logo

హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు

సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్‌ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్‌ రింగైనట్లు అనిపించింది.

Updated : 08 May 2024 08:14 IST

 

  • సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్‌ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్‌ రింగైనట్లు అనిపించింది. ఆఫీసు నుంచేమోనని బైక్‌ పక్కన ఆపి హలో అనడంతో.. అటువైపు నుంచి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో మీ ఓటు ఏ పార్టీకి వేస్తున్నారో తెలుసుకోవచ్చా..! అని గొంతు వినబడటంతో సిద్ధార్థకు పట్టలేని కోపమొచ్చింది. ఏమిచేసేది లేక ‘నా ఓటు నా ఇష్టం’ నేను ఓటు ఎవరికేస్తానో మీకు చెప్పను అని ఫోన్‌ కట్‌ చేశారు.
  • మరో చోట.. కిషన్‌ ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లారు. కంపెనీ వారు ఫలితాలను త్వరలో ఫోన్‌ ద్వారా చెబుతామన్నారు. దాంతో కంపెనీ నుంచి ఫోన్‌ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్న కిషన్‌కు రోజుకు పదిసార్లు వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని వచ్చే ఫోన్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారు.
  •  లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థుల వాయిస్‌లతో చరవాణులకు వాయిస్‌ సందేశాలు పంపిస్తున్నారు.

ఈ నెంబరు నొక్కండి..

న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌: ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు అవకాశాలను ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సర్వే ఏజెన్సీలను సంప్రదిస్తుంటారు. అభ్యర్థులు ఏజెన్సీలకు పెద్దమొత్తంలో చెల్లిస్తుండటంతో గతంలో పదుల సంఖ్యలో ఉన్న ఏజెన్సీలు ప్రస్తుతం వందల సంఖ్యలో పెరిగాయి. గతంలో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి వారు వెల్లడించే అభిప్రాయాలపై సర్వే చేసి నివేదికలు సమర్పించేవారు. నిజానికి ఆ సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉండేవి. ప్రస్తుతం సాంకేతికతను వినియోగించి చేసే సర్వేలతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమయం సందర్భం లేకుండా ఫోన్‌లు చేస్తూ.. మీరు ఈ అభ్యర్థికి ఓటేయాలంటే ఈ నంబరును నొక్కండి. కాదు అనుకుంటే ఇంకో నంబరు నొక్కండి అంటూ.. పదే పదే ఫోన్‌లు చేస్తూ ఓటర్ల ఓపికను పరీక్షిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లోనూ..

వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని 18.24 లక్షల ఓటర్లకు దగ్గరవడం అభ్యర్థులకు కష్టమైన విషయం. అందుకోసమే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లపై ప్రత్యేక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచి ప్రచార చిత్రాలు, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రత్యేకంగా సోషల్‌మీడియా సైన్యాలు పనిచేస్తున్నాయి. పదుల సంఖ్యలో కార్యక్రమాలు, సమావేశాల ఫొటోలతో వాట్సాప్‌ గ్రూపులను నింపేస్తున్నారు. తమ అనుమతి తీసుకోకుండానే ఇష్టారీతిన తమ నెంబర్లతో వాట్సాప్‌ గ్రూపులు రూపొందిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

సిమ్‌కార్డు కొనుగోలు చేసే సమయంలోనే మీ నంబరు పబ్లిక్‌ డొమైన్‌లో ఉండొచ్చా.. లేదా గోప్యంగా ఉంచాలనుకుంటున్నారా..? అని చిన్న అక్షరాలతో రెగ్యులెటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలు పొందుపరిచి ఉంటాయి. వాటిని మనం గమనించకుండానే సంతకాలు పెట్టి సిమ్‌కార్డులను కొనుగోలు చేస్తుంటాం. అలాంటి ఫోన్‌ నెంబర్లను థర్డ్‌ పార్టీ మొబైల్‌ సిమ్‌కార్డు కలెక్షన్‌ ఏజెన్సీలు డిమాండును బట్టి అవసరమైన వారికి విక్రయిస్తుంటాయి. ఏరియాను బట్టి నంబర్లకు ధర నిర్ణయిస్తారు.

ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల నంబర్లకు ఓ ధర ఉంటే మెట్రోపాలిటన్‌ నగరాలకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు కావాలంటే వేరే ధర నిర్ణయించి విక్రయిస్తారు. వారి నుంచి సర్వే ఏజెన్సీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలకు సంబంధించిన వారి ఫోన్‌ నంబర్లను కొనుగోలు చేసి ఫోన్‌లు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు