ఏపీ సీఎస్‌ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు

పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి పట్టించుకోలేదు.

Updated : 08 May 2024 09:29 IST

పింఛను నగదు కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

గాజువాక, న్యూస్‌టుడే: పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి పట్టించుకోలేదు. వైకాపా ప్రభుత్వ రాజకీయ క్రీడకు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలను రుజువుచేస్తూ పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా మార్గదర్శకాలు జారీచేశారు. ఉన్నతాధికారుల ఉదాసీనత పుణ్యమా అని పండుటాకులు నానా పాట్లు పడుతున్నారు. నెలవారీ పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమకాక పోవడంతో విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన పింఛనుదారులు మంగళవారం ఉదయాన్నే జోరువానలో తడుస్తూ జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం వద్ద ఉన్న యూసీడీ (అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌) కేంద్రానికి చేరుకున్నారు. బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో నగదు ఇవ్వలేదని, తమ సంగతేమిటో తేల్చాలంటూ పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అధికారులతో వాదనకు దిగారు. దీంతో బ్యాంకుల సిబ్బంది, యూసీడీ ఉద్యోగులు కలిసి బాధితుల పేర్లు నమోదు చేసుకుని.. పరిశీలన చేస్తామని తిరిగి పంపేశారు. ఇక్కడైనా నగదు ఇస్తారని వచ్చామని, మళ్లీ ఖాతాల్లోనే వేస్తాం, బ్యాంకులకు వెళ్లాలని చెప్పడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు