1300 ఏళ్లనాటి హోటలిది!

ఏదైనా భవంతి వందో, రెండొందలో ఏళ్ల నుంచి చెక్కుచెదరకుండా ఉందంటేనే ఎంతో ఆశ్చర్యపోతాం. ఇంకేదైనా హోటల్‌ని ఏర్పాటు చేసి వంద ఏళ్లు దాటితేనే దాని గురించి బోలెడు గొప్పలు చెప్పుకుంటాం. మరి పదమూడు వందల ఏళ్లనాటిదైతే... మాటల్లో చెప్పనక్కర్లేదు.....

Published : 21 Sep 2016 01:07 IST

1300 ఏళ్లనాటి హోటలిది!

హోటల్‌కి ఎందుకెళతాం... అయితే కమ్మటి భోజనం తినడానికి...లేదంటే సరదాగా విశ్రాంతి తీసుకోవడానికి... కానీ ఒక దగ్గర హోటల్‌ని చూడ్డానికి కూడా వెళతారు... ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి?
దైనా భవంతి వందో, రెండొందలో ఏళ్ల నుంచి చెక్కుచెదరకుండా ఉందంటేనే ఎంతో ఆశ్చర్యపోతాం. ఇంకేదైనా హోటల్‌ని ఏర్పాటు చేసి వంద ఏళ్లు దాటితేనే దాని గురించి బోలెడు గొప్పలు చెప్పుకుంటాం. మరి పదమూడు వందల ఏళ్లనాటిదైతే... మాటల్లో చెప్పనక్కర్లేదు. అందుకే ప్రపంచంలోనే అతి పురాతనమైన హోటల్‌గా దీనికి గిన్నిస్‌ రికార్డు కట్టబెట్టేశారు. పేరు ‘నిషియమా అన్‌సెన్‌ కియున్‌కన్‌’. జపాన్‌లోని హయకావా, యమనిషి ప్రిఫెక్చర్‌ దగ్గర ఇది ఉంది.

* ప్రపంచ వ్యాప్తంగా రెండు మూడు వందల ఏళ్ల నుంచి నిరంతరంగా నడుస్తున్న రెస్టారెంట్లు ఉన్నా ఈ హోటల్‌కి మాత్రం ఏకంగా 1311 ఏళ్ల గొప్ప చరిత్రే ఉంది.
* చక్కని పరిసరాలతో, పసందైన వంటకాలతో దేశదేశాల రాజవంశీయులకు, ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.
* దీని చరిత్ర విషయానికి వస్తే, క్రీ.శ.705లో ఇక్కడి రాజవంశానికి చెందిన ఫుజివరా మహితో అనే రాజకుమారుడు ఈ హోటల్‌ని ఏర్పాటు చేశారు. తరతరాలుగా రాజులు మారినా ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఒకే కుటుంబానికి చెందిన 52 తరాలు ఈ హోటల్‌ని నడుపుతూ వచ్చాయి.

* జపనీస్‌ సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ఈ హోటల్‌ భవనంలో మొత్తం 35 గదులుంటాయి.
* అంతే కాదు ఈ హోటల్‌ మరో ప్రత్యేకత ఇక్కడి సహజసిద్ధమైన ఆరు వేడినీటి బుగ్గలు. అందుకే దీన్ని ‘హాట్‌ స్ప్రింగ్‌ హోటల్‌’ అని కూడా పిలుస్తారు. హోటల్‌ లోపల, బయట ప్రత్యేక ఏర్పాట్లతో ఉన్న ఈ వేడి నీటి బుగ్గల్లో హాయిగా సేదతీరుతూ పరిసరాల్ని ఆస్వాదించొచ్చు.
* ఈ పురాతన హోటల్‌ని 1997లో మరింతగా ముస్తాబు చేసి పర్యటకుల్ని ఆకట్టుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని