Gujarat Vs Chennai: ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?

ప్లేఆఫ్స్‌ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్‌ను అహ్మదాబాద్‌ వేదికగా ఢీకొట్టనుంది.

Updated : 10 May 2024 12:32 IST

ఇంటర్నెట్ డెస్క్: పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్న గుజరాత్‌తో ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై తలపడేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌ రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. 

తేలికైన ప్రత్యర్థే కానీ.. 

  • ప్రస్తుత సీజన్‌లో అన్ని జట్ల కంటే గుజరాత్ మాత్రమే చెన్నైకు తేలికైన ప్రత్యర్థి. ఆ జట్టు మిగతా మ్యాచుల్లో రాజస్థాన్‌, బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతుండగా.. రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 
  • గుజరాత్‌పై చెన్నై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు దూసుకొస్తుంది. పాయింట్ల పట్టికలోనూ మూడో స్థానానికి చేరుకుంటుంది. అప్పుడు సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోతుంది.
  • ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే అధికారికంగా ఎలిమినేట్‌ కాకుండా ఉంటుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంటుంది. వరల్డ్ కప్‌ ట్రావెల్‌ రిజర్వ్‌ కోసం ఎంపికైన కెప్టెన్‌ గిల్‌కు ఈ మ్యాచ్‌ కీలకం.
  • చెన్నై బౌలింగ్‌ విభాగంలో కీలకంగా వ్యవహరించిన పతిరన, ముస్తాఫిజుర్ ఇప్పటికే ఆ జట్టు క్యాంప్‌ను వదిలి స్వదేశానికి చేరారు. దీంతో దేశవాళీ బౌలర్లు తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జిత్, శార్దూల్, జడేజా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. 
  • చెన్నై బ్యాటింగ్‌ విభాగంలో అజింక్య రహానె కుదురుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ రుతురాజ్‌ (541) ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నప్పటికీ.. విరాట్ (634) కంటే 93 పరుగుల వెనుకబడి ఉన్నాడు. శివమ్‌ దూబె, ధోనీ నుంచి అభిమానులు కీలక ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.
  • అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. టాస్‌ నెగ్గే జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
  • ఇప్పటి వరకు చెన్నై, గుజరాత్ ఆరు మ్యాచుల్లో తలపడగా.. చెరి మూడు విజయాలు సాధించాయి. గతేడాది ఫైనల్‌లో జీటీపై చెన్నై చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
  • రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో టాస్‌ ఓడిపోయాడు. అందులో ఐదింట్లో గెలవడం విశేషం. ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు టాస్‌ ఓడిన జట్టు కూడా చెన్నైనే. రాజస్థాన్‌ 2022 ఎడిషన్‌లోనూ తొలి 11 మ్యాచుల్లో పదింట్లో టాస్‌ను కోల్పోయింది.

గుజరాత్‌ జట్టు (అంచనా): వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాతియా, షారుఖ్‌ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

చెన్నై జట్టు (అంచనా): అజింక్య రహానె, రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్‌ దూబె, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని