ఎత్తయిన ఏంజెల్‌ జలపాతం ఉన్నదిక్కడే!

వెనిజులా రాజధాని : కరాకస్‌ జనాభా : 3.1 కోట్లు విస్తీర్ణం : 9,16,445 చ.కి.మీ కరెన్సీ : వెనిజులన్‌ బొలివర్‌ భాష : స్పానిష్‌ జెండా : ఎరుపు, పసుపు రంగులు ధైర్యానికి, నీలం స్వతంత్ర వెనిజులాకి గుర్తులు. మధ్యలో ఎనిమిది తెల్లటి నక్షత్రాలు విప్లవానికి ప్రతీక.

Published : 21 Aug 2016 01:17 IST

ఎత్తయిన ఏంజెల్‌ జలపాతం ఉన్నదిక్కడే!
వెనిజులా  


రాజధాని : కరాకస్‌
జనాభా : 3.1 కోట్లు
విస్తీర్ణం : 9,16,445 చ.కి.మీ
కరెన్సీ : వెనిజులన్‌ బొలివర్‌
భాష : స్పానిష్‌


జెండా

ఎరుపు, పసుపు రంగులు ధైర్యానికి, నీలం స్వతంత్ర వెనిజులాకి గుర్తులు. మధ్యలో ఎనిమిది తెల్లటి నక్షత్రాలు విప్లవానికి ప్రతీక.

* వెనిజులాలో నీటికంటే చమురే చవక. సౌదీ అరేబియా తరువాత చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశం ఇది. మొన్న మొన్నటి వరకు ఇక్కడ లీటరు సబ్సిడీ పెట్రోల్‌ ధర ఒక రూపాయిలోపే!


* వెనిజులా అనే పదం... వెనిజోలియా (బుల్లి వెనిస్‌) అనే ఇటాలియన్‌ పదం నుంచి వచ్చింది. అక్కడి మారాకైబోలో ఉన్న సరస్సులో ప్రాచీనులు కర్రలుపాతి దానిపైనే ఇళ్లు కట్టుకున్నారు. అది వెన్నిస్‌ను పోలినట్టు ఉండటంతో దీనికి వెనిజులా అని పేరొచ్చింది.
* ప్రపంచంలోనే ఎత్తయిన ఏంజెల్‌ జలపాతం ఇక్కడిదే. దీని పొడవు 3,212 అడుగులు. ఇది నయాగరా జలపాతం కంటే పదిహేడు రెట్లు ఎత్తయినది.
* పూర్వం ఈ దేశం స్పెయిన్‌ పాలనలో ఉండేది. 15 ఏళ్ల పోరాటాల అనంతరం 1821లో పూర్తి స్వతంత్రం పొందింది.
* ఇక్కడ వాతావరణం స్థిరంగా ఉండదు. ఏడాదిలో 160 రాత్రులపాటు మెరుపులు, పిడుగులు వస్తూనే ఉంటాయి. తుపానులూ అధికమే.
* ప్రపంచంలో ఎక్కువసార్లు అందాలపోటీల్లో గెలిచిన అమ్మాయిలు ఈ దేశానికి చెందినవారే.


* ఇక్కడున్న ‘శాన్‌ఆంటోనియా జైలు’ చిత్రంగా ఉంటుంది. ఈ జైలుని, దానికి ఆనుకుని ఉన్న బీచ్‌ని చూసేందుకు ఇక్కడికి బోలెడు మంది పర్యటకులు వస్తుంటారు. వారందరికీ ఇక్కడి ఖైదీలు నోరూరించే వంటకాలు చేసి పెడతారు. వివిధ స్టాళ్లను నడుపుతారు. ఇక్కడ ఖైదీలు కుటుంబంతో సహా ఉండే వీలుంది. వారికిక్కడ టీవీలు, ఏసీలు, ఈత కొలను, క్రీడా మైదానాలు, నైట్‌క్లబ్‌లాంటి సకల సౌకర్యాలు ఉంటాయి.
* మరణశిక్షను రద్దు చేసిన ఆధునిక దేశమిది. 1863లోనే ఈ నిర్ణయం తీసుకుంది.
* దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్న అతిపెద్ద అడవి అమెజాన్‌లో కొంత భాగం ఈ దేశంలోనూ ఉంది. ప్రపంచంలో ఎక్కువ జీవజాతులు ఉన్న దేశాల్లో వెనిజులా ఏడోది.


* రాజధాని కరాకస్‌లో ఓ అమెరికన్‌ టీవీ షోకోసం కట్టి, అసంపూర్తిగా వదిలేసిన 45 అంతస్తుల ఆకాశ హర్మ్యం ఒకటుంది. దాన్ని 2007లో మురికివాడల్లోని ప్రజలుండేందుకు కేటాయించారు. దీంతో ఎత్తయిన మురికివాడగా ఈ భవనం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దానిలో 3000 మంది జనం నివసిస్తున్నారు. ఇందులోనే చిన్నచిన్న దుకాణాలూ ఉన్నాయి.

* ఇక్కడ ఏకంగా 25000 ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ఈ దేశ జాతీయ పుష్పం పేరు ‘ఫ్లోర్‌దే మయో ఆర్కిడ్‌’.
* ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక విగ్రహం ఇక్కడే ఉంది. దీని పేరు విర్జెన్‌ డిలాపాజెన్‌ ట్రుజిల్లో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని