నుంచి రైలులా...

ఇది రోడ్డుమీద ప్రయాణిస్తూ.. రైలు పట్టాల మీదకు మారడానికి కేవలం 15 సెకన్ల సమయం చాలట. అంటే రోడ్డు మీద నుంచి సరాసరి పట్టాలమీదకు ఎక్కేస్తుందన్నమాట. బస్సుగా అయితే గంటకు 100 కి.మీ వేగంతో వెళుతుంది. అదే రైలుగా అయితే గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందట. ఇలాంటి వాహనాలు మనకు కూడా వచ్చేస్తే ఎంత బాగుణ్నో అనిపిస్తుంది కదా! అంతేగా మరి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని