Arvind Kejriwal: కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై.. మే 10న తీర్పు

Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.

Published : 08 May 2024 17:38 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. దీనిపై మే 10వ తేదీన (శుక్రవారం) మధ్యంతర ఆదేశాలను వెలువరిస్తామని జస్టిస్‌ ఖన్నా నేడు వెల్లడించారు. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజున వాదనలు వింటామని తెలిపారు.

ఈ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు దిల్లీ సీఎంను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. అయితే, అరెస్టు పిటిషన్‌పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంతర బెయిల్‌ (Interim Bail Order) ఇచ్చే అంశాన్ని పరిగణిస్తామని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈక్రమంలోనే మంగళవారం దీనిపై విచారణ జరిపింది.

బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు

ఒకవేళ, ఈ కేసులో కేజ్రీవాల్‌ (Arvind Kejriwal's Bail)కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది.

కేజ్రీవాల్‌కు సౌకర్యాలు కోరుతూ పిటిషన్‌..

ఇదిలాఉండగా.. తిహాడ్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ పాలనాపరమైన బాధ్యతలు నిర్వర్తించేలా తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అలాగే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులను నిలువరించాలని, వాటిని ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘మేం ఎమర్జెన్సీ విధించాలా? మార్షల్‌ చట్టాన్ని అమలుచేయాలా? రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మేం మీడియాపై సెన్సార్‌షిప్‌ ఎలా విధించగలం?’’ అని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ రూ.లక్ష జరిమానా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని