IPL 2024 - Playoffs: ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో 2 ఫిక్స్‌.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్‌ -4లో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది.

Updated : 10 May 2024 16:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.  అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న రాజస్థాన్‌ను దిల్లీ ఓడించి ప్లేఆఫ్స్‌ రేసును ఆసక్తికరంగా మార్చేసింది. ఇప్పటికీ​​​​ నాలుగు బెర్తుల్లో రెండింటిపై సందిగ్ధత నెలకొంది. రేసులో నిలిచిన ఆ జట్లేంటి? సమీకరణాలేంటో చూద్దాం.. 

వీరి ప్లేస్‌ ఫిక్స్‌

ప్రస్తుతం చెరో 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా, రాజస్థాన్‌.. ఎనిమిదింట గెలిచి 16 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఈ రెండు జట్లూ తమ మిగతా మ్యాచుల్లో ఓడిపోయినా ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా రన్‌రేట్‌ను బేరీజు వేసుకుని ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కనుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక్క విజయం నమోదు చేస్తే చాలు.  

మూడింటిలో రెండు ఏవి?

చెన్నై: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో చెన్నై ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న రుతురాజ్‌ సేన ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. అన్నింట్లోనూ గెలిస్తే పాయింట్లు 18కి చేరతాయి. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా నాకౌట్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచుల్లో గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో సీఎస్కే తలపడనుంది. 

హైదరాబాద్‌: 11 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది.  మిగతా మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకొనేందుకు ఇబ్బంది ఉండదు. లఖ్‌నవూ, గుజరాత్, పంజాబ్‌ జట్లతో సన్‌రైజర్స్ ఆడనుంది. అయితే ఈ మూడు మ్యాచులూ సొంత మైదానంలో జరగడం కలిసొచ్చే అంశం. 

లఖ్‌నవూ: కోల్‌కతా చేతిలో ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో కిందికి జారింది లఖ్‌నవూ. నెట్‌ రన్‌రేట్‌ కూడా మైనస్‌ల్లోకి వెళ్లిపోయింది. 11 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించిన లఖ్‌నవూ మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుంది. తన తర్వాత మ్యాచుల్లో హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి జట్లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచుల్లో గెలిస్తే లఖ్‌నవూ ఎలాంటి ఇబ్బందిలేకుండా నాకౌట్‌కి వెళ్తుంది.

ఛాన్స్‌ ఉంది కానీ..

పైన మూడు జట్లతో పోలిస్తే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్న టీమ్‌ దిల్లీ. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లను ఆడిన పంత్‌ సేన ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగతా రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి. అయినా ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుందనే నమ్మకం తక్కువే. చెన్నై, లఖ్‌నవూ, హైదరాబాద్‌ తమ మిగతా మ్యాచుల్లో ఓడిపోతేనే దిల్లీకి ఛాన్స్‌ ఉంటుంది. ఇక దిల్లీ తన తదుపరి మ్యాచుల్లో బెంగళూరు, లఖ్‌నవూతో తలపడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు