BCCI - Dravid: కొత్త కోచ్‌ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా

ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్‌ రూల్‌పైనా మాట్లాడారు.

Updated : 10 May 2024 12:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ వస్తున్నారా..? బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను టీ20 ప్రపంచ కప్‌ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది. జూన్ 1 నుంచి పొట్టి కప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ముగిసే వరకూ అతడే కోచ్‌గా ఉంటాడు. ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మళ్లీ కొనసాగడానికి ద్రవిడ్‌ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్‌ కోసం ప్రకటన ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

‘‘రాహుల్ పదవీ కాలం జూన్‌ వరకే ఉంది. ఒకవేళ అతడు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. చేసుకోవచ్చు. కొత్త కోచ్‌ భారత్‌ నుంచి ఉంటారా? విదేశీయుడా? అనేది ఇప్పుడే చెప్పలేం. క్రికెట్‌ అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయం మేరకే ఉంటుంది. మాకు ప్రత్యేకంగా విభాగం ఉంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తారా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఆ నిర్ణయం కూడా సీఏసీ తీసుకుంటుంది. మా జట్టులో మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లు ఉన్నారు. విరాట్, రోహిత్, రిషభ్‌ పంత్‌.. ఇలా చాలా మంది అన్ని ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు’’ అని జైషా తెలిపారు.

ఇంపాక్ట్‌ రూల్‌పై.. 

ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ రూల్‌పై విమర్శలు వస్తున్నాయి. వాటిపైనా జైషా స్పందించారు. ‘‘ఆ నిబంధనను కేవలం టెస్టింగ్‌ కోసం ఈ సీజన్‌లో ప్రవేశపెట్టాం. ఇలా చేయడం వల్ల కొత్తగా ఇద్దరు భారతీయ క్రికెటర్లకు ఆడే అవకాశం వస్తుంది. బయట నుంచి కామెంట్లపై త్వరలోనే చర్చిస్తాం. ఇంపాక్ట్‌ రూల్‌పై తుది నిర్ణయం తీసుకొనే ముందు ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడతాం. ఇదేమీ శాశ్వతం కాదు. రూల్‌పై ఎవరి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ రాలేదు’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని