Rohit - Yuvraj: ‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్‌లో పూర్’

ఒకరు మాజీ క్రికెటర్.. మరొకరు ప్రస్తుతం టీమ్‌ఇండియా కెప్టెన్. వీరద్దరూ కలిసి ఓ షోలో చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Published : 08 May 2024 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా తొలిసారి టీ20 వరల్డ్‌ కప్‌ (2007) నెగ్గిన జట్టులో యువరాజ్‌ సింగ్‌, రోహిత్ శర్మ సభ్యులు. యువీ తన కెరీర్‌ అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు రోహిత్‌ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ చాలా మ్యాచ్‌లు కలిసి ఆడారు. ఐపీఎల్‌లో ముంబయి జట్టుకూ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్‌ సింగ్‌ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్‌ మరోసారి పొట్టి కప్ బరిలోకి దిగనుంది. తాజాగా వీరిద్దరూ ఓ షోలో పాల్గొన్నారు. ఒకరి గురించి మరొకరు ఆసక్తికర విశేషాలు వెల్లడించారు.

అమ్మో.. యువరాజ్‌ అంటే భయమే: రోహిత్

‘‘నేను భారత్‌ తరఫున అప్పుడే జట్టులోకి వచ్చా. తొలిసారి టీమ్‌ బస్‌ ఎక్కా. దురదృష్టవశాత్తూ యువీ సీట్‌లోనే కూర్చున్నా. అదే సమస్య అయింది. ఆటగాళ్లు తమ సీట్లను అట్టిపెట్టుకుంటారని నాకు తెలియదు. అప్పుడే యువీ వచ్చాడు. కేవలం కళ్లతోనే అక్కడినుంచి కదులు అన్నట్లుగా సైగలు చేశాడు. నా వెనక ఆర్పీసింగ్‌ ఉన్నాడు. అది యువీ సీట్‌ అని నాకు వివరించాడు. ఓకే.. నేను నా పేరును మిస్‌ అయినట్లు ఉన్నాననుకున్నా. యువీ అందర్నీ భయపెడతాడు. అలా చేయడమంటే చాలా ఇష్టం’’ అని నవ్వుతూ రోహిత్‌ తెలిపాడు. 

తొలిసారి కలిసినప్పుడు.. : యువీ

‘‘2007 సమయంలో రోహిత్ ఇంకా కుర్రాడే. చాలా సరదాగా ఉండేవాడు. ముంబయిలోని బోరివలి నుంచి వచ్చేవాడు. ఇంగ్లీష్‌ చాలా దారుణంగా ఉండేది. ఎప్పుడూ టీజ్‌ చేస్తూ ఉండేవాళ్లం. చాలా అద్భుతమైన వ్యక్తి. నేను అతడి నాయకత్వంలోనే ముంబయి జట్టుకు ఆడా. ఇంత విజయవంతమైనప్పటికీ పర్సన్‌గా మాత్రం మారలేదు. అప్పటికీ.. ఇప్పటికీ అదే రోహిత్. సహచరులతోనూ చాలా ఫన్నీగా ఉంటాడు. క్రికెట్‌లో నాకు అత్యంత దగ్గరైన స్నేహితుల్లో అతడు ఒకడు. తప్పకుండా రోహిత్‌ చేతుల్లో ప్రపంచకప్‌ను చూస్తామనే నమ్మకం ఉంది’’ అని యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని