Mani Shankar Aiyar: ‘పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యల దుమారం

Mani Shankar Aiyar: పాక్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్‌ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్ అయ్యర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది.

Updated : 10 May 2024 12:37 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న భారతీయుల రూపురేఖలపై శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ (Mani Shankar Aiyar) మరోసారి పార్టీని ఇరుకునపడేశారు. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని గౌరవించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి.

భారత్‌-పాక్‌ (India-Pakistan) సంబంధాలపై మణిశంకర్‌ అయ్యర్‌ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘‘పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలి. అంతేగానీ సైన్యంతో రెచ్చగొట్టొద్దు. అలా జరిగితే ఉద్రిక్తతలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ దేశం వద్ద అణుబాంబులు (Atom Bombs) ఉన్నాయి. అందువల్ల ఆ దేశాన్ని మనం గౌరవించాలి. వారిని గౌరవించకపోతే భారత్‌పై అణు బాంబులు ఉపయోగించాలని ఆలోచన చేస్తారు. మనవద్దా ఆ అస్త్రాలు ఉన్నాయి. కానీ లాహోర్‌పై మనం ప్రయోగిస్తే.. దాని తాలూకు రేడియేషన్‌ అమృత్‌సర్‌ను చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు’’ అని అయ్యర్‌ ఆ వీడియోలో అన్నారు.

ఏప్రిల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలాకోట్‌ దాడి గురించి ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పాక్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు హాని తలపెట్టిన ముష్కరులు వారి స్వదేశానికి పారిపోయినా వేటాడి మరి హతమార్చుతామని అన్నారు. వీటిపై స్పందిస్తూనే అయ్యర్‌ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు: మరో వివాదంలో శామ్‌ పిట్రోడా

కాంగ్రెస్‌ అసలు రూపం ఇదే: భాజపా

కాగా.. అయ్యర్‌ వ్యాఖ్యలపై భాజపా (BJP) నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వీడియోను కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ షేర్‌ చేస్తూ.. ‘‘ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ వాస్తవ సిద్ధాంతం బయటపడుతోంది. పాకిస్థాన్‌కు అండగా ఉండటం, వారి మద్దతు తీసుకోవడం. అవసరమైతే సియాచిన్‌ను వదులుకోవడం..! యాసిన్‌ మాలిక్‌ వంటి ముష్కరులకు, ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం. అవినీతికి పాల్పడటం.. పేద ప్రజల సొమ్మును దోచుకోవడం.. విద్వేషంతో విభజన రాజకీయాలకు పాల్పడటం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పణంగా పెట్టి ముస్లింలను బుజ్జగించడం.. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం.. అబద్దాలు, నకిలీ గ్యారంటీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం.. ఇవే వారి సిద్ధాంతాలు’’ అని దుయ్యబట్టారు.

పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్‌

అయితే, అయ్యర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని దూరం జరిగింది. ‘‘అయ్యర్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను మేం పూర్తిగా విభేదిస్తున్నాం. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ విధానాలను ప్రతిబింబించదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని