చూడ చక్కనమ్మ... రూపు చిత్రమమ్మా!

హలో... హలో... నేను కనిపించానా? మాట్లాడుతున్నదెవరో అర్థంకాక అయోమయంగా అటూ ఇటూ వెతుకుతున్నారా? ఇక్కడో ఈకల గుత్తిలాంటిది కనిపిస్తోందా? ఆ ఈకలు నావేలేండి. వాటి లోపలి నుంచే మాట్లాడుతున్నా. నా పేరు ఫెదర్‌ స్టార్‌. పేరుకు తగ్గట్టే చూడ్డానికి భలే ఉన్నా కదూ.

Published : 10 Aug 2017 01:09 IST

చూడ చక్కనమ్మ... రూపు చిత్రమమ్మా!

హలో... హలో... నేను కనిపించానా? మాట్లాడుతున్నదెవరో అర్థంకాక అయోమయంగా అటూ ఇటూ వెతుకుతున్నారా? ఇక్కడో ఈకల గుత్తిలాంటిది కనిపిస్తోందా? ఆ ఈకలు నావేలేండి. వాటి లోపలి నుంచే మాట్లాడుతున్నా. నా పేరు ఫెదర్‌ స్టార్‌. పేరుకు తగ్గట్టే చూడ్డానికి భలే ఉన్నా కదూ. అదొక్కటే కాదు నాలో గమ్మత్తైన సంగుతులు ఇంకా బోలెడున్నాయి. తెలుసుకోవాలంటే నేను చెప్పే కబుర్లన్నీ వినాల్సిందే.

* నన్ను మీరు సరదాగా ఈకల నక్షత్ర చేపని పిలుచుకోవచ్చు. పొడవాటి కోడీకల్లా ఉండే నా ఈకలే నా రెక్కలు. వాటితోనే సముద్రం అడుగున నడిచేస్తా. వాటిని లయ బద్ధంగా కదుపుతూ నీళ్లలో ఎంచక్కా ఈతకొట్టేస్తా. అప్పుడు నేను ఎంత అందంగా ఉంటానో తెలుసా? కావాలంటే నా పేరుతో ఉన్న వీడియో ఒక్కసారి చూడండి నా ఈత ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.
* రెక్కల కిందగా నాకు ఐదు జతలకు పైగా కాళ్లుంటాయి. వీటితో నడవలేను. కాకపోతే ఏ రాయినో, మొక్కనో పట్టుకుని ఉండాలనుకుంటే వాటిని ఉపయోగిస్తా.
* సముద్రపు లో....తుల్లో జీవిస్తా. ఎంత లోతులో అంటే ఏకంగా 30వేల అడుగుల లోపల మరి. అందుకే మీరెప్పుడూ నన్ను చూసుండరు.
* మధ్యలో చిన్నగా ఉండే నా శరీరం చుట్టూ గుబురుగా పొడవాటి ఈకలు వేల్లాడుతుంటాయి. దీంతో లోపలున్న నేను అస్సలు కనిపించను.
* ఈకలతో కలిపి లెక్కేసుకున్నా 3.3 అడుగుల్లోపే పొడవుంటా. ఈకల మధ్యలో గుండ్రటి శరీరం ఉంటుందా. దాని మధ్యలోనే నోరూ ఉంటుంది నాకు. దానిలోంచి నీళ్లు పోనిస్తా. వాటితోపాటే నా నోటిలో చిక్కుకున్న చిన్న చిన్న ఆహార పదార్థాల్ని గుటుక్కుమనిపిస్తా.
* సముద్ర జీవుల్లో మేము క్రినోయిడియా తరగతికి చెందినవాళ్లం. మాలో 600కుపైగా రకాలున్నాయి. స్టార్‌ ఫిష్‌లం కాదుగానీ వాటికి దూరపు చుట్టాలం. మా గురించి బోలెడు వివరాలు చెప్పా కదూ. ఇక వెళ్లిరానా మరి. ఉంటానేం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని